Home Telugu Articles శ్యామాప్రసాద్ ముఖర్జీ స్వదేశీ విద్యావిధానం.. `ఆత్మ నిర్భర భారత్’కు చక్కని మార్గం

శ్యామాప్రసాద్ ముఖర్జీ స్వదేశీ విద్యావిధానం.. `ఆత్మ నిర్భర భారత్’కు చక్కని మార్గం

0
SHARE

— చంద్రమౌళి కళ్యాణ చక్రవర్తి

“కూర్చున్న కొమ్మను నరుక్కొని మరీ మనం విజ్ఞానాన్ని దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు, మన దేశానికి అత్యవసరం విజ్ఞతతో కూడిన స్వదేశీ, విదేశీ విద్యావిధానాల మేలు కలయిక”

–  డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ                                

భారతదేశంలో జాతీయవాద ఆలోచనలు నిండిన దార్శనికుల మొదటి వరుసలో ఉండే నాయకుడు డాక్టర్  శ్యామాప్రసాద్ ముఖర్జీ ( 1901 -1953 ). ఆధునిక విజ్ఞానం విషయంలో ఆయనకు ఎటువంటి అపోహలు, దురభిప్రాయాలు లేవు. అయితే “కొత్త ఒక వింత పాత ఒక రోత” అంటే మాత్రం ఒప్పుకునే వారు కాదు . స్వదేశీ విజ్ఞానాన్ని పూర్తిగా వదిలేసి విదేశీ జ్ఞానమే గొప్ప అనుకునే మూర్ఖత్వాన్ని మాత్రం సహించే వారు కాదు .

27 నవంబర్ 1937 న పాట్నా విశ్వవిద్యాలయపు స్నాతకోత్సవ ఉపన్యాసంలో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఇలా అన్నారు “ భారతదేశంలో విద్య, గత శతాబ్దకాలంగా మనది కాని భాషలో బోధించబడుతోంది . ఇలా జరగడం వల్ల మనం కోల్పోయినది ఏమిటీ అంటే అమ్మ భాషలో విద్య నేర్చుకోలేకపోవటం. ఆంగ్ల భాషామాధ్యమంలో విద్యాధికులైన కొందరు ఈ మాటకు నన్ను గేలి చేస్తున్నారు, పైగా ఈ విద్యావిధానాన్ని మార్చడం అసాధ్యం అంటూ నిర్ణయించేస్తున్నారు. నేనేమీ మూడత్వంతో, మాతృభాషపై గుడ్డి ప్రేమతో ఇలా కోరుకోవటం లేదు . అమ్మ ఒడిలో నేర్చుకునే విధానం మనస్సుకు దగ్గరగా, సులభంగా అర్ధమయ్యే పద్దతిలో ఉంటుందన్న గట్టి నమ్మకంతో చెబుతున్నాను. ఇది సహజంగా, పుట్టుకతో ఎవరికైనా నప్పే విధానం. ఇలాంటి విద్యావిధానం వల్ల ఆత్మవిశ్వాసం పెరిగి జాతీయ ఆలోచనా ధోరణి అలవడుతుంది.“

ఇరవై మూడేళ్ళ యువప్రాయంలో  కలకత్తా యూనివర్సిటీ ఫెలోగా ఎన్నుకోబడిన విద్యావేత్త డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ. ఆంగ్ల భాషలో మంచి ప్రావీణ్యత కలిగి  BA ఆనర్స్ మొదటి శ్రేణిలో(FIRSTINFIRSTCLASS) ఉత్తీర్ణులైనా  మాతృభాష ప్రాముఖ్యతను గుర్తించి ‘బెంగాలీ భాష, సాహిత్యం‘ అనే అంశంపై MA పట్టా సాధించడం గమనార్హం. దాదాపు రెండు దశాబ్దాలపాటు విద్యావ్యవస్థ ప్రక్షాళనకై ప్రయత్నించడమేకాకుండా, చాలావరకు అనుకున్నది  సాధించడం ఆయన ప్రత్యేకత. ‘1924 మే 25 నా జీవితాన్ని మలుపు తిప్పిన రోజు. ఆ రోజు మొదలు నేటి వరకు నా ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉన్నాను ‘ అంటూ ఆయన తన ఆత్మకధలో రాసుకొన్నారు కూడా.

ఆయన విద్యావేత్తగా అలంకరించిన పదవులు ఒక్కసారి గమనిస్తే డార్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గొప్పతనం మనకి అర్ధం అవుతుంది. కలకత్తా విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ,  ప్రెసిడెంట్ పోస్ట్-గ్రాడ్యుయేట్ కౌన్సిల్స్ ఇన్ ఆర్ట్స్ , సైన్స్ ( 1934-38 ) డీన్ అఫ్ ఫాకల్టీ అఫ్ ఆర్ట్స్ ( 1934-1938 ) చైర్మన్ ఇంటర్ యూనివర్సిటీ బోర్డు ( 1934-38 ) మెంబర్ అఫ్ కోర్ట్ అండ్ కౌన్సిల్ అఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్సు బెంగుళూరు (1935 )గా ఆయన వివిధ బాధ్యతలు నిర్వహించారు.

అయన కేవలం ఆలోచనల మనిషి కాదు. వాటిని ఆచరించే మనిషి. నాలుగు సంవత్సరాల ఉపకులపతి పదవిలో ఆయన ప్రవేశపెట్టిన అనేక సంస్కరణలు, నూతన విభాగాలు, విధానాలు, విలువలు నేటికీ ప్రామాణికాలే. తెల్ల దొరలు రాజ్యమేలుతున్న కాలంలో ఆంగ్లానికి మాత్రమే ప్రాముఖ్యత లభించిన సమయంలో ప్రాంతీయ భాషలను ప్రోత్సహించిన ఏకైక వ్యక్తి డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ. ప్రాధమిక. మాధ్యమిక విద్యాలయాలలో ప్రాంతీయ భాష మాధ్యమాన్ని ప్రోత్సహించి తదనుగుణంగా నిబంధనలలో మార్పులు చేయించి మెట్రిక్యులేషన్ పరీక్షను విద్యార్ధులు తమ మాతృభాషలో వ్రాసే అవకాశం కల్పించారు. నిబంధనలు మారిస్తే సరిపోదు. వాటిని అమలుచేయాలి. అందుకనే ఈ నిబంధనలతోపాటు విద్యార్ధులకి అవసరమైన ‘ బెంగాలీ’ భాషలో ముద్రించిన పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి తేవడం కోసం అవసరమయ్యే ‘బెంగాలీ శాస్త్రీయపదకోశం‘ కూడా తయారుచేయించారు ( దార్శనికుని దృష్టి అంత సునిశితంగా ఉంటుంది )

డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ కృషి వల్లనే సైన్సు పాఠ్యాంశాలు మాధ్యమిక విద్యలో చోటు సాధించాయి. లేకపోతే ఇప్పటికీ మన విద్యా వ్యవస్థ `గుమాస్తాల తయారీ’ కి మాత్రమే ఉపయోగపడే స్థాయిలోలోనే ఉండేది. పాఠశాల స్థాయిలోనే తరగతి బోధనతోపాటు ప్రయోగశాల ద్వారా బోధన జరపాలని కాంక్షించిన విద్యావేత్త ఆయన. కలకత్తా విశ్వవిద్యాలయంలో సైన్సు విభాగాలన్నీ డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ కృషి ఫలితమే. విదేశీ విజ్ఞానాన్ని అందుకునేందుకు పాశ్చాత్య విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు కుడుర్చుకోవటం, విద్యార్ధుల మార్పిడి (student exchange programme) కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఆయన హయాములోనే మొదలైంది . వైద్య విద్య, సాంకేతిక విద్య రంగాలను పూర్తిగా ఆధునీకరించిన ఘనత డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీదే.

విద్య సామాన్యప్రజానీకానికి పూర్తిగా అందుబాటులో ఉండాలని కోరుకునేవారు. ప్రాధమిక. మాధ్యమిక స్థాయిలో విద్య పూర్తిగా ఉచితంగా అందించాలని ఆయన ఆరాటపడేవారు. ఆర్ధికంగా బలహీన వర్గాలకు ఫీజులు తగ్గించడం మొదలైంది ఈయన హయాములోనే. విద్యార్థి అభివృద్దికి అన్ని రంగాలలో ప్రవేశం, అభినివేశం ఉండాలి అని నమ్మిన విద్యావేత్త ఆయన. కలకత్తా విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవం అత్యంత కోలాహలంగా, ఉత్సాహంగా జరిపించేవారు.  ఆటల పోటీలు, సాహిత్య పోటీలు, సాంస్కృతిక పోటీలతో ఒక పండుగలా జరిపించేవారు. ఇప్పటికీ కలకత్తా విశ్వవిద్యాలయంలో ఈ వ్యవస్థాపక దినోత్సవం కొనసాగుతోంది.

విద్యావిధానం  వృత్తి ప్రధానంగా సాగాలనీ అందుకే ఉపాది ప్రాధాన్యత కలిగే చదువులకు ఎక్కువ విలువ ఉంటుందని డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ నమ్మారు. అందుకే పారిశ్రామిక వర్గాలను సంప్రదించి విద్యావిధానాన్ని రూపొందించుకోవాలని ఆయన సూచించారు. పరిశ్రమ వర్గాల అనుబంధ శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేసేవారు.  కలకత్తా విశ్వవిద్యాలయంలో మొదటి ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజిని ప్రారంభించిన ఘనత ఆయనదే. అనాదిగా వ్యవసాయం భారతదేశపు ప్రధాన వృత్తి, ఇది అందరికి తెలిసిన విషయమే. అయితే వ్యవసాయాన్ని ఒక విద్యావిషయంగా గుర్తించి, వ్యవసాయ డిప్లొమా విద్యను ప్రవేశపెట్టినది ఈ దార్శనికుడే. ఇప్పుడు ఎన్నో విశ్వవిద్యాలయాలు వ్యవసాయ ప్రధాన డిగ్రీలు ఇస్తున్నాయి .

ఇక స్వదేశీవిద్యతోపాటు దేశభక్తి, క్రమశిక్షణ కూడా విద్యార్ధులకు అలవాడటం చాలా అవసరమని ఆయన గుర్తించారు. అందుకనే  యూనివర్సిటీ కాడేట్ కోర్ (University Cadet Corps) అనే వ్యవస్థ ద్వారా విద్యార్ధుల సైనిక శిక్షణా కార్యక్రమం మొదలుపెట్టడానికి చాలా కృషి చేశారు (అది విదేశీయుల పాలనకాలం అని గుర్తించుకోవాలి). విద్యార్ధుల సంక్షేమం ప్రధాన ధ్యేయంగా ‘విద్యార్థి సంక్షేమ విభాగాన్ని‘  ప్రారంభించింది బహుశా అఖండ భారతదేశం లో కలకత్తా విశ్వవిద్యాలయమే,

విద్యావ్యవస్థలో సరైన ఉపాధ్యాయులు కూడా చాలా ముఖ్యం. ఎటువంటి విద్యా ప్రణాళిక అయినా ఉపాద్యాయులే నిర్వహించాలి. అటువంటప్పుడు ఉపాధ్యాయుల శిక్షణ తరచుగా జరగాలి . ఈ విషయంలో కూడా విశేష కృషి చేశారు. ఉపాధ్యాయ శిక్షణా విభాగాన్ని ఏర్పాటు చెయ్యటం, ఉపాధ్యాయశిక్షణా తరగతులు నిర్వహింపజేయటం, ఉపాధ్యాయ వృత్తిశిక్షణా విద్యాలయాలను స్తాపింపజేయించడం, ఉపాధ్యాయుల కోసం స్వల్పకాలిక శిక్షణాకార్యక్రమాలు ఏర్పాటుచేయటం,  పారిభాషిక పదకొశములను తయారు చేయించడం ఇలా అన్ని వైపులా నుంచీ ఉపాధ్యాయుల్ని సుశిక్షితులను చేసేందుకు ఆయన చర్యలు చేపట్టారు.

పరిశోధనా రంగం విద్యాభివృద్దికి , దేశాభివ్రృద్దికి అతి ముఖ్యమైన , వ్యూహత్మకమైన అంశం. ఈ విషయం లో కూడా డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ కృషి అనితర సాధ్యం . భావితరాలను దృష్టిలో ఉంచుకుని వీరు చేసిన కృషి అపూర్వం. ఆయన వ్యక్తిగతంగా ప్రత్యేక పరిశోధన ఏదీ చెయ్యనప్పటికీ, అనేక పరిశోధనా సంస్థలు ప్రారంభం కావటానికి ఆయన దార్శనికత కారణమైంది. స్వతంత్ర భారతదేశంలో నెహ్రు మంత్రివర్గంలో సభ్యుడిగా, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు  ‘కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్‘ సంస్థకు మొదటి అధ్యక్షుడిగా దాదాపు నలభై జాతీయ పరిశోధన ప్రయోగశాలల ఏర్పాటుకు ప్రణాళికలు తయారు చేశారు. భారతప్రభుత్వ కేంద్రీయ పరిశోధక నియంత్రణా కేంద్రం ( CSIR) అధ్యక్షుడు ప్రొఫెసర్ ఆర్ ఏ మషేల్కర్ మాటలలో “ డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ అంత గట్టి పునాది వేశారు కాబట్టే ఈ సంస్థ పరిశోధనరంగంలో మంచి పేరు కలిగిన భారతీయ  సంస్థగా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది .  జాతీయ భౌతిక శాస్త్ర ప్రయోగశాల, కేంద్రీయ గాజు మరియు పింగాణి పరిశోధక సంస్థ , సాహా అణుభౌతిక పరిశోధక సంస్థ ఇలా అనేక సంస్థలు ఏర్పాటయ్యాయి.“

డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ లాంటి గొప్ప దార్శనికత కలిగిన గొప్ప జాతీయవాద విద్యావేత్తను స్వతంత్ర భారతం పూర్తిగా ఉపయోగించుకోలేకపోయిందన్నది నిర్వివాదాంశం.  ఇప్పటికైనా `ఆత్మనిర్భర భారత్’ నిర్మాణంలో వారు చూపిన మార్గాన్ని అనుసరించడం ఎంతైనా అవసరం.

References:

http://www.shyamaprasad.org/biography.htm

http://hdl.handle.net/10603/184412