జాతీయ విద్యా విధానం సర్వదా అనుసరణీయం జాతీయ విద్యా విధానం లో ఎన్నెన్నో సుగుణాలు ఉన్నాయని వక్తలు అభిప్రాయ పడ్డారు. జాతీయ విద్యా విధానం మీద హైదరాబాద్ బండ్లగూడ జాగీర్ లోని శారదా ధామంలో కార్యశాల (వర్క్ షాపు ) నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన విద్యా భారతి దక్షిణ మధ్య క్షేత్రం అధ్యక్షులు డాక్టర్ చామర్తి ఉమా మహేశ్వరరావు ఐ ఎ ఎస్ (రిటైర్డ్) ఈ విధానం ఆవశ్యకత ను వివరించారు. ప్రస్తుత విధానంలోని లోపాలను ఉదహరిస్తూ…రాగల కాలంలో వీటికి పరిష్కారాలు దొరకుతాయని అభిలషించారు. కార్యక్రమంలో శ్రీ సరస్వతీ విద్యా పీఠం ప్రాంత అధ్యక్షులు ప్రొఫెసర్ తిరుపతి రావు, విద్యావేత్త డాక్టర్ ఉపేందర్ రెడ్డి మార్గ నిర్దేశనం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన రిసోర్స్ పర్సన్ లు హాజరు అయ్యారు.
ఈ కార్యశాలలో భాగంగా జాతీయ విద్యా విధానం మీద సమగ్ర అవగాహన దిశగా ప్రసంగాలు ఏర్పాటు అయ్యాయి. విద్యా భారతి దక్షిణమధ్య క్షేత్ర కార్యదర్శి ఆయాచితుల లక్ష్మణరావు, క్షేత్ర శైక్షణిక్ ప్రముఖ్ రావుల సూర్యనారాయణ, ఉన్నత విద్యా సంయోజక్ డాక్టర్ మురళీ మనోహర్ రావు తదితరులు నిర్మాణాత్మకంగా ప్రసంగాలు చేశారు. జాతీయ విద్యా విధానం గొప్పతనాన్ని ఉదాహరణలతో సహా విడమరిచి చెప్పారు. కార్యశాల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యా భారతి దక్షిణ మధ్య క్షేత్రం సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి విచ్చేశారు. జాతీయ విద్యా విధానం ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన అభిలషించారు.