ఉత్తరప్రదేశ్‌లోని మథురలోని శ్రీ కృష్ణ జన్మభూమి వద్ద ఉన్న షాహీ ఈద్గా కాంప్లెక్స్‌ను అధికారికంగా సర్వే చేయాలని మధురలోని కోర్టు ఆదేశించింది. షాహి ఈద్గా మసీదుకు సంబంధించి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా జనవరి 2 తర్వాత సర్వేను నిర్వహించాలని, నివేదికను 2023 జనవరి 20 నాటికి సమర్పించాలని కోర్టు ఆదేశించింది.
శ్రీ కృష్ణ జన్మస్థాన్ కేసులో హిందూ సేన అభ్యర్థన మేరకు సివిల్ జడ్జి సీనియర్ డివిజన్ (III) కోర్టు సర్వేకు ఆదేశించింది. సీనియర్ డివిజన్ (III) సివిల్ జడ్జి జస్టిస్ సోనికా వర్మ ఈ తీర్పునిచ్చారు. జనవరి 20న తదుపరి విచారణకు కోర్టు వాయిదా వేసింది.
మధురలోని శ్రీకృష్ణ జన్మస్థలంగా భావిస్తున్న 13.37 ఎకరాల భూ యాజమాన్య హక్కులపై వివాదం మొదలైంది. అందువల్ల శ్రీకృష్ణ జన్మస్థలంగా పేరొందిన కత్రా కేశవ్ దేవ్ ఆలయ ప్రాంగణంలో క్రీస్తుశకం 17వ శతాబ్ధంలో మొగల్ చక్రవర్తి ఔరంగజేబు మసీదును నిర్మించారని హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా, ఉపాధ్యక్షుడు సూర్జిత్ సింగ్ యాదవ్ సివిల్ జడ్జి సీనియర్ డివిజన్ (III) జడ్జి సోనికా వర్మ కోర్టులో వాదించారు. శ్రీకృష్ణుని జననం నుండి ఆలయ నిర్మాణం వరకు ఉన్న మొత్తం చరిత్రను వారు కోర్టు ముందు సమర్పించారు. శైలేష్ దూబే కోర్టులో హక్కుదారుల తరఫు న్యాయవాదిగా హాజరయ్యారు.
1968లో శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్ వర్సెస్ షాహీ ఈద్గా మధ్య జరిగిన ఒప్పందాన్ని చట్టవిరుద్ధమని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జనవరి 20వ తేదీలోగా సర్వేయర్ నివేదికను కోర్టుకు సమర్పించాల్సి ఉండగా.. శ్రీకృష్ణ జన్మస్థానం కేసులో ఇప్పటి వరకు 13 కేసులు నమోదయ్యాయి. వీటిలో రెండు కేసులను గతంలో కోర్టు కొట్టివేసింది.
మధురకు ముందు, వారణాసికి చెందిన శృంగార్ గౌరీ-జ్ఞానవాపి కేసులో కోర్టు ఆదేశంపై ఒక సర్వే జరిగింది. ఆగష్టు 17, 2021 న, ఐదుగురు మహిళలు శృంగార్ గౌరీ వద్ద పూజలు చేయడానికి, విగ్రహాలను రక్షించాలని కోరుతూ పిటిషన్ వేశారు. దీనిపై సివిల్ జడ్జి సీనియర్ డివిజన్ రవికుమార్ దివాకర్ కోర్టు కమిషనర్‌ను నియమించి జ్ఞాన్‌వాపీ నిర్మాణాన్ని సర్వే చేయాలని ఆదేశించారు. 16 మే 2022న, సర్వే సమయంలో జ్ఞాన్‌వాపి కాంప్లెక్స్‌లోని వాజుఖానా మధ్యలో ఒక శివలింగం బయటపడింది.