Home News ఇలాంటి తీర్పులు కదా కావాలి 

ఇలాంటి తీర్పులు కదా కావాలి 

0
SHARE
 • హిందూ వివాహవ్యవస్థ ఔన్నత్యాన్ని కొనియాడిన‌ అల‌హాబాద్ హైకోర్టు

  ఇటీవలి కాలంలో అలహాబాద్ హైకోర్ట్ నుంచి వెలువడుతున్న తీర్పులు ఆసక్తికరంగానే కాదు, ఆలోచింపజేస్తున్నాయి కూడా. సుమారు నెల రోజుల క్రితం లివ్ ఇన్ రిలేషన్ షిప్ గురించిన కేసులో తీర్పు ఇచ్చే సమయంలో.. హిందూ వివాహవ్యవస్థ ఔన్నత్యాన్ని ధర్మాసనం కొనియాడగా.. తాజాగా ఓ మహిళ రెండో పెళ్లి కేసులో కూడా అదే ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

  లివ్ ఇన్ రిలేషన్ అనేది.. భారతీయ వివాహ వ్యవస్థకు గుదిబండగా మారుతోందని.. అలహాబాద్ హైకోర్టు కొద్దిరోజుల క్రితం వ్యాఖ్యానించింది. సహజీవనం చేయడంతో తాను గర్భం దాల్చానని.. అయితే తనను పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకోవడం లేదంటూ.. భాగస్వామిపై మహిళ కేసు పెట్టింది. అలహాబాద్ హైకోర్టులో నిందితుడి బెయిల్ పిటిషన్ రాగా.. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. వివాహ వ్యవస్థ వ్యక్తికి అందించే భద్రత, సామాజిక ఆమోదం, స్థిరత్వం అని చెప్పింది. లివ్ ఇన్ రిలేషన్ లో ఇలాంటివేమీ ఉండవని స్పష్టం చేసింది. ప్రతిసారీ భాగస్వాములను మార్చడం అనే క్రూరమైన భావన.. స్థిరమైన, ఆరోగ్యకరమైన సమాజానికి ముఖ్య లక్షణంగా పరిగణింపబడదని.. వివరించింది.

  “మనదేశంలో వివాహ వ్యవస్థను పాతబడిందిగా భావిస్తూ లివ్-ఇన్-రిలేషన్‌షిప్ సాధారణమైనదిగా పరిగణిస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాలు అని పిలవబడే అనేక దేశాలలో వివాహ వ్యవస్థను రక్షించడం వారికి పెద్ద సమస్యగా మారింది. వివాహ బంధంపై భాగస్వామికి అవిశ్వాసం, సహజీవనంలో స్వేచ్ఛగా జీవించడం.. ప్రగతిశీల సమాజానికి చిహ్నాలుగా భావిస్తున్నారు. యువత అలాంటి ధోరణికి ఆకర్షితులతూ.. దీర్ఘకాలిక పరిణామాల గురించి పట్టించుకోవడం లేదు. భారతీయ వివాహ వ్యవస్థను నాశనం చేయడానికి ఇదో ఒక క్రమబద్ధమైన రూపకల్పన.” అని ధర్మసానం వ్యాఖ్యానించింది. తర్వాత నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది.

  తాజా కేసులో.. సాదాసీదాగా జరిగే పెళ్లిళ్లను హిందూ వివాహ చట్టం ప్రకారం గుర్తించలేమన్నారు. ఆచారాలు, సంప్రదాయాలు లేకుండా జరిగే వివాహాలను చెల్లవని స్పష్టం చేసింది. మాంగల్యధారణ, సప్తపది సహా ఇతర ఆచారాలు లేకుండా హిందూ వివాహం చెల్లుబాటు కాదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. తన నుంచి వేరుగా ఉన్న భార్య.. విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకుందన్న భర్త వాదనలను.. ఈ సందర్భంగా హైకోర్టు తిరస్కరించింది. తాను రెండో పెళ్లి చేసుకున్నట్టు ఆరోపిస్తూ భర్త ఫ్యామిలీ కోర్టులో వేసిన పిటీషన్‌ను భార్య అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేసింది. దీనిని విచారణకు స్వీకరించిన జస్టిస్ సంజయ్ కుమార్ సింగ్.. “వివాహానికి సంబంధించి సరైన వేడుకలు, సరైన ఆచారాలతో వివాహాన్ని జరుపుకోవడం అని అర్థం. సంప్రదాయాలు, ఆచారాలను పాటించి వివాహం జరుపుకోకపోతే లేదా నిర్వహించకపోతే అది పెళ్లి అని చెప్పలేం” అని వ్యాఖ్యానించింది. హిందూ చట్టం ప్రకారం “సప్తపది” ( అగ్నిహోత్రం చుట్టూ ఏడడుగులు వేయడం ) వేడుక వివాహ బంధాన్ని ఏర్పరచడానికి అవసరమైన అంశాల్లో ఒకటి. కానీ ప్రస్తుత కేసులో అందుకు సాక్ష్యం లేదు” అని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. దీంతో ఇక నుంచి హిందూ పెళ్లిళ్లపై వచ్చే కేసుల్లో ఈ తీర్పు ప్రామాణికం కానుంది.

  మొదటి కేసు తీర్పులో.. విశృంఖలత్వం వైపు మరలుతున్న యువత.. కేవలం ఆర్థికస్వాతంత్య్రమే జీవితం అనే భ్రమలో ఉంటూ.. భవిష్యత్ లో జరిగే పరిణామాలను ఏ మాత్రం గుర్తించకుండా.. స్వచ్ఛమైన బంధాన్ని వదులుకుంటున్న వైనాన్ని ప్రశ్నిస్తోంది. ఇక రెండో కేసు తీర్పులో.. వివాహ వ్యవస్థలో ఆచార వ్యవహారాలు, సంప్రదాయాల ప్రాముఖ్యతను గుర్తిస్తోంది.