మమతా బెనర్జీ శాంతి భద్రతల పేరుతో దుర్గా నిమజ్జనను ఒక రోజు వాయిదా వేయమంది. అలాంటి ఉత్తర్వులనే ముస్లింల విషయంలో ఎందుకు జారీ చేయలేదు ? అక్టోబర్ 1న దుర్గా నిమజ్జనం ఉంది కాబట్టి, మీరు మీ రీతి రివాజులను ఒకరోజు వాయిదా వేసుకోమని ముస్లింలను ఎందుకు ఆదేశించలేదు? కేవలం హిందువుల మత విశ్వాసాల మీదే మమతా బెనర్జీ ఎందుకు దెబ్బ వేయాలనుకుంటున్నారు ? ఇది కేవలం ఓటు బ్యాంకు రాజకీయం మాత్రమే.
ప్రతి దేశంలోను, ప్రతి జాతికి కొన్ని పండుగలు ఉంటాయి. అవి మత విశ్వాసాల మీద ఆధారపడి ఉంటాయి. హిందువులకు చాలా పండుగలున్నాయి. ఆ పండుగలను యుగయుగాలుగా పరంపరాగతంగా ఆచరిస్తూ వస్తున్నారు. ఈ దేశం వైవిధ్యభరితమైనది. కొన్ని విశేష పండుగలను కొన్ని ప్రాంతాలలో అతి ఉత్సాహంగా శ్రద్ధాభక్తులతో జరుపుకుంటారు. దుర్గా పూజ, దసరాను దేశమంతటా జరుపుకుంటున్నా బెంగాలీలకు అది విశేష పర్వదినం. వీధి వీధినా పందిళ్ళు కట్టి దుర్గాదేవిని ప్రతిష్టించి ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుండి దశమి వరకు ఈ పండుగ జరుపుకుంటారు. గణేష నవరాత్రుల అనంతరం అనంత చతుర్దశి రోజున గణపతి నిమజ్జనం, దసరా మరునాడు దుర్గామాత విగ్రహాల నిమజ్జనం చేయడం సాంప్రదాయంగా వస్తోంది.
ఒక్కొక్కప్పుడు ముస్లిం, హిందువుల రెండు మతాల పండుగలు ఒకేరోజున వస్తూంటాయి. ఈ సంవత్సరం సెప్టెంబర్ 30న దశమి, అక్టోబర్ 1న దుర్గా విగ్రహాల నిమజ్జన పర్వము. అదే అక్టోబర్ 1న మహమ్మదీయుల మొహరం పండుగా వచ్చాయి. అప్పుడప్పుడు ఈ రెండు పండుగలు ఒకేసారి రావడం సహజమే. గత సంవత్సరం కూడా ఇలాగే జరిగింది. అంతకు మునుపు 1981, 1982 లలో ఇలాగే జరిగింది. అప్పుడు పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాలు అధికారంలో ఉండేవి. శాంతి భద్రతలకు ఎలాంటి చేటు కలగకుండా ఒకే రహదారి మీద ఒక ప్రక్క మహమ్మదీయుల ఊరేగింపు, మరోపక్క దుర్గాదేవి నిమజ్జన ఊరేగింపు జరిగాయని టి.వి.చర్చల్లో కమ్యూనిస్టు పార్టీ ప్రవక్త శతరూప్ ఘోష్ అన్నారు.
అయితే శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని గత సంవత్సరం లాగే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెసు నేత మమతా బెనర్జీ దుర్గా ప్రతిమల నిమజ్జనం దశమినాడు (30.09.2017) సాయంత్రం 6 గంటల తరువాత చేయవలసినదని, కాని పక్షంలో అక్టోబర్ 2,3,4 తేదీలలో చేసుకోమని, అక్టోబర్ 1వ తేదీని మహ్మదీయులకు ప్రత్యేకిస్తూ ఆదేశాలు జారి చేసింది. ఇది ఎలా సాధ్యం ? గాంధీ జయంతి 2 అక్టోబర్ కాక 3 అక్టోబర్‌న ఎవరైనా జరుపుతారా ?
మమతా బెనర్జీ శాంతి భద్రతల పేరుతో దుర్గా నిమజ్జనను ఒక రోజు వాయిదా వేయమంది. అలాంటి ఉత్తర్వులనే ముస్లింల విషయంలో ఎందుకు జారీ చేయలేదు ? అక్టోబర్ 1న దుర్గా నిమజ్జనం ఉంది కాబట్టి, మీరు మీ రీతి రివాజులను ఒకరోజు వాయిదా వేసుకోమని ముస్లింలను ఎందుకు ఆదేశించ లేదు ? కేవలం హిందువుల మత విశ్వాసాల మీదే మమతా బెనర్జీ ఎందుకు దెబ్బ వేయాలను కుంటున్నారు ? ఇది కేవలం ఓటు బ్యాంకు రాజకీయం మాత్రమే. హిందువుల ఓట్లు మూకుమ్మడిగా ఏ ఒక్క పార్టీకి పడవు. చీలిపోతాయి. ముస్లింలకు రాయితీలు ఇస్తే వారి ఓట్లు గుత్తగా దండుకోవచ్చని కాంగ్రెస్‌తో సహా సెక్యులర్ ముద్ర వేసుకున్న అన్ని పార్టీలు భావిస్తున్నాయి.
ఒకపక్క మమతా బెనర్జీ పాలనలో హిందువులకు ఏ పండుగను శ్రద్ధాభక్తులతో నిర్వహించుకునే అవకాశం ఉండటంలేదు. సరస్వతీ పూజ, హనుమాన్ జయంతి మొదలైనవన్నీ ఇలాంటి షరతులకు గురవుతున్నాయి. మరోపక్క ప్రభుత్వ అండతో ముస్లిం గుండాలు హిందువుల మీద దాడి జరుపుతున్నారు. హత్యలు చేస్తున్నారు. హిందువుల దుకాణాలు ఇళ్ళు కాల్చివేస్తున్నారు. ప్రభుత్వం వారిని నివారించడం లేదు.
ఇలాంటి ఆదేశం గత సంవత్సరం కూడా మమతా ప్రభుత్వం జారీ చేసింది. అయితే కోల్‌కత్తా హైకోర్టు న్యాయమూర్తి దీపాంకర్ దత్తా ఈ ఆదేశం కేవలం ముస్లిం తుష్టీకరణ కోసం జారీ చేయబడిందంటూ ఆ ఆదేశం చెల్లదని 6 అక్టోబర్ 2016 న తీర్పు చెప్పారు.
పశ్చిమ బెంగాల్‌లో మొత్తం మహమ్మదీయుల జనాభా 28 శాతం. ఉత్తర దీనాపూర్, ముర్షిదాబాద్, మల్వాలలో వారి జనాభా 50 శాతానికి మించిపోయింది. టి.వి.చర్చలో ‘అప్పుడు జరిగింది కదా ! ఇప్పుడెందుకు జరగదు ? అని శతరూప్ ఘోష్ ప్రశ్నిస్తే ‘అప్పుడు ముస్లింల జనాభా తక్కువ. కాని నేడు విపరీతంగా పెరిగింది’ అన్నాడు తృణమూల్ నాయకుడు. అంటే నేడున్న 28 శాతం జనాభా రాబోయే కాలంలో 45 శాతానికి పెరుగుతే హిందువులను పండుగలే జరుపుకోనివ్వరా ! అది 50 శాతానికి మించితే హిందువులను (కశ్మీర్ పండితులను కశ్మీర్ నుంచి తరిమి వేసినట్లు) తరిమేస్తారా ? సెక్యులర్ అంటే అన్ని మతాలను సమాన ఆదరణతో చూడటం. ఓట్ల కోసం రాజకీయాలు చేసేవారు నిజమైన సెక్యులరిస్టులు కాదు. కుహనా సెక్యులరిస్టులు.
మమత ప్రభుత్వం మౌల్వీలకు జీతాలిస్తుంది. ఆలయ పూజారుల కలాంటి సదుపాయం లేదు. అక్కడ మసీదుల అభివృద్ధికి, మౌల్వీల జీతాలకు 5400 కోట్లు కేటాయింపు ఉంది. వెనుకబడిన కులాలు, షెడ్యూల్డు కులాలు తెగల సంక్షేమానికి కేవలం 2725 కోట్లు మాత్రమే. ముస్లిం యువకులకు లేప్‌టాప్‌లు సైకిళ్ళు ఇస్తున్న మమత ప్రభుత్వం హిందూ యువకులకు మొండిచెయ్యి చూపింది.
విచిత్రమేమంటే మానవ హక్కుల సంఘాలు ఇతరులు ఈ అన్యాయాన్ని ఖండించడం లేదు. ఏ రచయితలు, సినీ కళాకారులు అసహనాన్ని వ్యక్తం చేస్తూ అవార్డులను తిరిగి ఇచ్చివేయలేదు. కాంగ్రెసు పార్టీ, ఆర్.జె.డి.లు ఇప్పటికే మమతా బెనర్జీ నిర్ణయాన్ని వెనకేసుకొచ్చాయి. ఇతర సెక్యులర్ పార్టీలు నేడో రేపో వంతపాడతాయి. మాజీ ప్రధానమంత్రి ‘ఈ దేశంలో వనరులలో మొదటి ముద్ద ముస్లింలదే’ అన్నారు.
పాలకులైనవారు ప్రజలందరికీ పాలకులు. వారు ప్రజలందరి పట్ల బాధ్యతాయుతంగా ధర్మబద్ధంగా వ్యవహరించకపోతే ఎంతటి తీవ్ర పరిణామాలను ఎదుర్కొనవలసి వస్తుందో స్వామి వివేకానంద చెప్పారు. తమను ఉద్ధరిస్తారని తమ జీవితాల్లో ఓ క్రొత్త వెలుగును తీసుకువస్తారని ప్రజలు ఎంతో విశ్వాసంతో నాయకులను గెలిపిస్తారు. ఆ నమ్మకాన్ని నిజం చేయాల్సిన గురుతర బాధ్యత ప్రజా ప్రతినిధులదే. అయితే దానికి విరుద్ధంగా ప్రజల విశ్వాసానికి విఘాతం కలిగించే పాలకులు పాపంలో భాగం పంచుకోక తప్పదు.
– జి.ప్రసాద్
(జాగృతి సౌజన్యం తో)