Home Telugu Articles నిరుద్యోగ సమస్య గురించిన నిజానిజాలు

నిరుద్యోగ సమస్య గురించిన నిజానిజాలు

0
SHARE

– ఉత్తమ్ గుప్తా

సర్వత్ర ప్రచారం జరుగుతున్నట్లుగా ఉపాధి కల్పనలో మోదీ ప్రభుత్వం విఫలం కాలేదు. స్వయంఉపాధి అనే ఆలోచన మనకు కొత్తకావడమే ఈ అపోహలకు కారణమవుతోంది.

ఏడాదికి 2కోట్ల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న హామీని నిలబెట్టుకోవడంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నది ఆరోపణ. తమ ఆరోపణను ఋజువు చేసుకునేందుకు విమర్శకులు ప్రభుత్వ కార్యాలయాల్లో గుమాస్తా లేదా అటెండర్ ఉద్యోగానికి కూడా వస్తున్న వందలు, వేల దరఖాస్తులను చూపిస్తున్నారు. ఒకపక్క పట్టభద్రుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంటే ఉద్యోగావకాశాలు తరుగుతున్నాయన్నది వారి ఆరోపణ. ఇది దేశంలో పెచ్చుమీరిపోయిన నిరుద్యోగ సమస్యకు తార్కాణమని వాదిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలు చేస్తున్నవారు ప్రభుత్వోద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేవారంతా ఎలాంటి జీవనోపాధి లేనివారేనన్న లెక్కలో మాట్లాడుతున్నారని ఇక్కడ గ్రహించాలి. కానీ వారనుకుంటున్నది నిజమా? కానేకాదు. ఇన్ని లక్షలమంది ఎలాంటి జీవనోపాధి లేకుండా ఉండి ఉంటే ఈపాటికి దేశంలో అరాచకత్వం ప్రబలేది.

యదార్ధం ఏమిటంటే ఇన్ని లక్షల మంది `నిరుద్యోగుల’కు వ్యవసాయం, పశుపోషణ, కమ్మరం, కుమ్మరం, తోటపని, కూరగాయల విక్రయం మొదలైన అనేక `అనియత’ మార్గాల్లో ఆదాయం లభిస్తోంది. అయితే ఈ పనులన్నింటిని సమాజంలో `గౌరవప్రదమైనవి’గా చూడడం లేదు. ప్రభుత్వ కార్యాలయంలో అటెండర్ ఉద్యోగమైనా అదే గౌరవప్రదమైనదని భావిస్తున్నారు. అలాంటి ఉద్యోగం ఒకసారి సంపాదిస్తే ఇక జీవితాంతం సుఖంగా ఉండవచ్చని, నెలనెలా జీతం, అదనపు సదుపాయాలు, ఉద్యోగ భద్రత ఉంటాయని అందరూ ఆ ఉద్యోగాలనే ఆశిస్తున్నారు. కానీ ఉన్న ఉద్యోగాలు తక్కువ, వాటిని ఆశించేవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. దీనివల్ల ఏదో ఒక ఉపాధి, దాని నుంచి ఆదాయం ఉన్నా అధికశాతం యువత `నిరుద్యోగులు’గానే మిగులుతున్నారు.

నిజానికి ఆదాయం వచ్చే ఉపాధి మార్గాలు లేకపోవడం సమస్య కాదు. సమస్య ప్రజల ఆలోచన ధోరణిలో, యువత కోరుకుంటున్న ఉపాధి మార్గంలో ఉంది. ప్రభుత్వోద్యోగాలు కాకుండా ఇతర ఉపాధి మార్గాల పట్ల సమాజంలో ఆసక్తి, సకారాత్మక దృష్టి పెరిగితే అప్పుడు ఉన్న ఉద్యోగాలకు, వాటిని ఆశించేవారికి మధ్య పొంతన కుదురుతుంది. అదే సమస్యకు పరిష్కారం.

ప్రధాని మోదీ సరిగ్గా ఇలాంటి మార్పు తేవడానికే ప్రయత్నిస్తున్నారు. చిన్న వృత్తుల పట్ల ప్రజలలో ఆదరం, గౌరవభావం కలిగించడం కోసం వాటి గురించి తన ఉపన్యాసాల్లో, ఇంటర్వ్యూల్లో తరుచూ ప్రస్తావిస్తుంటారు. మన్ కి బాత్ వంటి రేడియో కార్యక్రమాలలో మాట్లాడుతుంటారు. మోదీ హామీ ఇచ్చిన 2 కోట్ల ఉద్యోగాలంటే ఇవీ. ఒక వ్యక్తి తనంత తానుగా ఒక వ్యాపారం లేదా ఉపాధిని ప్రారంభించుకోవడమేకాక మరి కొందరికి ఉపాధి చూపించగలగాలన్నది ఆయన ఆలోచన. 2015లో ప్రారంభించిన ప్రధానమంత్రి ముద్రా యోజన ఉపాధి కల్పనలో విజయవంతమయింది. ఈ పధకం కింద చిరు వ్యాపారులకు ఋణసదుపాయం అందుతోంది. ఇది శిశు, కిషోర్, తరుణ్ అనే మూడు స్థాయిల్లో అందుతోంది. శిశు తరహా వ్యాపారాలకు రూ. 50,000, కిషోర్ కు రూ. 5 లక్షలు, తరుణ్ తరహా వ్యాపారాలకు 10 లక్షల ఋణం అందిస్తున్నారు. ఈ ఋణాలన్నీ ఎలాంటి పూచీకత్తు కోరకుండానే ఇస్తున్నారు. ఇప్పటివరకు 12 కోట్ల మందికి 6లక్షల కోట్ల ఋణాలు అందించారు. ఇందులో 75 శాతం ఋణాలు మహిళలకు ఇచ్చారు. తీసుకున్న ఋణాన్ని సక్రమంగా ఉపయోగించుకోవడం, తిరిగి చెల్లించడంలో మహిళలు ముందున్నారు కూడా. ఈ పధకం కింద ఇచ్చిన ఋణాల్లో మొండి బాకీలు 3.4శాతానికి మించి లేవు. సాధారణంగా ఇలాంటి ఋణ మంజూరు పధకాల్లో 10 శాతం వరకు మొండిబాకీలు ఉండవచ్చని లెక్కవేస్తారు.

ఋణాలు తీసుకున్నవారిలో 3 కోట్లమంది కొత్తగా వ్యాపారాలు ప్రారంభించారు. ఇలాంటివారు కనీసం ఒకరికి ఉపాధి చూపించారనుకున్నా 6కోట్ల ఉద్యోగాలు లభించి ఉంటాయి. ఇక మిగిలిన 9 కోట్లమంది అప్పటికే తమకున్న వ్యాపారాల కోసం ఋణాలు తీసుకున్నవారు. వీరిలో మూడువంతులమంది మాత్రమే కేవలం ఒకరికి ఉపాధి కల్పించారని అంచనా వేసినా అలాంటివి మరో 3 కోట్ల ఉద్యోగాలు అవుతాయి. మొత్తం 9 కోట్ల ఉద్యోగాలు కొత్తగా వచ్చాయన్నమాట.

ఇలా స్వయంఉపాధి కూడా ఉద్యోగమేనని భావిస్తే అప్పుడు  ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు, నాలుగేళ్లలో 8కోట్ల ఉద్యోగాలు అనే మోదీ హామీ నెరవేరిందని స్పష్టమవుతుంది. ఇదికాక గత నాలుగేళ్లలో స్థూల దేశీయోత్పత్తిలో వృద్ది బాగా నమోదైంది. 2014-15 సంవత్సరానికి గాను 7.4 శాతం నమోదైన జీడీపీ 2015-2016లో 8.2శాతం, 2016-2017లో 7.1శాతం, 2017-2018నాటికి 6.7శాతంగా నమోదైంది. గత రెండేళ్లలో పెద్దనోట్ల రద్దు, జి ఎస్ టి అమలు వంటి కీలకమైన నిర్ణయాల అమలు జరిగిందన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి అభివృద్ధి ప్రజలు పనిచేయకపోతే, నిరుద్యోగులై తిరుగుతుంటే సాధ్యంకాదని సాధారణ వ్యక్తికి కూడా తెలుస్తుంది.

2014 నుంచి ప్రభుత్వం హైవేలు, రోడ్లు, రైళ్లు, ఎక్స్ ప్రెస్ వేలు, పోర్ట్ లు, పాఠశాలలు, ఆస్పత్రులు, ఇళ్ళు, శౌచాలయాలు మొదలైన భౌతిక, సామాజిక మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యతనిచ్చింది. నిధులు ఖర్చు చేసింది. వ్యాపార సంస్థల నిబంధనలను సరళీకరించడం ద్వారా ప్రైవేటు పెట్టుబడులను పెంచేందుకు చర్యలు తీసుకుంది. వీటన్నిటివల్ల కూడా ఉపాధి అవకాశాలు వచ్చాయి.

భవిష్యనిధి సంస్థ(ప్రావిడెంట్ ఫండ్) సమాచారం ప్రకారం గత రెండేళ్లలో 11.5 మిలియన్ ఉద్యోగాలు అదనంగా (2016-17లో 4.5మిలియన్, 2017-18లో 7 మిలియన్) వచ్చాయని తెలుస్తోంది. అయితే అనియత, స్వయంఉపాధి రంగంతో పోలిస్తే ఇది తక్కువైనప్పటికి చెప్పుకోదగిన అభివృద్దే. ఇదే వేగం కొనసాగితే రాబోయే కాలంలో మరిన్ని ఉద్యోగాలు వస్తాయి. కానీ ఈ విషయాలను పట్టించుకోకుండా, పకోడీలు అమ్ముకోవడం కూడా స్వయం ఉపాధేనా అంటూ వేళాకోళం చేయడంవల్ల ప్రయోజనం ఏమి ఉండదు.

పైగా ఇలా అవహేళన చేయడం వల్ల యువత స్వయం ఉపాధి వైపుకు వెళ్లకుండా అంతా ప్రభుత్వోద్యోగాలు, `గౌరవప్రదమైన’ ఉద్యోగాలనే ఆశించే ప్రమాదం ఉంది. ఆర్ధిక వ్యవస్థ రెండంకెల అభివృద్ది రేటును నమోదు చేస్తున్నప్పటికి ఇంత మందికి ఇలాంటి ఉద్యోగాలు కల్పించడం అసాధ్యం. అంతేకాదు దేశంలో మూడింట రెండువంతుల మంది 18-35 మధ్య వయస్సు కలిగినవారు కనుక మనకు `జనాభా పరమైన ప్రయోజనం’ చేకూరుతుందని భావిస్తున్నా, ఇలాంటి ధోరణుల వల్ల ఆ ప్రయోజనం కాస్తా `భారంగా’, `నష్టంగా’ మారే ప్రమాదం ఉంది.

అది తప్పించాలంటే మోదీ ప్రభుత్వానికి మద్దతునివ్వాలి.

ది పయోనీర్ సౌజన్యంతో..

అనువాదం: విశ్వసంవాద కేంద్ర, తెలంగాణ