Home News ఇస్లాం స్వీకరించడానికి వ్యతిరేకించిన హిందూవులను హతమార్చిన ముస్లిం రోహింగ్యాలు

ఇస్లాం స్వీకరించడానికి వ్యతిరేకించిన హిందూవులను హతమార్చిన ముస్లిం రోహింగ్యాలు

0
SHARE
  • 92 మందిని చంపేసిన ముస్లిం తీవ్రవాదులు.. మయన్మార్‌లోని రఖైన్‌లో దారుణం
  • 300 మంది రోహింగ్యాల కిడ్నాప్‌
  • వారిలో హిందువులే లక్ష్యంగా హత్యాకాండ
  • బంగ్లాలో హిందూ రోహింగ్యాల మత మార్పిడి
  • ఇస్లాం స్వీకరించకుంటే చంపేస్తామని హెచ్చరిక
  • కళ్లముందే కుటుంబీకుల కాల్చివేత

ఒకరిని కాదు ఇద్దరిని కాదు 300 మంది రోహింగ్యాలను కిడ్నాప్‌ చేశారు. వారిలో 100 మంది హిందూ రోహింగ్యాలను గుర్తించి 92 మందిని దారుణంగా ఊచకోత కోశారు. మిగిలిన 8 మంది మహిళలను బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చి బంగ్లాదేశ్‌ తీసుకెళ్లారు. మయన్మార్‌లోని రఖైన్‌ ప్రాంతంతో ఈ దారుణం చోటుచేసుకుంది. ఆర్కాన్‌ రోహింగ్యా సాల్వేషన్‌ ఆర్మీ(ఏఆర్‌ఎ్‌సఏ) పేరుతో ముస్లిం రోహింగ్యాలు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఏడాది ఆగస్టు 25న చోటుచేసుకున్న ఘటన నెల రోజుల ఆలస్యంగా వెలుగుచూసింది.

 ఈ దారుణాన్ని మయన్మార్‌ స్టేట్‌ కౌన్సిలర్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ మంగళవారం అధికారికంగా వెల్లడించారు. మయన్మార్‌లోని ఉత్తర రఖైన్‌ ప్రాంతంలో మయన్మార్‌ సైన్యం తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ గ్రామం వెలుపల ఓ పెద్ద గొయ్యిలో 28 మంది హిందూ రోహింగ్యాల మృతదేహాలను గుర్తించారు. ఈ ఊచకోత ముస్లిం రోహింగ్యా తీవ్రవాదుల పనేనని మయన్మార్‌ సైన్యం ప్రకటించింది. ఈ ప్రకటనకు బలం చేకూర్చేలా బంగ్లాదేశ్‌, భారత్‌లో తలదాచుకుంటున్న పలువురు హిందూ రోహింగ్యా శరణార్థులు.. ముస్లిం రోహింగ్యా తీవ్రవాదులు అరాచకాలను మీడియాకు వెల్లడించారు. ‘రోహింగ్యా తీవ్రవాదులు కత్తులు, తుపాకులతో మాపై దాడి చేశారు.

మా ఇళ్లను, పొలాలను తగులబెట్టారు’ అని బంగ్లాదేశ్‌లోతలదాచుకుంటున్న ఓ హిందూ రోహింగ్యా వెల్లడించారు. మరోవైపు బంగ్లాదేశ్‌లోనూ హిందూ రోహింగ్యాలపై దాడులు జరుగుతున్నాయి. సుమారు 4.5 లక్షల మంది రోహింగ్యాలు ప్రాణాలు అరచేత పట్టుకుని మయన్మార్‌ నుంచి బంగ్లాదేశ్‌కు వలస వచ్చారు. వీరిపై ముసుగులు ధరించిన కొందరు అగంతకులు దాడులకు పాల్పడుతున్నారు. ఇస్లాం మతం స్వీకరించాలంటూ అత్యంత పైశాచికంగా వ్యవహరిస్తున్నారని రబియా (అసలుపేరు పూజా) అనే ఓ బాధితురాలు మీడియా ముందు వాపోయారు. ‘‘కళ్ల ముందే నా భర్తతో సహా మా వాళ్లందరినీ కాల్చి చంపేశారు. నన్ను మాత్రం బందీగా ఉంచి… నా బొట్టు తుడిపేశారు. నా మనసు భగవాన్‌ను పరితపిస్తున్నా… గత్యంతర లేక ఖురాన్‌ను చదవాల్సి వస్తోంది’ అని తన పరిస్థితిని వివరించారు. ఈ ఘటనలు తమ దృష్టికి రాలేదని, అవి నిజమే అయితే చర్య లు తీసుకుంటామని బంగ్లాదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది.

ఐరాసలో వెల్లువెత్తిన నిరసనలు

మయన్మార్‌లో జాతి శుద్ధీకరణ పేరుతో రోహింగ్యా తెగనే అంతమొందించాలని ప్రభుత్వం చూస్తోందని పలు దేశాలు ఐరాస సర్వసభ్య సమావేశంలో ఆరోపించాయి. కాగా, అవన్నీ నిరాధారమని మయన్మార్‌ రాయబారి ఖండించారు. ఈ నేపథ్యంలో ఐరాస భద్రతా మండలి గురువారం ప్రత్యేకంగా సమావేశం కానుంది. కాగా, ఎంపీ వరుణ్‌ గాంధీ రోహింగ్యాలపై పార్టీ విధానానికి వ్యతిరేకంగా గళం విప్పారు. వారికి దేశంలో ఆశ్రయం కల్పించాలని ఆయన కోరారు.

(ఆంధ్రజ్యోతి సౌజన్యం తో)