Home News న్యాయమూర్తులకు హితవు పలకండి: రాష్ట్రపతికి LRPF అభ్యర్ధన

న్యాయమూర్తులకు హితవు పలకండి: రాష్ట్రపతికి LRPF అభ్యర్ధన

0
SHARE

బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ దాఖలు చేసిన కేసులో విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యల పట్ల దేశవ్యాప్తంగా విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ కేసు సందర్భంగా సుప్రీంకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పరిదివాలా మాట్లాడుతూ  “ఉదయపూర్లో చోటు చేసుకున్న దారుణ హత్యకు నూపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై ఓ టీవీ ఛానెల్లో చేసిన వ్యాఖ్యలే కారణమని, ఆమె దేశానికి క్షమాపణ చెప్పాలని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

న్యాయమూర్తులు చేసే ఇటువంటి తీవ్ర వ్యాఖ్యల పట్ల న్యాయవ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఉందని హైదరాబాద్ కు చెందిన లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ రాష్ట్రపతికి వ్రాసిన లేఖలో అభిప్రాయపడింది. నూపుర్ శర్మ ఓ ఛానెల్ డిబేట్ కార్యక్రమంలో రాజ్యాంగం తనకు కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛను అనుసరించి, ప్రవక్త మహ్మద్ గురించిన విషయాలు, అయేషా అనే బాలికతో అతని వివాహం గురించి ఖురాన్ ఆధారంగా చేసిందని, ఆ వ్యాఖ్యలను ‘ప్రవక్త మహ్మద్ కు జరిగిన అవమానం’గా భావించిన అనేకమంది  కారణంగా ముస్లిం సమాజంలోని వ్యక్తులు కోపోద్రిక్తులు అయ్యారని తెలిపింది.

దీంతో ఆమెపై దేశవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని, అయినప్పటికీ ఆమెను మానభంగం చేయాలని, ఆమె తలను నరికివేయాలని అనేకమంది ముస్లిములు పిలుపునిస్తున్న విషయాన్నీ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ తమ లేఖలో తెలియజేసింది. ఆమె వ్యాఖ్యలను సమర్ధించినందుకు రాజస్థాన్ లోని ఉదయపూర్ కి చెందిన ఒక దర్జీని ఇద్దరు ముస్లిం యువకులు దారుణంగా హత్యచేయడంతో పాటు, ప్రధానిని కూడా హత్యచేస్తామని బెదిరిస్తూ వీడియో విడుదల చేశారని గుర్తుచేసింది.

ఇంతటి దారుణమైన తీవ్రవాద ఘటనకు నూపుర్ శర్మ టీవీలో చేసిన వ్యాఖ్యలే కారణమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయటం ద్వారా సుప్రీం న్యాయమూర్తులు, దేశవ్యాప్తంగా మరిన్ని ఇదే తరహా ఘటనలతో పాటు ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం, తద్వారా దేశానికే ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంటుందని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ తెలిపింది.

దీనిపై భారత రాష్ట్రపతి కల్పించుకుని, జడ్జీల తమ ప్రవర్తన విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండేలా చూడాల్సిందిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సూచన చేయాల్సిందిగా కోరింది. ఇదే సందర్భంలో భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ 2021లో జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో చేసిన ఉపన్యాసంలో “జడ్జీలు కోర్టు హాల్లో కేసుల విచారణ సందర్భంగా చేసే వ్యాఖ్యల పట్ల విచక్షణతో వ్యవరించాలి” అంటూ చేసిన హితోపదేశాన్ని  పునరుద్ఘాటించాల్సిన అవసరం ఉంది అని తెలిపింది.

Source : NIJAM TODAY