Home News మతమార్పిడి వేధింపులకు విద్యార్థిని బలి

మతమార్పిడి వేధింపులకు విద్యార్థిని బలి

0
SHARE
Image Source: The Jaipur Dialogues https://twitter.com/JaipurDialogues/status/1484427601280057347

మతమార్పిడి వేధింపులు భరించలేక మైనర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తంజావూరులోని అరియలూరుకు చెందిన 17 ఏళ్ల అనిత (పేరు మార్చబడింది) స్థానిక సేక్రెడ్ హార్ట్స్ పాఠశాలలో 12వ తరగతి చదువుతోంది. చదువులో ఎప్పుడూ ముందుండే అనిత హిందూ మతానికి చెందిన బాలిక, పైగా నిరుపేద కుటుంబానికి చెందడంతో పాఠశాల యాజమాన్యం కళ్ళు ఆమెపై పడ్డాయి. ఈ క్రమంలో పాఠశాల యాజమాన్యం ఓ రోజు అనిత తల్లిదండ్రులను పిలిచి, “మీ అమ్మాయి క్రైస్తవం స్వీకరిస్తే ఆమె పై చదువులకు ఆర్ధిక సహాయం చేస్తాం” అని ఆశపెట్టారు. అయినప్పటికీ అనిత ఏమాత్రం లొంగలేదు. తాను హిందుత్వాన్ని విడిచి క్రైస్తవంలోకి మారే ప్రసక్తే లేదు అని ఖరాకండిగా మొహం మీదనే చెప్పేసింది.

తాను హిందూ మతాన్ని వీడేది లేదు అని బాలిక అనిత మొహం మీదనే చెప్పడంతో ఆ క్రైస్తవ పాఠశాల యాజమాన్యం ఆగ్రహంతో ఊగిపోయింది.  ఎలాగైనా అనితను క్రైస్తవంలోకి మార్చాల్సిందే అని దృఢంగా నిశ్చయించుకుంది. ఈలోపు సంక్రాతి సెలవలు వచ్చాయి. ఇదే అదనుగా, ఆ పాఠశాల యాజమాన్యం, హాస్టల్లో చదువుతున్న విద్యార్ధులందరినీ ఇంటికి పంపించివేశారు. అనితను మాత్రం హాస్టల్లోనే బందీగా ఉంచారు. అంతే కాదు, హాస్టల్లో టాయిలెట్స్ శుభ్రపరిచే పని అప్పగించారు, వెట్టిచాకిరీ చేయించారు. ఈ క్రమంలో పాఠశాలకు చెందిన ఓ క్రైస్తవ సన్యాసిని (సిస్టర్), వార్డెన్లు వచ్చి.. “మతం మారిపో, ఈ బాధ తప్పుతుంది” అని మరోసారి తనను మతంమార్చే ప్రయత్నం చేసారు. అయినప్పటికీ, ఎంతో దృడంగా వ్యవహరించింది. కానీ పాఠశాల చేసిన ఘోర అవమానం,  చేయిస్తున్న వెట్టిచాకిరీ, పెడుతున్న చిత్రహింసలు, మతమార్పిడి వేధింపులు భరించలేక విషం తాగి ప్రాణాలు విడిచింది.

19వ తేదీన అనిత చికిత్స పొందుతూ హాస్పిటల్లో మరణించే ముందు తన మరణ వాఙమూలం ఒక వీడియో రూపంలో బయటపెట్టింది. దీంతో ఈ ఘటనపై యావత్ సమాజం ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఈ కేసును నీరుగార్చే ప్రయత్నాలు అప్పటికే మొదలయ్యాయి. ఇది ఒక సాధారణ ఆత్మహత్య కేసుగా  రెండు మూడు బలహీనమైన సెక్షన్లతో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసిన పోలీసులు హాస్టల్, కేవలం హాస్టల్ వార్డెన్ ను అరెస్ట్ చేసి చేతులు దులుపుకున్నారు. మరోవైపు ఈ కేసు విచారణ దశలోనే ఉన్న సమయంలో ‘మతమార్పడి కోణం లేదు’ అని స్వయంగా జిల్లా ఎస్పీ రవళి ప్రియ ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించడంతో తీవ్రమైన విమర్శలు వచ్చాయి.

ఈ కేసు విచారణ తీరుపై అనుమానం వ్యక్తం చేస్తూ, విచారణ సరైన దిశలో సాగేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ జాతీయ బాలల హక్కుల కమిషన్ను ఆశ్రయించింది. దీనిపై స్పందించిన కమిషన్.. మతమార్పిడి కోణంపై విచారణ చేసి, తీసుకున్న చర్యల వివరాలు తమకు సమర్పించాల్సిందిగా తమిళనాడు రాష్ట్ర డీజీపీకి నోటీసు జారీ చేసింది.

జిల్లా ఎస్పీ అనుసరిస్తున్న వైఖరిపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసిన లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్, ఆమెపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరింది.

మరోవైపు పోలీసులు తమను వేధిస్తున్న విషయంపై, బాలిక ఆత్మహత్య కేసులో  విచారణ తీరుపై బాలిక తల్లిదండ్రుల మధురై హైకోర్టు బెంచుని ఆశ్రయించారు. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు బెంచ్, పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలిక తల్లిదండ్రులపై వేధింపులు మానుకోవాలని హితవు పలికింది. ఈ కేసు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. విచారణకు హాజరు కావాల్సిందిగా బాలిక తల్లిదండ్రులను ఆదేశించింది.

 

Courtesy : NIJAM TODAY