‘నాగరిక ప్రవర్తనలో మన భారతీయులు మరీ ఇంత దిగనాసిగా ఉంటారేం?’ అని మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఒక సందర్భంలో ప్రశ్నించారు. స్వదేశంలో తమ కుక్కతో కాలిబాటపై మూత్ర విసర్జన చేయించడానికి సందేహించని భారతీయులు, సింగపూర్ వెళితే మాత్రం ఎంతోబుద్ధిగా మసలుకొంటారు. అక్కడ బస్సు టికెట్‌ను కూడా రోడ్డుమీద పారేయకుండా అతి జాగ్రత్త పాటిస్తారు. దీన్నిచూసే కలాం ఆ ప్రశ్న వేశారు.
ఆచరణ అవసరం
మన నాగరికత ఎంతో ప్రాచీనం, మహోన్నతమని గర్విస్తాం. కానీ నగరాలు పట్టణాల్లో కుప్పలుతెప్పలుగా చెత్త పేరుకున్నా మనం పట్టించుకోం. కాలుష్యం, అవినీతి కట్టలు తెంచుకుంటూ ఉంటే నిస్సహాయంగా చూస్తూఉంటాం. ఈ వైరుద్ధ్యం విదేశీ పర్యాటకులపై చెరగని ముద్రవేస్తోంది. భారత్ నేడు ప్రపంచంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమైనప్పటికీ మన పౌరులు ఇంకా పూర్తిస్థాయిలో నాగరిక ప్రవర్తన అలవరచుకోకపోవడం చింతించాల్సిన విషయం. మానవులు సంఘజీవులు. సమాజంలో ఎలా మెలగాలో తెలుసుకోవడం నాగరికతకు తొలిమెట్టు. సభ్యత, సంస్కారం అలవరచుకోవడం, స్త్రీలు వృద్ధులపట్ల గౌరవంగా మెలగడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, రోడ్లమీద అదేపనిగా హారన్ మోగించి ఇతరులను చికాకు పెట్టకపోవడం, నిర్దేశిత స్థలాలు లేదా డబ్బాల్లోనే చెత్త పారేయడం, బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేయకపోవడం, రహదారులు, బహిరంగస్థలాలు, కార్యాలయాలను శుభ్రంగా ఉంచడం, నీరు, విద్యుత్‌లను పొదుపుగా వాడటం, పన్నులు సక్రమంగా చెల్లించడం… ఇవన్నీ నాగరిక ప్రవర్తనలో, సామాజిక స్పృహలో అంతర్భాగాలే. కానీ, మన పట్టణాలు, నగరాల్లో ఎక్కడ చూసినా చెత్తతో పొంగిపొర్లే కుండీలు, నాలాలు, రోడ్డు పక్కన మలమూత్ర విసర్జన, చెత్తకుప్పలు, జర్దా నమిలి ఊసిన మరకలు, రోడ్లమీద రవాణారద్దీ, ప్రధాన రహదారుల పక్కన కానరాని ఫుట్‌పాత్‌లు, గోడలమీద అసభ్య రాతలు, జనానికి ఒద్దికగా బారులు కట్టే అలవాటు లేకపోవడం వంటి సంస్కారహీన చర్యలే కనిపిస్తాయి. పేదలైనా, ధనికులైనా తమ ఇల్లు శుభ్రంగాఉంటే చాలనుకుని, చెత్తను రోడ్లమీద పారేస్తారు. క్రమశిక్షణ లేని స్వేచ్ఛ అరాచకానికి దారితీస్తుంది. మన రహదారులు మురికి తేలాయంటే ప్రధాన కారణం, వాటిని పురపాలక సంఘం శుభ్రం చేయకపోవడం కాదు- దానికన్నా ముందు మనం రోడ్లను కంగాళీ చేయడమే!
వందల ఏళ్ల క్రితం భారత ఉపఖండంలో హరప్పా, మొహంజొదారో వంటి పురాతన నగరాలు ఎంతో శుభ్రంగా, ప్రణాళికాబద్ధంగా ఉండేవి. ఆధునిక యుగానికి వచ్చేసరికి వీధుల్లో చెత్త, నాలాల్లో ప్లాస్టిక్ సంచులు పేరుకుపోయి ముంబయి, చెన్నై, హైదరాబాద్ తదితర నగరాలు చినుకుపడితే చాలు- వరదనీటిలో మునకలేస్తున్నాయి. మన నగరాల్లో మురికికాల్వల పక్కన బోలెడన్ని తినుబండారాల బండ్లు, ఐస్‌క్రీమ్ బండ్లు కనిపిస్తాయి. వినియోగదారులు వదలిన ఖాళీపళ్లాలు, మిగిలిపోయిన ఆహార పదార్థాలు నేరుగా నాలాల్లోకి చేరుతున్నాయి. వాటిలో పుట్టే ఈకోలీ వంటి రోగకారక బ్యాక్టీరియా మళ్ళీ తినుబండారాల్లోకి చేరిపోతున్నాయి. ముంబయి సబర్బన్ రైళ్ల మార్గంలో ఏటా వేలమంది మరణిస్తున్నా, చీమకుట్టినట్లైనా లేని సమాజానికి నాగరిక స్పృహ ఉందని ఎలా అనుకోగలం? వీరిలో చాలామంది తలుపుల్లేని సబర్బన్ రైళ్లలో తోపులాట వల్ల, తోటి ప్రయాణికుల దురుసు ప్రవర్తనవల్ల మరణించినవారే. చట్టసభల్లో ప్రజాప్రతినిధుల తోపులాటలే కాదు, పిడిగుద్దులకు దిగిన ఉదంతాలూ అనేకం. కాబట్టి మనదేశం నైతికంగా సమున్నతమైనదని గొప్పలు చెప్పుకోవడం తగ్గించి, మొదట మన వ్యక్తిగత ప్రవర్తనను సంస్కరించుకోవాలి.
రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య ప్రపంచంలోకెల్లా భారత్‌లోనే ఎక్కువని అధ్యయనాలు చాటుతున్నాయి. రోడ్డు ప్రమాదాలవల్ల దేశంలో ప్రతి 3.6 నిమిషాలకు ఒక ప్రాణం పోతోంది. వీటివల్ల జరుగుతున్న ఆర్థికనష్టం మన జీడీపీలో మూడు శాతానికి సమానం. ఇతర దేశాల్లో రోడ్డు ప్రమాదాలైతే ఆదుకోవడానికి బాటసారులు స్వయంగా ముందుకొస్తారు లేదా సహాయ సంస్థకు సమాచారం అందిస్తారు. అదే భారతదేశంలో ఏదైనా ప్రమాదం జరిగితే బాటసారులు, వాహన చోదకులు చోద్యం చూసినట్లు చూసి, తమ దారిన తాము పోతారే తప్ప సాయపడటానికి ముందుకురారు. మనలో నాగరిక ప్రవర్తన ఏ తీరున ఉందో చెప్పడానికి ఇంతకన్నా వేరే ఉదాహరణ అక్కర్లేదు. ప్రాథమిక విధుల గురించి టీవీ ఛానళ్లు, వార్తా పత్రికల ద్వారా ప్రజలకు పూర్తి అవగాహన కల్పించే విషయం పరిశీలించాలని న్యాయస్థానాలు ప్రభుత్వాలను కోరుతున్నాయి. దీనికితోడు ఏటా ప్రాథమిక విధుల దినోత్సవం జరిపే విషయమూ ఆలోచించాలి. విద్యార్థులు ఈ విధులను పాటించేలా చిన్ననాటి నుంచే ఉపాధ్యాయులు నూరిపోయాలి.
అపరాధానికి శిక్షలు
అధునాతన టెక్నాలజీ సాయంతో విస్తరించిన ప్రపంచీకరణ మన ఆర్థిక, సామాజిక జీవితాలను సమూలంగా మార్చేస్తోంది. పౌర బాధ్యతలంటే ఎన్నికల్లో ఓట్లు వేయడం, ప్రభుత్వ పాత్ర గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు- స్థానిక, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను ఎప్పటికప్పుడు ఆకళింపు చేసుకొంటూ తగు కార్యాచరణ రూపొందించుకోవడం కూడా! పలు అంశాలపై సామాన్య ప్రజల దృక్పథాలను మార్చడానికి యువత చొరవ తీసుకోవాలి. సామాజిక మాధ్యమాల్లో ఈ విధిని బాధ్యతాయుతంగా నిర్వహించాలి. నాయకులు తామూ బాధ్యతగా మెలగడం ద్వారా ప్రజలకు బాధ్యత నేర్పాలి. లండన్, టొరంటో, శాన్‌ఫ్రాన్సిస్కో వంటి నగరాల్లోని కాలనీల్లో ఏదైనా ప్రైవేటు స్థలంలో చెత్త, శిథిలాలు కనిపిస్తే, స్థానికులు వాటి గురించి నగరపాలికకు వెంటనే తెలియజేస్తారు. సంబంధిత వ్యక్తి తక్షణం ఆ చెత్త తొలగించాలి. లేదంటే నగరపాలిక ఒక కాంట్రాక్టర్‌తో చెత్త ఎత్తించి అందుకైన వ్యయాన్ని సంబంధిత పౌరుడి నుంచి వసూలు చేస్తుంది. తన విధులను విస్మరించిన పౌరులు అందుకు మూల్యం చెల్లించేలా భారతదేశమూ చర్యలు చేపట్టాలి.
పౌరులు నాగరికంగా నడచుకొన్నప్పుడు కలిగే ప్రయోజనాలు కేవలం ధనరూపమైనవే కావు- అవి బహుముఖం. మనమంతా ఒక్కటే, అందరి శ్రేయస్సుతోనే వ్యక్తిగత శ్రేయం ముడివడి ఉందన్న గ్రహింపు నుంచి నాగరిక ప్రవర్తన అలవడుతుంది. చట్టాలు, శిక్షలు మనం నాగరికంగా నడచుకునేలా ఒత్తిడి తెచ్చే మాట నిజమే అయినా, నాగరిక ప్రవర్తన అనేది మనలో నుంచే రావాలి. ప్రతి వ్యక్తీ తాను సక్రమంగా ప్రవర్తిస్తూ ఇతరులు అక్రమ నడతకు పాల్పడకుండా చూడాలి. ఉన్నత జీవనానికి నిలువెత్తు ఉదాహరణగా నిలవాలి!
పి వి రావు
(ఈనాడు సౌజన్యం తో)