Home News ఉత్తరప్రదేశ్‌ లో మహిళల సారథ్యంలో నడుస్తున్న పత్రిక

ఉత్తరప్రదేశ్‌ లో మహిళల సారథ్యంలో నడుస్తున్న పత్రిక

0
SHARE

అదో పత్రిక. పేరు ఖబర్‌ లెహరియా. దేశంలోనే మహిళల సారథ్యంలో నడుస్తున్న డిజిటల్‌ మీడియా ఏజన్సీ. ఇందులో పనిచేసేవారంతా నిరుపేద మహిళలే. చాలామంది నిరక్షరాస్యులుగా చేరి, అక్షరాస్యులైన వారే ఎక్కువ. మహిళల జీవనవిధానం, స్థితిగతులూ, ఆరోగ్యం వంటి అంశాలకు ఇందులో ప్రాధాన్యం ఎక్కువ. మొదట ఏడుగురు విలేకరులతో ప్రారంభమైన ఈ పత్రికలో ప్రస్తుతం 40 మంది ఉన్నారు. దీనికి ఉత్తరప్రదేశ్‌లో దాదాపు 400 గ్రామాల్లో 80 వేలమంది పాఠకులున్నారు.

ఖబర్‌లెహెరియా ప్రచురణ మొదట ఉత్తరప్రదేశ్‌ చిత్రకూట్‌లో 2002లో ప్రారంభమైంది. స్థానిక నిరుపేద మహిళలకు ఎడిటింగ్‌, మార్కెటింగ్‌, వార్తల సేకరణ వంటి విభాగాలన్నింటిలో శిక్షణనందిస్తారు. మహిళల సమస్యలతోపాటూ, స్ఫూర్తిని కలిగించే కథనాలూ, గ్రామీణ ప్రాంతాల మహిళల జీవితాల్లో మార్పు తేవడం ఈ వారపత్రిక ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం ఎనిమిది పేజీల్లో వస్తోన్న ఈ పత్రిక స్థానిక మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది.  ఆసక్తి ఉండే గ్రామీణమహిళలకు రెండు రోజులపాటు శిక్షణ ఇస్తారు. అలా శిక్షణ తీసుకునేవారిలో నిరక్షరాస్యులే కాదు, బాల్యవివాహ బాధితులూ, గృహహింస, అత్యాచారానికి గురైనవాళ్లూ, నిరుపేదలు ఉండటం గమనార్హం. వాళ్లకు వార్తల సేకరణా, రాసే విధానం, కథనాల ప్రత్యేకతను గుర్తించడం, ఇంటర్వ్యూలు చేసే విధానంలో శిక్షణ ఇస్తారు.     2003లో ఖబర్‌లెహెరియా పేరుతో వెబ్‌సైట్‌ కూడా ప్రారంభమైంది. స్థానిక కేబుల్‌టీవీలో వీరు చేసే ఇంటర్వ్యూలూ, అక్కడి సమస్యలు, మహిళల ఆరోగ్యం, ప్రభుత్వపథకాలు వంటి అంశాలు పలువురి ప్రశంసలను అందుకుంటోంది. అంతేకాదు, ‘బెస్ట్‌ ఆన్‌లైన్‌ యాక్టివిజమ్‌’ (ది బాబ్స్‌ ) పేరుతో ప్రత్యేక గ్లోబల్‌ మీడియా ఫోరం అవార్డును కూడా దక్కించుకుంది.

(ఈనాడు సౌజన్యం తో)