Home Telugu Articles మత మార్పిడి.. ఓ మహమ్మారి

మత మార్పిడి.. ఓ మహమ్మారి

0
SHARE

‘సమాజంలో విభిన్నత్వం సహజం. ఎన్నో మతాలు కలిసి జీవిస్తూ వుంటాయి. దేని ప్రత్యేకత దానిది. మనం ఒక మతంలో పుట్టి దానిని అనుసరిస్తూ జీవిస్తాం. అలాగే ఇతరులు వారి మతాన్ని విశ్వసిస్తారు. విశ్వాసానికి తర్కాలు అక్కరలేదు. ఎవరి విశ్వాసం వారిది. మన ధర్మాన్ని మనం పాటిస్తూ, ఇతరుల్ని గౌరవించడం సంస్కారం. అంతేకానీ వారిని ఎత్తిపొడవడం, దోషాలను ఎంచి చూపడం, విమర్శించడం తగదు, ద్వేషం కూడదు. ఇది నాగరికమైన పౌరుడు ఆలోచించే విధానం. కానీ, ఆశ్చర్యమేమిటంటే ఈ ధోరణి కేవలం హిందువుకి మాత్రమే ఉంటోంది. ఇతరుల సిద్ధాంతం వేరు.

‘‘మా మతం తప్ప మరో మతం గొప్పది కాదు. స్వర్గానికి వెళ్లాలంటే మా మతానే్న స్వీకరించాలి, మా దేవుడ్నే ప్రార్థించాలి. మిగిలిన వాళ్ళందరూ మూర్ఖులు, నరకానికి పోతారు. ఈ దేశమంతా మా మతమే వ్యాపించాలి. విశ్వసించని వాళ్లను ఏమార్చో, పరిమార్చో మా మతంలోకి మార్చుకుంటాం. ఇతర మతాలను ద్వేషిస్తాం, వాటిని దోషాలుగా భావించి లోపాలుగా ఎత్తిచూపడమే మా ఉద్దేశ్యం’’.

– ఇదీ వారి ధోరణి.

హృదయ వైశాల్యం (హార్ట్ ఎన్‌లార్జ్‌మెంట్) ఎక్కువైపోయిన హిందువు ఇప్పటికీ ఈ ధోరణిని అర్థం చేసుకోలేక- ఏ మతమైతే ఏముంది? అన్ని మతాలూ ఒకటే కదా అనే అంధజ్ఞానంతో సర్దుకుపోతున్నాడు. ఇదే మాట ఇతరులు అనగలరా? అని కాసింత ఆలోచించలేకపోతున్నాడు. మత మార్పిడిదారులు అవలంబిస్తున్న కుత్సిత వ్యూహాలు చాలా జుగుప్సాకరంగా ఉంటున్నాయి. ‘‘పొరుగువాడిని ప్రేమించుము, ద్వేషించకుము’’ అని చెప్తూనే పొరుగు మతం వారిని అవహేళన చేస్తూ, లోపాలను చెబుతూ ద్వేషభావం కలిగిస్తూ ప్రచారాలు చేస్తున్నారు. వారికి ఇరుగుమతం, పొరుగుమతం కూడా గిట్టవు. ఒకసారి ‘వేదాల్లో మా మతం ఉంది’ అంటారు. మళ్లీ ఆ వేదమతానే్న నిందిస్తారు. ‘రెండు మార్పిడిదారుల’ మతాలకు హింస, దౌర్జన్యం, ఉగ్రవాదం, విధ్వంసం, వంచన- అనేవి సామాన్యాంశాలు అయినప్పటికీ- ఒకరు మాత్రం తమ గ్రంథంలో చెప్పిన పద్ధతుల్నే పాటిస్తుంటారు. ఇంకొకరు తాము ‘దేవుడు అనుకుంటున్న వానిని’ (దే.అ.వా) అందరూ నమ్మి, వారి వారి మాతృ మతాల్నీ, దేవుళ్లనీ వదిలేయాలని నానా విన్యాసాలూ చేస్తారు. దానికోసం తమ గ్రంథాల్లో చెప్పేవాటినీ, అందులో పద్ధతుల్నీ కూడా మార్చేసి- హిందూ మతపు అలవాట్లనీ, ఆచారాలనీ, వేదాల్నీ కూడా కలిపేసి చెప్తూ, కలగాపులగం చేసేసి కృతకంగా రెచ్చిపోతుంటారు.

మతం మారిన వారిలో, మార్చేస్తున్న వారిలో కూడా హిందూ మతంపై ద్వేషం పొంగి పొర్లుతుంటుంది. అందుకే హిందూ దేవతల పటాలని, పుస్తకాలని నేలపై వేసి, కాళ్ళతో తొక్కించి మరీ మార్పిడులు చేస్తారు. ప్రచార సభల్లో మన దేవుళ్లనీ, గ్రంథాలనీ అరకొర జ్ఞానంతో దూషిస్తుంటారు. చట్టం కల్పించిన వాక్ స్వాతంత్య్రం, స్వేచ్ఛ వంటి హక్కుల్ని వాడుకుంటూ, వారి మతంలోని విషయాలను చెప్తూ ప్రచారం చేసుకోవచ్చు. అన్య మతాంశాలను దూషించడం చట్టరీత్యా శిక్షార్హమైన నేరం. ఈ అంశాన్ని ప్రతి హిందూ పౌరుడు గుర్తుపెట్టుకోవాలి. తమ మత విషయాలను ఎవరైనా నిందిస్తే వెంటనే చట్టరీత్యా చర్య తీసుకోవచ్చు. ఇతర మతాలను తిట్టకుండా తన మతంలోకి ఎవ్వరూ ఎవ్వర్నీ మార్చలేరు. అసలు అన్యమతాల్ని దూషించి, తమ మతాన్ని నిలుపుకొనే ప్రయత్నంలోనే వారి పేలవత్వం గోచరిస్తుంది. ఆఫీసులు, ఆసుపత్రులు, కళాశాలలు, ఇళ్ళు, దుకాణాలు, హిందూ దేవాలయ పరిసరాలు.. కావేవీ మార్పిడికి అనర్హం. ఎవరి బ్రతుకు వారిని బ్రతకనివ్వకుండా, ఎవరి పరంపరని వారు అనుసరించనివ్వకుండా. సందు దొరకబుచ్చుకొని రోగంతో మూలిగేవారినీ, పేదలనీ వారి బలహీనతలను అడ్డం పెట్టుకుని మార్చుతూ పోతున్నారు. ఈ మార్పిడి క్రమంలో వారిని తమ పూర్వ మతంపై ద్వేషం పెంచుకునేలా తీర్చిదిద్దుతున్నారు.

బరితెగించి వారి ప్రచారాల్లో హిందూ దేవతలనీ, గ్రంథాలనీ అవమానిస్తుంటే ఏ మాత్రం ఎదుర్కోలేక స్తబ్ధవౌతోంది హిందూ సమాజం. ఎవరో ఒకరిద్దరు హృదయమున్న వారు స్పందించి- ‘ఈ అకృత్యం తగదు’ అని నిలదీస్తే- ‘‘భారతీయుల్లో ‘అసహనం’ పెరిగిపోతోంది’’ అని అడ్డగోలుగా అరుస్తూ నిరసనలు వ్యక్తపరుస్తారు. అరుపులు, ఆవేశాలు, ఆగ్రహాలే తప్ప సత్యాన్ని గ్రహించే నిదానం, ఇంగితజ్ఞానం ఆ నిరసనల్లో కనబడవు.

వీరి దౌష్ట్యాన్ని ఏ ఒక్కరు వ్యతిరేకించినా- వీళ్ళు అక్రమంగా దెబ్బతీసే తీరు చిత్రంగా ఉంటుంది. ‘‘మైనారిటీలపై, దళితులపై జరుగుతున్న దాడులకు నిరసన తెలుపుతున్నాం’’ అంటారు. మొత్తం దళిత సోదరుల్ని వాళ్ళతో కలిపేసుకొని చెప్పవలసిన అవసరం ఏమిటి? వారి అకృత్యాలను కాపాడుకోవడానికి దళితుల్ని వాడుకుంటున్నారు. పాపం- దళిత సోదరులు కొందరు ఏమీ అర్థం కాక- ‘వీరితో మాకేమిటి సంబంధం?’ అని ఆశ్చర్యపోతుంటే- వారు ప్రయోగించే దళిత నాయకులు మాత్రం హిందూ వ్యతిరేకతను వెళ్లగక్కడంలో ఉరకలు వేస్తున్నారు. కానీ దళిత సోదరులు గుర్తించవలసిన ఒక ముఖ్యాంశం- వర్ణవివక్షను అధిక మోతాదులో పాటిస్తున్నది ఈ మార్పిడి మతాలవారే!

మతం మారితే అగ్రవర్ణాలవారికి అధిక మొత్తంలో చెల్లింపులు చేస్తున్నారు. క్రింది వర్గాలవారికి తక్కువ మొత్తాలు అందుతున్నాయి. ఇంత వివక్ష కేవలం మార్పిడి మతాల నుండే కనబడుతోంది! దీనిని ప్రశ్నించరెందుకు? ఒక సిద్ధాంతాన్ని గానీ, మతాన్ని గానీ అగౌరవ దృష్టితో చూస్తే అన్నీ లోపాలే కనబడతాయి. ఆ మాటకొస్తే వీళ్ళు నెత్తికెత్తుకున్న మతాలలోని అవకతవకల్ని వారి దేశాల మేధావులే చీల్చి చెండాడి అనేక పుస్తకాలుగా, వ్యాసాలుగా అందించారు. అవన్నీ తీసి బయటికి చెప్తే సహించగలరా?

ఒక్క విషయం స్పష్టంగా గుర్తించాలి. హిందూ ధర్మ ప్రచారకుల్లో, జ్ఞానుల్లో ఏ ఒక్కరు కూడా ఇతర మతాల్ని అవమానించడం లేదు. వారి ప్రవక్తల్ని అగౌరవించడం లేదు. పవిత్ర గ్రంథాల్ని దూషించడం లేదు. తమ ధర్మంలోని గొప్పతనాన్ని మాత్రమే వ్యక్తపరుస్తున్నారు. స్వాభావికంగా శ్రేష్ఠత్వం కలిగిన మతం ధోరణి ఇలాగే ఉంటుంది.

అంతేకానీ- మార్పిడి మతాల అసలు రంగుల్ని, హింసాపూరిత ధ్వంస చరిత్రల్ని ఆధారాలతో, ఆనవాళ్ళతో సామాన్యులకు తెలియజేస్తే – సహనంతో గ్రహించే దిటవు, సంస్కారం వారికి ఉన్నాయా?! తమ మతాన్ని తాము ప్రచారం చేసుకుంటే తప్పేమిటి? ఏ తప్పూ లేదు. హిందువులంతా వినడానికి అభ్యంతరం చెప్పరు. లక్షలాది ఋషుల మాటలు, పరమహంసల సూక్తులు, సాధు-సంత్‌ల సంభాషణలు, యోగుల భాషితాలు, జ్ఞానుల హితోక్తులు, సిద్ధపురుషుల అనుభవాలు, బాబాల బోధనలు- విని పుష్టి పొందిన హిందూ జాతికి- మరో యిద్దరి మాటలు వినడానికి ఏ ఇబ్బందీ లేదు. ఇందరు బాబాలను గౌరవిస్తున్నవారికి మరో యిద్దరు బరువు కారు. గౌరవించినంత మాత్రాన, ఉన్న మతాన్ని వదులుకోనక్కరలేదు. మరో మతంలోకి మారనక్కరలేదు. ఒక స్ర్తిని గౌరవించినంత మాత్రాన కన్నతల్లిని వదలనక్కరలేదు కదా!

‘ఇన్నాళ్ళూ అలవాటైపోయిన సంప్రదాయాలనీ, ఆచారాలనీ వదలడం అంత తేలిక కాదు’ అని గుర్తించిన ఒక మార్పిడి మతం చాలా క్షుద్ర విన్యాసాలు చేస్తోంది. అచ్చం హిందువుల మాదిరిగానే తీర్థస్నానాలు, గుండు గీయించుకోవడాలు, మొక్కుబడులు, (కొవ్వొత్తి) దీపారాధనలు, ప్రదక్షిణలు, ఉపవాసపు పండుగలు.. లాంటివి- (ఆ మతమున్న దేశాలవాళ్ళు, వారి మత గ్రంథకులు కూడా కని వినీ ఎరుగనవి) కలగాపులగాలు చేస్తున్నారు. ఒక ప్రసిద్ధాలయం ఉంటే దానికి అత్యంత సమీపంలో ఆ గోపురం ఎత్తుకి మించేలా తమ చిహ్నాన్ని పెడుతూ, ఆ ఊరి కొండల కోనలపై, అడవుల్లో, పొలాల్లో అక్రమాక్రమణలకు వెనుదీయకుండా- విదేశీ నిధులతో తమ మత కేంద్రాలను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. హిందూ పర్వదినాల సందర్భంలోనే- వాళ్లకు లేని పండుగలు కల్పించి, కూటములు పెట్టి గోల చేయడం వారి తంతు. ఈ మార్పిడి పండుగలు ఖచ్చితంగా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా చేసే కవ్వింపు చర్యలే. ఒకడు తిరుమలేశుని వెక్కిరిస్తూ, మరొకడు రాముని ఎద్దేవా చేస్తూ, ఇంకొకరు కృష్ణుని తెగనాడుతూ, వేరొకడు జగన్మాతను హేళన చేస్తూ, మరో వ్యక్తి శివుని దూషిస్తూ… ఇలా శిశుపాల చేష్టలు చేస్తుంటే హిందువు సహించాలని వారి ఆంక్ష. లేకుంటే ‘మత అసహనం పెరిగిపోతుంద’ని అన్ని వైపులా గగ్గోలు పెట్టించగలిగే వ్యూహం వాళ్ళకి ఎలాగూ ఉంది.

హిందూ ఆలయాల దగ్గర పొంచి, అక్కడి తీర్థయాత్రికులకు కూడా కరపత్రాలు, గ్రంథాలు పంచే దుస్సాహసం చేస్తున్నారు. ఈమధ్య కాశీవిశ్వనాథుని మందిరం చెంత, కార్తికమాసంలో క్యూలో నిల్చున్న యాత్రికులకు తమ మతగ్రంథ పత్రాలను పంచుతున్నారు. మనవారు ఉపేక్షించాలి. కళాశాలల్లో ప్రేమ పేరుతో ఎరవేసి, మతం మార్చి పెళ్లిచేసుకుంటున్న వైనాలు బోలెడన్ని బయటపడుతున్నాయి. ఇంట్లో మత ధర్మాలను నేర్పకుండా పెంచుతున్న హిందూ తల్లిదండ్రులకి- ‘పుట్టినప్పటి నుండి మతాన్ని నూరిపోసి దురభిమానం మూర్తికట్టేలా పెంచుతున్న’ ఇతరుల వ్యూహాలు తెలియడం లేదు.

అసలు మతం దృష్టిని పక్కనపెట్టి చూసినా- దేశ క్షేమం కోరే ప్రగతిశీల భావుకులు దీనిని క్షమించరు. ఇవి విద్వేషాలను రెచ్చగొట్టే చర్యలు! మీ వేదాల్లోనే మా ‘దేవుడు’ (దే.అ.వా) చెప్పబడ్డాడు అంటూ బట్టతలకీ, మోకాలికీ ముడిపెడుతూ వక్రీకరణతో కూడిన కువ్యాఖ్యలు చేస్తారు. సంస్కృత వేద పురాణ వాక్యాలకు వాళ్ళ ఇష్టమొచ్చినట్లు అర్థాలు చెప్తూ అమాయకుల్ని వంచించవచ్చు. కానీ, భాష తెలిసినవాడు నిలదీస్తే మాట్లాడగలరా? ఆ మాటకొస్తే వేదాల నుండే వాళ్ళ మతం వచ్చిందని విదేశాల్లో ఉన్న వారి మత మహాకేంద్రాల నుండి పెద్దల్ని ప్రకటించమనండి. యుగాల నాటి వేదాల్లో నిన్నమొన్నటి వాళ్ళ ‘దే.అ.వా’ గురించి చెప్పారంటే- త్రికాలవేత్తలైన వేదఋషులను మెచ్చుకొని, తామూ వేదాల ధర్మమైన హిందూ మతంలోకి మారిపోవడం సముచితం కదా!

వారి క్షుద్ర వ్యూహరచనలో మరో ప్రధానాంశం- హిందూ ధర్మంలో ప్రభావితం చేయగలిగే పీఠాధిపతులు, స్వామీజీలు, జ్ఞానులు ఎవరున్నారో తెలుసుకొని- లేని ఆరోపణలైనా చేసి లేదా ఎక్కడో గోరంత చిన్న అంశాన్ని వక్రీకరించి కొండంతలు చేసి వాళ్ళ నిధులతో వెళ్ళమారుతున్న మాధ్యమాల ద్వారా చిలవల పలవల చిందర వందర గందరగోళాలు రేపి ప్రతిష్ఠను దిగజార్చడం. లేని అవినీతిని ఆరోపించో, దురదృష్టవశాత్తు జరిగిన ఏ ప్రమాదాన్నో పెద్దది చేసో అప్రతిష్ఠపాలు చేస్తే చాలు- ధర్మంపై సామాన్యులకు విశ్వాసం సడలుతుందని వారి ఆశ.

మరో అర్థం కాని అబ్బురం- ఈ మార్పిడి మతాలు ఒక్క హిందూ మతంవైపే తప్ప రెండో మతం వారి జోలికి వెళ్లరు. ఎందుకు? వెళితే తమ ఉనికికే ఎసరు కనుక. ఈ మార్పిడుల వల్ల మతానికి జరిగే ప్రమాదాల చర్చ అనవసరం. కానీ దేశానికి జరిగే ప్రమాదం ఎక్కువ. ఎంత కాదన్నా ఈ మార్పిడి మతాల మూలాలు విదేశాలవే. మతంతో ఆక్రమణ, పాలన వారి నైజాలు. వారిని ఉపాసిస్తూ వారి నిధులతో జీవిస్తున్న వీరంతా దేశాన్ని చీల్చడానికి, అనుక్షణం వర్గ- కుటుంబ- మత వైమనస్యాలనీ, అల్లర్లనీ, విద్వేషాలనీ రగల్చడానికి విజృంభిస్తూనే ఉంటారు. కాశ్మీరు, ఈశాన్య రాష్ట్రాలు వంటివి ఎన్నో ఇందుకు తార్కాణాలు. నాయకులు, వారి అండతో బ్రతికే మాధ్యమాలు కప్పిపెట్టిన వాస్తవాలు కుప్పలు తెప్పలు!

ఈ వ్యాసంలో ఎక్కడా అన్యమత సిద్ధాంతాలనీ, వారి ప్రవక్తల్నీ, వారి గ్రంథాలనీ ఇసుమంత కూడా కించపరచలేదని మనవి! అలాంటి ధోరణి హిందూ ధర్మ రీతి కాదు. ఈ దేశంలో అన్ని మతాలు, అన్ని కులాలు కలిసి మెలిసి తమ మత, కులాల్ని వైయక్తిక కుటుంబ పరంగా పరిమితం చేసుకొని, భారతీయులమనే సమైక్య భావనతో, దేశ సమగ్ర ప్రగతికై పురోగమించాలనే వాంఛయే ఈ వ్యాసానికి ప్రేరణ. మార్పిడుల వల్ల ఛిద్రవౌతున్న కుటుంబ సంబంధాలు, వైమనస్యాలు, సంక్షోభాలు- స్పష్టంగా కనిపించే వాస్తవాన్ని గుర్తిద్దాం. ఇంకా ముదిరిపోకముందే జాగ్రత్తపడదాం.

– సామవేదం షణ్ముఖశర్మ

[email protected]

(ఆంధ్రభూమి సౌజన్యంతో)