Home News మార్క్స్ డొల్లతనం మరోసారి వెల్లడి

మార్క్స్ డొల్లతనం మరోసారి వెల్లడి

0
SHARE

ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అమెరికాకు చెందిన ప్రొఫెసర్ థాలెర్‌కు దక్కింది. ఆర్థిక శాస్త్రాన్ని మనస్తత్వ శాస్త్రంతో సమ్మిళితం చేసి రూపొందించిన ప్రవర్తనా ఆర్థిక శాస్త్రం (బిహేవియరల్ ఎకనామిక్స్) అందరిని ఆకర్షించింది. ఈ నూతన పరిశోధనాత్మక ప్రతిపాదనకు గాను నోబెల్ కమిటీ బహుమతిని ప్రకటించింది.

ఆర్థిక రంగంలో మానవ బలహీనతలు, భావోద్వేగాల పాత్ర గణనీయంగా ఉంటుందని ఆ మేరకు తీసుకునే నిర్ణయాలు ఆర్థిక రంగంపై ప్రభావం చూపుతాయని ఆయన ప్రతిపాదించారు. సమాజంలో జరుగుతున్న మార్పుల నేపథ్యంలో ఆర్థిక రంగంలో నూతన ప్రతిపాదనలు, కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. వాటిలో మేటి ప్రతిపాదనకు, సిద్ధాంతానికి ప్రతి సంవత్సరం నోబెల్ బహుమతి లభిస్తోంది. ఉత్పత్తిరంగంలో టెక్నాలజీ పెరగడంతోపాటు వినియోగదారుల, ఉత్పత్తిదారుల ఆలోచనలు, ఆకాంక్షలు మారుతున్న వైనాన్ని ఆయా ఆర్థిక ప్రతిపాదనల్లో స్పష్టంగా గమనించవచ్చు. ఇదంతా నడుస్తున్న చరిత్రగా మనకు దర్శనమిస్తోంది.

శతాబ్దంన్నర క్రితం కారల్ మార్క్స్ సైతం ఆర్థిక రంగంలో తనదైన శైలిలో ప్రతిపాదనలు చేసారు. ఆ విశే్లషణ, ప్రతిపాదన రాజకీయాలకు అన్వయించడంతో ప్రపంచంలో పెద్ద కల్లోలం జరిగింది. మార్క్స్‌కు ముందు ఈ సమాజాన్ని అంత లోతుగా విడమరిచి చెప్పిన వారు లేరని, సమాజంలోని ‘ఆర్థిక దోపిడీ’ని అరికట్టేందుకు ఆయన తొలిసారి పరిష్కారం చెప్పారని, ఆ పరిష్కార మార్గం మినహా మానవాళికి మరో మార్గం లేదని వంద సంవత్సరాలకుపైగా ఆయన అభిమానులు (మార్క్సిస్టులు) వీరంగం వేస్తూనే ఉన్నారు.

మార్క్స్ ఆర్థిక విశే్లషణలో అదనపు విలువ (సర్‌ప్లస్ వాల్యూ)ను ప్రతిపాదించారు. వస్తు ఉత్పత్తికి అయ్యే ఖర్చు కన్నా వినియోగదారుడు చెల్లిస్తున్న ధర ఎంతో ఎక్కువ వుంటుంది, అలా వసూలైన అదనపు ధనంలో సింహభాగం పెట్టుబడిదారుల బొక్కసాల్లోకి పోతోంది, దాంతో వాళ్లు కుబేరులవుతున్నారు, ఉత్పత్తిలో కీలక శక్తిగా వున్న శ్రామికులకు అందవలసిన వాటా కన్నా చాలా తక్కువ వేతనంగా అందుతోంది. ఇది అన్యాయం..అధర్మం, దీన్ని చక్కదిద్దేందుకు పెట్టుబడిదారి వ్యవస్థను కూలదోసి శ్రామిక వర్గ నియంతృత్వం నెలకొల్పాలి, అప్పుడు అశేష శ్రామికులకు శుభోదయం కలుగుతుందని మార్క్స్ వాదన.

ఆర్థిక శాస్త్ర విశే్లషణ, దాని పరిధిలోని అంశాలు గాలికి కొట్టుకుపోయి రాజకీయ ఆవరణలో…బరిలో నిల్చొని నిలదీయడానికి పురికొల్పడంవల్ల, రెచ్చగొట్టడంవల్ల అద్భుతాలేవీ ఆవిష్కరింపబడలేదు. వాస్తవానికి వస్తువుల తయారీ, శ్రామికులు, మార్కెట్లు, లాభాలు, పెట్టుబడులు ఇవేవీ కొత్తగా పుట్టుకొచ్చినవి కావు. వేలాది సంవత్సరాలుగా కొనసాగుతున్నదే. వాటి స్వరూపం మారుతుంది గానీ సారాంశం మాత్రం మారదు. బయటకు కనిపించే అంశాల్లో స్వల్ప మార్పులు జరగవచ్చు గానీ అంతర్లీనంగా ఉన్న ‘వ్యాపార లక్షణం’లో మార్పు కనిపించదు. దీన్ని కాదని ఆర్థిక విశే్లషణలను, సూత్రీకరణలను రాజకీయ ఆలోచలనలకు, సిద్ధాంతాలకు ముడిపెట్టడంతో మూల స్వభావంలో మార్పు వస్తుందనుకోవడం అమాయకత్వమే అవుతుంది. దాని సహజ లక్షణాన్ని తీసేసి కృత్రిమత్వాన్ని ఆపాదించి నడిపిస్తామని సుత్తి కొడవలి ఎత్తితే అదెలా జిగేల్‌మని మెరిపిస్తుంది?. ఆర్థిక ఉద్దీపనతో ఎలా ముందుకెడుతుంది?. ఈ వౌలిక ప్రశ్నను వేసుకోకుండానే కారల్ మార్క్స్ తన ఊహాత్మక ఆలోచనలను ఆర్థిక రంగంతో ముడివేయడంతో అంతా కంగాళీ చోటు చేసుకుంది.

ఆయన అభిమానులు, వీరాభిమానులు చెబుతున్నట్టు మార్క్సిస్టు ఆర్థిక సూత్రాలే అత్యంత విలువైనవి, గొప్పవి, మానవ సమాజానికి చోదక శక్తులైతే అవి గత 150 సంవత్సరాల్లో దేదీప్యమానంగా వెలిగి ప్రపంచమంతా శోభాయమానంగా విలసిల్లాలి! కాని అలా జరిగిందా?…లేదు! ఆ ఆర్థిక సూత్రాలను నిష్ఠగా అమలు జరిపినా ఫలితం లేదంటే ఏమిటి అర్థం?. అన్న ప్రశ్నను ఆ వీరాభిమానులు వేసుకున్న పాపాన పోవడంలేదు.

మార్క్స్ కన్నా ముందే ఆడమ్ స్మిత్ ఎంతో గొప్పగా ఆర్థిక సూత్రాలను సిద్ధాంతీకరించారు. ఆయన ఆలోచనలు వాస్తవానికి దగ్గరగా వుండడమే కాక, మానవ ఆకాంక్షలకు అనుగుణంగా కనిపిస్తాయి. ప్రస్తుతం నోబెల్ బహుమతి గ్రహీత ప్రొఫెసర్ ధాలెర్ ప్రవర్తనా ఆర్థిక శాస్త్రానికి ప్రాథమిక పునాది ఆడమ్ స్మిత్ ఆలోచనలే. మనిషి చుట్టూ ఆర్థిక శాస్త్రం తిరగాలే తప్ప, ఆర్థిక శాస్త్రం చుట్టూ మనిషి తిరగరాదు. కాని మార్క్స్ రెండవ దానికే ప్రాధాన్యం ఇచ్చాడు. దాంతో ఆయన సిద్ధాంతం బొక్కబోర్లా పడింది. ఈ విషయం పట్టించుకోకుండా భేషజాలకుపోయి దశాబ్దాల పాటు ఈ తిరోగమన విధానానికి జేజేలు పలుకుతూ మానవ వనరులను, వారి శ్రమను, శక్తిని, యుక్తిని బూడిదపాలు చేయడం దారుణాతి దారుణం.

భావోద్వేగాలు, మానవ బలహీనతలు, కొన్ని సమయాల్లో హేతుబద్ధతకు లొంగని నిర్ణయాలు మనిషి తీసుకుంటాడన్న సత్యాలు మార్క్సిజంలో కనిపించవు. ఎంతసేపు రెండు రెళ్లు నాలుగు అన్న గణిత గుణమే తప్ప, రక్తమాంసాలతో కూడిన మనిషి గణితానికి భిన్నంగా రసాయనిక చర్యలతో స్పందిస్తాడన్న ఆలోచన, అభిప్రాయం, అవగాహన ఆ సిద్ధాంతంలో కనిపించదు.

షికాగో విశ్వవిద్యాలయానికి చెందిన బూత్ స్కూల్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న థాలెర్ ప్రవర్తనా ఆర్థిక శాస్త్రం ఆకాశంనుంచి గానీ, ఊహాలోకంనుంచి గాని ఊడిపడలేదు. ఎన్నో అధ్యయనాలు, పరిశీలనలు, పరిశోధనలు చేసిన తరువాత ఎంతో చర్చ జరిగిన అనంతరం ఆ సిద్ధాంతం వెలుగు చూసింది. మార్క్సిజం అలా కాదు, మార్క్స్ బుర్రలో మెదిలిన అంశాలను నేరుగా కాగితం పెట్టి, పరిశోధనలకు, ప్రయోగాలకు తావులేకుండా లోకం మీదకి వదలడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మానవీయ కోణంనుంచి కాక ద్వేషం, విద్వేషం, ప్రతీకారం కోణంతో మార్క్సిజం ఆవిష్కృతం కావడంతో సహజంగానే అది చిచ్చురేపింది. చాలామందికి చితిని పేర్చింది, వివేకం కోల్పోయేలా చేసింది. మార్క్స్ భావాలతో నేరుగా సమాజంపై ప్రయోగం చేయడంవల్ల ఇప్పటికే పదికోట్ల మంది ప్రజలు మరణించారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతునే ఉంది. ఈ రకమైన రక్తదాహం గల ఆర్థిక సూత్రాలు, అభిప్రాయాలు, సమాజానికి మేలు చేస్తాయా? ముందుకు తీసుకెళతాయా? లేదని అనేక అనుభవాలు, చేదు అనుభవాలు చెబుతున్నాయి.

మానవుడిపై అధిక ప్రేమగల వారమని, గొప్ప ఆర్ధ్రతగల హృదయాలున్న వారమని చెప్పుకునే మార్క్స్ అభిమానులు వర్తమాన సమాజాన్ని పరిశీలించకుండా, ఆ సమస్యల జోలికి వెళ్లకుండా, వాటి పరిష్కారాలను 170 సంవత్సరాల క్రితం నాటి మార్క్స్ ‘ప్రవచనాల్లో’ వెతకడం ఎంతవరకు న్యాయం ఏ మేరకు అది సబబు అనిపించుకుంటుంది?

మార్క్స్ చెప్పిన ఆర్థిక సూత్రాలకనుగుణమైన ‘మార్కెట్ రహిత సమాజా’న్ని దండకారణ్యంలో నిర్మిస్తున్నామని ఆయన అభిమానులైన మావోయిస్టులు గత కొంతకాలంగా చెబుతున్నారు. పూర్వపు కమ్యూనిస్టుల (మార్క్సిస్టులు) కన్నా వీరి వైఖరి మరింత మూర్ఖత్వంతో కూడుకున్నది. మావోయిస్టులు ఏ తానులోంచి వచ్చారో ఆ ‘తాను’ వారు ఆ సిద్ధాంతంపై ఆశలు వదులుకుని సంస్కరణల పంథాలో పయనిస్తుంటే మావోయిస్టులు మాత్రం సంస్కరణలు, గింస్కరణలు జానె్తైనై సాయుధ పోరాటం ద్వారా, తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సాధ్యమని అమాయక గిరిజనులను, ఆదివాసులను, గ్రామీణ ప్రజలను చేరదీస్తున్నారు. వారితో ‘సైన్యం’ ఏర్పాటు చేసి, ఢిల్లీని ముట్టడించి ఎర్రకోటపై ఎర్రజెండా ఎగురవేస్తాం.. అని బీరాలు పలుకుతున్నారు. ఈ ప్రయాణమంతటా రక్తం ఏరులైపారినా పట్టిన పట్టు విడవమని భీష్మించి కూర్చున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి భీష్మ ప్రతిజ్ఞలకు తావుందా?… అన్న వౌలిక ఆలోచనను సైతం వారు విస్మరిస్తున్నారు. ఈరకమైన పంతం ప్రజల భవిష్యత్తును బంగారుమయం చేస్తుందా?… అని ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన సమయమిది. వౌనంగా ఉంటే చరిత్రకు ద్రోహం చేసిన వారమే అవుతాం!

-వుప్పల నరసింహం 9985781799

(ఆంధ్రభూమి సౌజన్యం తో)