— కె. శ్యామ్‌ప్రసాద్
కరోనా లాక్‌డౌన్ సందర్భంగా వలస కార్మికులు తమతమ ఇండ్లవైపు కాలినడకన పిల్లాజెల్లాతో నడచివెళుతున్న చిత్రాలు దేశంలోని అందరి హృదయాలను పిండివేశాయి. వలస కార్మికులు ప్రతిరాష్ట్రంలోనూ మనం ఊహించిన సంఖ్యకంటే ఎంతో ఎక్కువ ఉన్నారన్న విషయం మొదటిసారిగా మనందరి దృష్టికి వచ్చింది. వలస కార్మికులు అంటే ఎవరు? వారి సమస్యలు ఏమిటి ?
అధికారం కోసం అడ్డదారులుత్రొక్కే మన రాజకీయనాయకులు అనేకసార్లు ప్రాంతీయ భావాలను రెచ్చగొడుతూ ఉంటారు. ‘‘ముంబాయి కేవలం మరాఠీలకు చెందిందే, ఇతర రాష్ట్రాలవారు ఇక్కడ ఉపాధి కోసం రారాదు’’ అని శివసేన నాయకుల హెచ్చరికలు. ‘‘తెలంగాణా నుండి ఆంధ్రావాళ్ళు వెళ్ళిపోవాలి’’ తెలంగాణా ఉద్యమ సందర్భంగా కె.సి.ఆర్. హెచ్చరికలు. ‘‘మేము ద్రావిడులం. ఉత్తరభారతదేశపు ఆర్యుల ఆధిపత్యం మాకు వద్దు’’ అని తమిళనాడులోని డి.ఎమ్.కె. నాయకుల హెచ్చరికలు. ‘‘అస్సాంలో ఇతర రాష్ట్రాల ప్రజలు ఉండరాదు’’ అస్సాం ఉద్యమ సందర్భంగా ఆసు నాయకుల హెచ్చరికలు. ఇవన్నీ మనం చూసాం. ఈ హెచ్చరికలను ఏమీ లెక్కచేయకుండా తమ పొట్టకూటికోసం ప్రతి రాష్ట్రం నుండి లక్షలాదిమంది పేద ప్రజలు అనేక ఇతర రాష్ట్రాలకు వెళ్ళి రకరకాల కూలి, నాలి పనులు చేస్తూ, ప్రజల అవసరాలు తీరుస్తున్నారు. ఇలా వెళ్ళే వలసకూలీలలో ఎక్కువమంది గ్రామాలలోని భూమిలేని పేదకూలీలు (Landless poor), భూమి ఉన్నా చాలా కొద్ది భూమి మాత్రమే ఉండి నీటివసతి లేనికారణంగా వ్యవసాయం చేయలేక వలస కూలీలు అయినవారు మరికొందరు. వీరిలో షెడ్యూల్డు కులాలవారి సంఖ్య గణనీయంగా ఉన్నా, వలస కూలీలలో అన్ని కులాలవారు ఉన్నారు. ప్రతి రాష్ట్రంలోనూ, ఇతర రాష్ట్రాలనుండి వచ్చి భవన నిర్మాణాలు, వడ్రంగి పనులు, విద్యుత్ పనులు, మట్టి తవ్వకాలు ఇలాంటి శ్రమతో కూడిన పనులు చేస్తుంటారు. ఆడ,మగ అందరూ పనిచేస్తారు. శిశువులు చెట్టుక్రింద చీర ఉయ్యాలలో పడుకోవడము, మట్టిలో ఆడుకోవడము చేస్తుంటారు. వలస కార్మికుల పిల్లల చదువులు అగమ్యగోచరం. వృద్ధులైన తల్లి, తండ్రులను తమతమ గ్రామాలలోనే ఇళ్ళకు రక్షణగా ఉంటారు. పెద్ద నగరాలయిన ఢిల్లీ, ముంబాయి, కలకత్తా, బెంగుళూరు, హైదరాబాదు, చెన్నై నగరాలలో లక్షల సంఖ్యలో వలస కూలీలు పనిచేస్తున్నారు. పెద్దపెద్ద బహుళ అంతస్థుల భవనాలు, అందమైన ఫ్లై ఓవర్ బ్రిడ్జీలు, విలాసవంతమైన కార్లతో నిండిన వైడల్పయిన రోడ్లు ఈ సుందర చిత్రాల వెనుక ఎవరి దృష్టికి రాకుండా అదృశ్యంగా, ఎవరికి పట్టకుండా లక్షల సంఖ్యలో వలస కూలీలు జీవనాన్ని గడుపుతున్నారు. అన్ని రాష్ట్రాలకు చెందిన, అన్ని రాష్ట్రాలలో ఉండే ఈ వలస కూలీలు ఆర్థికంగా చూస్తే ‘అన్నార్తులు’. సామాజికంగా చూస్తే అన్ని కులాలవారు, అన్ని మతాలకు చెందినవారు. దేశసమైక్యత దృష్ట్యా చూస్తే ‘‘దేశసమైక్యతకు వారధులు’’. వీరికి తమ రాష్ట్రంపట్ల, తమ భాషపట్ల ప్రేమ ఉంది. కాని ఇతర రాష్ట్రాలపట్ల, ఇతర భాషలపట్ల ద్వేషం, చిన్నచూపులేదు.
తెలుగు రాష్ట్రాల చిత్రం:
ఆంధప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖకు చెందిన తీరప్రాంతపు మత్స్యకారులు సముద్రంలో వేటదొరకని కారణంగా అనేక సంవత్సరాలుగా ఉత్తర సముద్రతీరానికి, గుజరాతుకు వెళుతున్నారు. ప్రకాశం, నెల్లూరుకు చెందిన తీరప్రాంత మత్స్యకారులు కర్ణాటక సముద్రతీర ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. నెలూరుజిల్లా ఉదయగిరి, ప్రకాశంజిల్లా కనిగిరి వైపుగల ప్రజానీకం తాగడానికి నీళ్ళులేక, వ్యవసాయానికి నీళ్ళులేక ఇటుకబట్టీల పనులకోసం అనేక సంవత్సరాలుగా వివిధ రాష్ట్రాలకు వెడుతున్నారు. పరిపాలకుల నిర్లక్ష్యానికి గురైన రాయలసీమ జిల్లాలలో, ప్రధానంగా అనంతపురం జిల్లాలోని రైతుకూలీలు, సన్నకారు రైతులు వేల సంఖ్యలో గ్రామాలకు గ్రామాలు ఖాళీచేసి బెంగుళూరుకు వెళుతున్నారు. రాయలసీమ నుండి రాష్ట్రపతి, ముఖ్యమంత్రులు ఎన్నికై వచ్చినా నేటికీ అనంతపురం జిల్లాలో అనేక గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఇది పాలకుల వైఫల్యం. వలస కార్మికుల జిల్లాగా పేరుపొందిన పాలమూరు నుంచి కూలీలు అనాదిగా ముంబాయికి వెళుతున్నారు. ఇవి ఆంధప్రదేశ్, తెలంగాణాలకు చెందిన కొన్ని వార్తలే. ప్రతి పట్టణంలో భవన నిర్మాణాలు చేసేకూలీలు ఎక్కువమంది బీహారువారే!
వైద్య అత్యయిక పరిస్థితి నుండి ఆర్థిక అత్యయిక పరిస్థితి వైపు….
కరోనా వైరస్ బారినుండి ప్రజలను కాపాడటం కోసం కేందప్రభుత్వం లాక్‌డౌన్‌ను ప్రకటించింది. ఒకరకమైన వైద్యపరమైన అత్యయిక పరిస్థితి (Medical Emergency)ఇది. ప్రభుత్వం ప్రకటించిన ఈ నియమాలను దేశంలోని గ్రామీణ ప్రజానీకం తూ.చ. తప్పకుండా అమలుచేస్తోంది. పట్టణాలలో ఉన్న చదువుకున్న వారికి ఈ నియమాలను పాటించే శ్రద్ధేలేదు. తాజాగా హైదరాబాదులోని మాదన్నపేట బస్తీలో ఒక శిశువు నామకరణ సందర్భంగా 50మంది కలిశారు. ఫలితం తల్లి, శిశువు 30మందికి కరోనా సోకింది.
కరోనా లాక్‌డౌన్‌ను కేందప్రభుత్వం ప్రకటిస్తూ వలస కార్మికులను తరలించరాదని ఎక్కడవారికి అక్కడే అవసరమైన సదుపాయాలను కలిపించాలని లిఖితపూర్వకంగా స్పష్టంగా సూచనలను పంపింది. అయినా ఢిల్లీ ముఖ్యమంత్రి ఈ సూచనలను తుంగలోత్రొక్కి ఢిల్లీలోఉన్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలస కూలీలను బస్సులలో పంపడానికి ప్రయత్నించారు. పేదప్రజల వ్యతిరేక చర్యలో భాగస్వాములయిన కొందరు ఐ.ఎ.ఎస్. ఆఫీసర్లు తాము చేసిన పొరపాటుకు సస్పెండు కావల్సివచ్చింది. దేశవ్యాప్తంగా సేవాభారతి, తదితర అనేక సేవా సంస్థలు మిగిలిన పేదప్రజలతోపాటు ఈ వలస కూలీలకు కూడా ఆహారపు పాకెట్లు, మంచినీరు, శానిటైజర్లు అందజేశారు. ఎక్కువమందికి వీరి సేవలు అందిఉండకపోవచ్చు. ‘‘ఒకప్రక్క పనులు లేవు. తమ ఊరుకాని ఊళ్ళో ఉన్నారు. కరోనా భయం. తిరిగి పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియని అగమ్యగోచర పరిస్థితి. మిగిలిన ప్రజానీకంలాగా తలదాచుకోవడానికి ఈ వలసకూలీలకు ఇళ్ళెక్కడ ఉన్నాయి ?’’ 25రోజులు గడిచేటప్పటికి దేశంలోని వలస కూలీలందరూ తమ తమ గ్రామాలకు వెళ్ళిపోవాలన్న నిశ్చయానికి వచ్చారు. ‘‘గ్రామంలో సురక్షితంగా ఉండి, ఏది ఉంటే అది తిందాం’’ అనే నిర్ణయానికి వచ్చారు. ఈ వలస కూలీల మనస్థితిని గమనించిన కేందప్రభుత్వం రెండోదశ లాక్‌డౌన్ ముగింపు సందర్భంగా వారిని తమతమ రాష్ట్రాలకు పంపడానికి అంగీకరించి ప్రత్యేక రైళ్ళను ఏర్పాటుచేసింది. ఈ సమయంలో కేంద్ర, రాష్ట్రాల నాయకులు ‘‘మీరు మీమీ గ్రామాలకు వెళ్ళవద్దు. తిరిగి పనులు ప్రారంభమవుతాయి. యధావిధిగా మీరు పనులు చేసుకోవచ్చును’’ అనే హామీని, నమ్మకాన్ని వలస కూలీలలో కలిగించలేకపోయారు.
ఈ ప్రత్యేక రైళ్ళల్లో వలస కార్మికుల ప్రయాణపు చార్జీలలో 85శాతం రైలు చార్జీలను కేందప్రభుత్వం భరించడానికి అంగీకరించింది. 15శాతం ఆయా రాష్ట్రాలను భరించమంది. దేశంలోని 5రాష్ట్రాలు – మహారాష్ట్ర, ఆంధప్రదేశ్, తెలంగాణ, బెంగాల్, తమిళనాడు కేందప్రభుత్వానికి సరియైన సహకారం అందించలేకపోయాయి. విదేశాలలో చిక్కుకున్న భారతీయులను దేశానికి తీసుకురావడం కోసం కేందప్రభుత్వం ప్రత్యేక విమానాలను, ఓడలను ఏర్పాటుచేసింది. కాని కొన్ని రాష్ట్రాలు వలస కూలీలు తమతమ రాష్ట్రాలకు వెళ్ళటంలో శ్రద్ధ పెట్టకపోవటం దురదృష్టకరం. ఒకప్రక్క భారీసంఖ్యలో ఇంటిముఖం పట్టి ప్రధాన రహదారులగుండా కుటుంబాలతో, పిల్లలతో నడుస్తున్న వలస కూలీల దృశ్యాలు. రాష్ట్ర సరిహద్దులవల్ల గుమిగూడిన వలసకూలీలు. ఆవేశంతో తిరగబడినవారు కొందరు. 25రోజులుగా రాత్రి, పగలు అనక పనిచేస్తున్న పోలీసులు, నిగ్రహం కోల్పోయి వలసకార్మికులపై లాఠీని ఝుళిపించిన చిత్రాలు. ఇదే అదనుగా మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించటానికి ఎదురుచూస్తున్న కాంగ్రెస్, వామపక్ష మేధావులు, కార్యకర్తలు. వలస కార్మికులపై తమ మొసలి కన్నీరును ఒలకపోశారు. ఈ పరిణామాలను ఆసరా చేసుకుని దేశంలో ఒక అరాచక వాతావరణం నిర్మాణం చేయాలన్నది కొన్ని దుష్టశక్తుల వ్యూహం.
హైదరాబాదు నుండి వలసకూలీలతో కూడిన ఒక రైలు బీహార్ లోని పాట్నాకు చేరుకుంది. రైలుదిగిన కొందరు వలస కూలీలు ప్లాటుఫారంపై సాష్టాంగపడి తమ మాతృభూమి బీహార్‌కు వందనం చేశారు. వారివారి గ్రామాలకు వెళ్ళాలన్న ఆతృత ఆ చిత్రాలలో మనకు కనబడుతుంది.
ఈ వలస కూలీలు ఆయా గ్రామాలకు వెళితే ఇంతవరకు సురక్షితంగా ఉన్న గ్రామాల్లో కరోనావైరస్ వ్యాపిస్తుందన్న భయం ఆయా గ్రామస్థులలో, పరిపాలకులలో ఉంది. ఈ భయంలో నిజం లేకపోలేదు. ఈ వలస కార్మికులందరిని క్వారంటైన్‌లో పెట్టడం సులభమైంది ఏమీకాదు. కాని చేయకతప్పదు. ఇప్పటికీ జాతీయ రహదారిగుండా నడచివెళుతున్న దృశ్యాలు కనబడుతున్నాయి. వీరికి అనేకచోట్ల ఆర్.ఎస్.ఎస్., సేవాభారతి, సమరసతా సేవాఫౌండేషన్, తెలంగాణా, ఆంధ్రాలలో భోజనపాకెట్లు, మంచినీరు, కొన్నిచోట్ల చెప్పులు అందిస్తున్నాయి.
కరోనా విస్తృతిని ఆపటంకోసం ఇంతవరకు లాక్‌డౌన్ పేరున ‘వైద్య అత్యయిక పరిస్థితి’ అప్రకటితంగా అమలయింది. సడలింపులు ప్రారంభమయ్యాయి. లాక్‌డౌన్‌వల్ల దేశ ఆర్థికచక్రం తిరగటం ఆగిపోయింది. దేశం అప్రకటిత ఆర్థిక అత్యయిక పరిస్థితి(Economic Emergency)లోకి ప్రవేశించింది. ఈ ప్రభావం అన్ని వర్గాల ప్రజలపై ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం పెద్ద ఆర్థిక పాకేజీని ప్రకటించింది. వీటిని అమలుచేసే రాష్ట్రప్రభుత్వ యంత్రాంగాలకు ఎంతో చిత్తశుద్ధి అవసరం. వలస కూలీలపై ఖర్చుపెట్టడం అనుత్పాదక ఖర్చుగా పరిగణించడం తగదు.
స్వయంపోషక గ్రామాల నిర్మాణదిశలో….
తమతమ గ్రామాలకు చేరిన వలస కార్మికులలో కొందరు తిరిగి పనులకు బయటకు వెళ్లకూడదని నిశ్చయించుకున్నారు. గ్రామాలను ఆర్థిక స్వయంపోషకం (Economic self sufficient) గా తీర్చిదిద్దే విధానంలో భాగంగా ఆయా గ్రామాలలోనే ఈ వలస కార్మికుల సేవలను తీసుకోవలసిన అవసరం ఉంది. దీనికోసం ప్రణాళికలను నిపుణులు సూచించాలి. ఈ సూచనలను సక్రమంగా అమలుచేయాలి. ఈ పనిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధికలిగిన కొన్ని స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలి.
వలస కూలీలకు ఉపాధి కల్పనా విధానాలు రూపొందించాలి:
తమ రాష్ట్రానికి చెందినవారైనా, ఇతర రాష్ట్రాలనుండి వచ్చిన వలస కూలీలయినా అందరికీ ‘సమాన స్ఫూర్తి’తో ఉపాధిపనులు కల్పించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. ఏ వలస కూలీలూ ఆకలితో అలమటించరాదు. ఆకలితో ఆత్మహత్యలకు గురి కాకూడదు. దీనికై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ స్వచ్ఛంద సంస్థలు చేపట్టవలసిన విధానాలు, కార్యక్రమాలపై నిపుణులు తమ విలువైన సలహాలు అందజేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అధికార మాయాజాల చట్రంనుండి బయటపడి నిపుణుల సలహాలను స్వీకరించి అమలుకై కృషిచేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలమధ్య అహంకారాలకు, ఆధిపత్య రాజకీయాలకు, రాజకీయ లబ్దికి చోటివ్వకుండా సమన్వయంతో పనిచేయాలి. ఈ క్లిష్ట సమయంలో సమస్యలాధారంగా ఉద్యమించటంకాక సమస్యలను పరిష్కరించే దిశలో మేధావులు, సామాజిక కార్యకర్తలు కృషిచేయాలి. దేశవ్యాప్తంగా వలస కూలీల ఉపాధి అవకాశాలపై అమలును పరిశీలించే ఒక వ్యవస్థను వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పరచాలి.
(వ్యాసకర్త జాతీయ కన్వీనర్, సామాజిక సమరసత)