పౌరసత్వ సవరణ చట్టం (CAA )ద్వారా ఏ ఒక్క భారతీయుడు తమ పౌరసత్వాన్ని కోల్పోరని ప్రజ్ఞ భారతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరిధర్ మామిడి గారు పేర్కొన్నారు. CAA చట్టం 1955లో చేసిన పౌరసత్వ చట్టం సవరణ మాత్రమేనని పేర్కొన్నారు. దీనివల్ల ప్రస్తుత భారత దేశంలో నివాసముంటున్న ముస్లిం ఎవరు తమ పౌరసత్వాన్ని కోల్పోరని వారు ఆందోళన చెందవలసిన అవసరంలేదని తెలిపారు. సి.ఏ.ఏ పైన రాజకీయ పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తూ ముస్లిం వర్గాలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలలో అణచివేతకు గురైన ముస్లిమేతర వర్గాలు భారతదేశంలో గత 70 సంవత్సరాలుగా శరణార్ధులుగా ఉన్నారని వారికే సి.ఏ.ఏ చట్టం ప్రకారం భారతదేశం పౌరసత్వం ఇవ్వబోతుందని ఆయన తెలిపారు. ఎన్.ఆర్ సి పై ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. పౌరసత్వం సంబంధించిన చట్టాలను కొన్ని రాష్ట్రాలు తాము అమలు చేయబోమని చెబుతున్నాయని, అయితే అలా చెప్పే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని, పౌరసత్వ అంశం కేంద్ర జాబితా లోదని, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం చేసిన చట్టాలను అమలు చేయవలసిందేనని ఆయన తెలిపారు. సి.ఏ.ఏ చట్టం పట్ల ప్రజలందరూ అవగాహన ఏర్పరచుకొని సమాజాన్ని జాగృతం చేయాలని వారు తెలిపారు. డాక్టర్ మల్లేశం రిటైర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు బాల్ రెడ్డి, మనోహర్ రావు, రవి శంకర్ పటేల్, యు.రమేష్, విజయ్ పటేల్, కృష్ణ ముదిరాజ్, పుర ప్రముఖులు, ప్రజలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.