Home English Articles మహాత్మా గాంధీ జీవన దృష్టి అనుసరణీయం: డాక్టర్ మోహన్ భాగవత్

మహాత్మా గాంధీ జీవన దృష్టి అనుసరణీయం: డాక్టర్ మోహన్ భాగవత్

0
SHARE

ఆధునిక, స్వతంత్ర భారతపు ఉత్థాన గాథలో ఏ మహానుభావులను మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలో, ఎవరు భారతదేశ చరిత్రలో ఒక ముఖ్య అధ్యాయం వంటివారో అలాంటి వారిలో పూజ్య మహాత్మా గాంధీ ఒకరు. భారతదేశానికి ఆధారం ఆధ్యాత్మికత. ఈ దేశపు ఉన్నతిని సాధించడానికి రాజకీయాలలో ఆధ్యాత్మికతను పాదుకొలిపేందుకు మహాత్మా గాంధీ ప్రయత్నించారు.

గాంధీజీ చేసిన ప్రయత్నం కేవలం అధికార రాజకీయాలకే పరిమితం కాలేదు. సమాజంలో, ఆ సమాజాన్ని నడిపే నాయకుల్లో సాత్వికమైన ఆచరణ తీసుకురావడానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. స్వార్థం, అధికార కాంక్షతో కూడిన అహంకారపూరిత రాజకీయాలను ఆయన ఎప్పుడు అంగీకరించలేదు. సత్యం, అహింస, స్వావలంబనతో కూడిన నిజమైన స్వాతంత్రం ఆధారంగా భారతీయ జనజీవనం సాగాలని ఆయన కలలు కన్నారు. ఈ ఆలోచన, దృక్పధం గాంధీజీ జీవితం మొత్తంలో మనకు కనిపిస్తుంది.

1922లో గాంధీజీ అరెస్ట్ తరువాత నాగపూర్‌లో ఒక బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ తలపెట్టింది. ఆ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన డా. హెడ్గేవార్ మనసా, వాచా గాంధీజీ ఆచరణ ఒకటిగా ఉండేదని అంటూ ఆయనను ‘పుణ్యపురుషుడు’ అని సంబోధించారు. ఎంతో ధైర్యాన్ని కలిగిన గాంధీజీ తాను నమ్మిన సిద్ధాంతం కోసం సర్వస్వాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడేవారు. కేవలం గాంధీజీ గుణగణాలను ప్రశంసించడం వల్ల ఆయన కార్యం ముందుకు సాగదని, ఆ గుణాలను అనుసరిస్తూ మన జీవితాలను తీర్చిదిద్దుకున్నప్పుడే గాంధీజీ కోరుకున్నది సఫలం అవుతుందని డా. హెడ్గేవార్ అన్నారు.

పరాయిపాలన మూలంగా ఏర్పడే బానిస మనస్తత్వం ఎంత నష్టం కలిగిస్తుందో గాంధీజీకి బాగా తెలుసు. అందుకనే అలాంటి మనస్తత్వం నుంచి బయటపడి పూర్తి స్వదేశీ విధానం ఆధారంగా భారత్ అభివృద్ధి చెందాలని ఆయన కోరుకున్నారు. ‘హింద్ స్వరాజ్’ కోసం కలలు కన్నారు. ఆ రోజుల్లో పాశ్చాత్య భౌతికవాదం ప్రపంచాన్ని ముంచెత్తుతోంది. అధికార బలంతో పాశ్చాత్యులు తమ విధానాలను బలవంతంగా అమలు చేశారు. ఆర్థికంగా ఇతర దేశాలను తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు ప్రయత్నించారు. అలాంటి సమయంలో గాంధీజీ స్వావలంబనతో కూడిన జీవనవిధానాన్ని మన ముందు ఉంచడానికి సఫల ప్రయత్నం చేశారు. కానీ బానిస మనస్తత్వానికి బాగా అలవాటుపడినవారు మాత్రం పాశ్చాత్య దేశాల నుంచి వచ్చినదంతా మంచిదేనని భావించడమేకాక, తమ పూర్వీకులు, వారిపట్ల గౌరవం, సంస్కారాలను తృణీకరించారు. అంధానుకరణ, అపోహలకు బలయ్యారు. దాని ఫలితం నేటికీ దేశపు దశలోనూ, దిశలోనూ కనిపిస్తోంది.

గాంధీజీకి సమకాలీకులైన ఇతర దేశాల నాయకులు, మహాపురుషులు కూడా ఆయన అనుసరించిన స్వదేశీ విధానాన్ని, ఆలోచనను తమ తమ దేశాల్లో అమలుచేశారు. గాంధీజీ మరణించినప్పుడు శ్రద్ధాంజలి ఘటిస్తూ ప్రముఖ శాస్తవ్రేత్త ఐన్‌స్టీన్ ‘ఇలాంటి ఒక మహోన్నత వ్యక్తి ఈ నేలపై నడిచాడా అని భావి తరాలవారు ఆశ్చర్యపోతారు’ అన్నారు. అలాంటి పవిత్రమైన వ్యవహార శైలి, ఆలోచనలను గాంధీజీ మన ముందు ఉంచారు.

గాంధీజీ 1936లో వార్ధాకు దగ్గరలో జరిగిన సంఘ్ శిబిరాన్ని సందర్శించారు. ఆ తరువాతి రోజు ఆయన్ని కలుసుకోవడానికి డా. హెడ్గేవార్ వారి నివాసానికి వెళ్లారు. అక్కడ వారితో జరిపిన సుదీర్ఘమైన చర్చ, వారి మధ్య జరిగిన సంభాషణ వివరాలు ఇప్పుడు పుస్తకరూపంలో లభిస్తున్నాయి. దేశ విభజన సమయంలో ఢిల్లీలోని తన నివాసానికి దగ్గరగా ఉన్న సంఘ్ శాఖకు గాంధీజీ ఒకసారి వచ్చారు. ఆయన స్వయంసేవకులతో మాట్లాడారు కూడా. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు 27 సెప్టెంబర్, 1947నాటి ‘హరిజన్’ పత్రికలో ప్రచురితమయ్యాయి. సంఘ స్వయంసేవకుల క్రమశిక్షణాయుత, కులభేదాలకు అతీతమైన వ్యవహారశైలిని ఆయన ఎంతో మెచ్చుకున్నారు.

‘స్వత్వం’ ఆధారంగా భారత నిర్మాణం జరగాలని కోరుకున్నా, సామాజిక సమానత్వం, సమరసత ఆకాంక్షించిన, చెప్పినదే చేయాలనే ఉత్కృష్టమైన విలువకు ఉదాహరణగా నిలిచిన పూజ్య గాంధీజీని అర్థం చేసుకుని, వారు చెప్పిన విషయాలను మన జీవితాల్లో ఆచరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సద్గుణాలు, సదాచారం వల్లనే గాంధీజీతో కొన్ని విషయాల్లో విభేదించేవారు కూడా ఆయన పట్ల పూర్తి గౌరవభావానే్న చూపేవారు.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శాఖల్లో ప్రతి రోజు ఉదయం దేశానికి చెందిన మహాపురుషులందరిని స్మరిస్తూ ప్రాతఃస్మరణ చదువుతారు. ఇది సంఘ ప్రారంభ రోజుల నుంచి జరుగుతున్న కార్యక్రమం. మరికొందరి పేర్లు చేర్చి 1963లో కొత్త ప్రాతఃస్మరణ స్తోత్రం వచ్చింది. అప్పటికి పూజ్య గాంధీజీ స్వర్గస్తులయ్యారు. వారి పేరు కూడా స్తోత్రంలో చేర్చారు. ప్రస్తుతం ఈ ప్రాతఃస్మరణను ‘ఏకాత్మతా స్తోత్రం’ అంటున్నారు. ప్రతి రోజు ఉదయం గాంధీజీ పేరు కూడా కలిగిన ఏకాత్మతా స్తోత్రాన్ని పఠించడం ద్వారా స్వయంసేవకులు సద్గుణయుక్తమైన గాంధీజీ జీవనాన్ని గుర్తుచేసుకుంటారు.

గాంధీజీ 150వ జయంతి సందర్భంగా ఆయన పవిత్ర, త్యాగమయ, విశుద్ధ జీవనం, ‘స్వ’ ఆధారితమైన జీవన దృక్పథాన్ని అనుసరిస్తామని మనమంతా సంకల్పించుకోవాలి. ఆ విధంగా భారత్‌ను మరోసారి విశ్వగురువుగా నిలిపేందుకు మన జీవితాల్లో కూడా ఆ సద్గుణాలు, త్యాగభావన నింపుకోవాలి.

–డాక్టర్ మోహన్ జి భాగవత్
(రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్)