Home News పార్లమెంటు ఎగువసభ (రాజ్యసభ) కు పిలిచి పదవులిస్తే… అగౌరవపరుస్తూ పదవుల్లో కొనసాగవలసిన అవసరం ఉందా?

పార్లమెంటు ఎగువసభ (రాజ్యసభ) కు పిలిచి పదవులిస్తే… అగౌరవపరుస్తూ పదవుల్లో కొనసాగవలసిన అవసరం ఉందా?

0
SHARE

వివిధ రంగాల్లో నిష్ణాతులమంటూ రాష్ట్రపతి రాజ్యసభకు నియమిస్తున్న కొంతమంది సభ్యులు, సభాకార్యకలాపాల పట్ల ఎంతమాత్రం ఆసక్తి చూపడం లేదు. అసలు, సభకే హాజరు కావడం లేదు. నాటి పృథ్వీరాజ్‌ కపూర్‌, నర్గీస్‌దత్‌ మొదలుకొని నేటి సచిన్‌ తెందూల్కర్‌, రేఖ వరకు ఇదే పరిస్థితి! చట్టసభను ఈ విధంగా అగౌరవపరుస్తూ పదవుల్లో కొనసాగవలసిన అవసరం ఉందా అన్నది వారే ఆలోచించుకోవాలంటున్న వ్యాసమిది…

పార్లమెంటు ఎగువసభ(రాజ్యసభ)కు నియమితులైన కొంతమంది సభ్యులు సభాసమావేశాలకు అసలే హాజరు కాకుండా ఉండటంపై ఈ మధ్య మరోసారి వాడిగా, వేడిగా చర్చ జరిగింది. తీవ్రస్థాయి విమర్శలూ చెలరేగాయి. ఆ నేపథ్యంలో సచిన్‌ తెందూల్కర్‌ ఈ నెల మూడున హఠాత్తుగా కాసేపు రాజ్యసభకు హాజరయ్యారు. రాజ్యసభకు నియమితులైన సచిన్‌ తెందూల్కర్‌, రేఖ సభ సమావేశాలకు హాజరు కాకపోవడంపై కొంతకాలంగా మీడియా ప్రత్యేక దృష్టి సారించింది. వారి చర్య చట్టసభను అగౌరవపరచడమేనంటూ వివిధ వర్గాలూ ఆరోపిస్తున్నాయి, ఆక్షేపిస్తున్నాయి. సచిన్‌ తెందూల్కర్‌ 2012 ఏప్రిల్‌ 27న రాజ్యసభకు నియమితులయ్యారు. అప్పటినుంచి రాజ్యసభ 374 రోజులపాటు సమావేశమైంది. అందులో సచిన్‌ హాజరైంది 24 రోజులు మాత్రమే. 2012లో ఆయన రాజ్యసభకు నియమితుడయ్యాక మొట్టమొదట బడ్జెట్‌ సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాలకూ ఆయన దూరంగానే ఉన్నారు. ఆ ఏడాది వర్షకాల సమావేశాల సందర్భంగా మాత్రం ఒకే ఒక్కరోజు హాజరయ్యారు. ఆ ఏడాది శీతకాల సమావేశాలకు, 2013లో మొదటి, రెండో దఫా బడ్జెట్‌ సమావేశాలకూ హాజరుకాలేదు. 2014లో రెండో దఫా శీతకాల సమావేశాలు, ప్రత్యేక సమావేశాలు, బడ్జెట్‌ సమావేశాలకూ గైర్హాజరయ్యారు.

మరో సభ్యురాలు, సినీనటి రేఖ సైతం రాజ్యసభ సమావేశాల పట్ల ఏమాత్రం ఆసక్తి చూపడంలేదు. ఆమెనూ 2012 ఏప్రిల్‌ 27నాడే నియమించారు. సభ సమావేశమైన 374 రోజుల్లో ఆమె 18 రోజులు మాత్రమే హాజరయ్యారు. 2012, 2013, 2014లలో మూడేసి రోజులు మాత్రమే సభకు వచ్చారు. ప్రస్తుత వర్షకాల సమావేశాల సందర్భంగా ఒకే ఒక్క రోజు హాజరయ్యారు. గడచిన అయిదేళ్లలో సభలో ఆమె ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. గొప్ప నటిగా ఆమెను అభిమానించేవారు లక్షల సంఖ్యలో ఉన్నారు. కానీ, పార్లమెంటు సభ్యురాలిగా ఆమె వ్యవహారశైలిని మాత్రం ఎవరూ హర్షించలేకపోతున్నారు. రాజ్యసభకు నియమితులైన సభ్యుల హాజరు విషయంలో అనేక ఏళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. పృథ్వీరాజ్‌ కపూర్‌, నర్గీస్‌ దత్‌, పండిత్‌ రవిశంకర్‌, ఎం.ఎఫ్‌.హుస్సేన్‌, ఆర్‌.కె.నారాయణ్‌ వంటి ప్రముఖులు ఎంతోమంది 1950ల నుంచి రాజ్యసభకు నియమితులయ్యారు. వారెవరూ సభకు పెద్దగా హాజరైంది లేదు. 1999-2005 మధ్యకాలంలో రాజ్యసభ సభ్యురాలిగా వ్యవహరించిన ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ హాజరుతీరు మరీ దారుణం. ఆరేళ్ల కాలంలో ఆమె 11 రోజులు మాత్రమే హాజరయ్యారు. 2002-2003 మధ్యకాలంలో ఆమె ఒక్కరోజు మాత్రమే రాజ్యసభకు హాజరయ్యారు.

సచిన్‌ తెందూల్కర్‌ రాజ్యసభకు హాజరుకావడం లేదన్న విషయాన్ని గ్రహించిన మీడియా, 2014 నుంచే ఆయన మీద ఒక కన్నేసి ఉంచింది. మూడేళ్లనాడు ఒక షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవానికి ఆయన విజయవాడ వచ్చారు. అప్పుడు పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ కీలకవేళ రాజ్యసభకు హాజరుకావడానికి సమయం లేని ఆయన, ఇతర కార్యక్రమాలకు మాత్రం ఎలా హాజరవుతున్నారని మీడియా ప్రశ్నించింది. ‘నన్నే ప్రశ్నిస్తారా’ అంటూ ఆనాడు మీడియా మీద తెందూల్కర్‌ విరుచుకుపడ్డారు. ప్రతీ విషయం మీద ఏదో ఒకటి చెప్పడం మీడియాకు అలవాటైందంటూ ఒక సందర్భంలో ఆయన అసహనం వ్యక్తపరచారు. ఆహా ఓహో అని పొగిడినప్పుడు సచిన్‌కు మీడియా మంచిదనిపించింది. సభకు ఎందుకు హాజరుకావడంలేదని ప్రశ్నిస్తే మాత్రం అది చెడ్డదైపోయిందా? ఆయన ఒక కీలకమైన విషయాన్ని గమనించడం లేదు. రాజ్యాంగంలోని 80(1) (ఎ) అధికరణ ప్రకారం రాష్ట్రపతి 12 మందిని రాజ్యసభ సభ్యులుగా నియమించవచ్చు. సాహిత్యం, విజ్ఞానశాస్త్రం, కళలు, సామాజిక సేవారంగాల్లో ప్రత్యేక పరిజ్ఞానం లేదా విశేష అనుభవం కలిగి ఉన్న వ్యక్తుల్నే ఆ విధంగా రాజ్యసభకు నియమించాలని 80(3) అధికరణ స్పష్టం చేస్తోంది. అందులో క్రీడాకారుణ్ని నియమించవచ్చునని ఎక్కడా లేదు. అయినప్పటికీ ఆ నిబంధనను సడలించి సచిన్‌ను నియమించారు. క్రికెట్‌లో ఉన్నతస్థాయికి చేరి, అసంఖ్యాకుల విశేష అభిమానం చూరగొన్న సచిన్‌కు ఇదివరకటి యూపీఏ ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న ప్రదానం చేయడమే కాకుండా, రాజ్యసభకూ నియమించడం వెనక ఒక ప్రత్యేక కారణం ఉంది. దీనివల్ల 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తన ప్రతిష్ఠ పెరుగుతుందని, అది ఎంతో కొంత సానుకూల ప్రభావం చూపుతుందని ఆనాడు కాంగ్రెస్‌పార్టీ భావించింది. తనను రాజ్యసభకు నియమించాక కాంగ్రెస్‌ అధినాయకురాలు సోనియా గాంధీని కలిసి కృతజ్ఞతలు తెలిపిన సచిన్‌- ఎల్‌.కె.అడ్వాణీ, ప్రకాశ్‌ కారాట్‌, చంద్రబాబునాయుడు, నితీశ్‌కుమార్‌, మాయావతి వంటి వారిని అసలు పట్టించుకోలేదు. రాజ్యసభకు నియామకం కావడమంటే ట్రోఫీ తీసుకొని ఇంటికిపోవడం కాదని, 130 కోట్ల ప్రజానీకం పట్ల బాధ్యతతో వ్యవహరించడమన్న జావెద్‌ అఖ్తర్‌ మాటల్లో ఎంతైనా నిజం ఉంది. ఆయనా అలా రాజ్యసభకు నియుక్తులైనవారే. కానీ, స్వీయబాధ్యతను ఏనాడూ విస్మరించలేదు. ‘భారతరత్న’ సచిన్‌ తెందూల్కర్‌ పార్లమెంటు ఎగువసభ పట్ల ఇలా అమర్యాదకరంగా వ్యవహరించడం సరికాదు. ఒక్క సచిన్‌, రేఖ అనే కాదు- రాజ్యసభకు నియుక్తులైన సభ్యులెవరూ ఆ అత్యున్నత సభ పట్లా, దేశ ప్రజానీకం పట్లా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగనిపని. ఇక మీదట ఏ విధంగా ముందుకెళ్లాలన్నదానిపై నిర్ణయం తీసుకోవలసింది వారే!

-ఎ సూర్యప్రకాష్, రచయిత, ప్రసార భారతి చైర్మన్

(ఈనాడు సౌజన్యం తో)