బిజెపి ప్రాధాన కార్యదర్శి, ఇండియా ఫౌండేషన్ సభ్యులు శ్రీ రామ్ మాధవ్ బహిరంగ సభలో మాట్లాడుతూ `సిఏఏ చట్టంలో ఎలాంటి మతపరమైన వివక్ష లేదు, కావాలనే ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు మైనారిటీ ప్రజలను రెచ్చగొట్టి, తప్పుదోవ పట్టిస్తున్నాయని, దేశమంతా అల్లర్లు సృష్టిస్తున్నాయని’ అన్నారు. `సిఏఏ- భారత దేశానికి ఈ చట్టం ఎందుకు అవసరం?’ అనే అంశం మీద ఆయన ప్రసంగించారు. ఈ సమావేశాన్ని ప్రజ్ఞ్యా భారతి, సోషల్ కాస్ సంస్థలు సంయుక్తంగా `మారియట్ హోటల్’ లో 3 జనవరి, 2020 సాయంత్రం నిర్వహించాయి.
90శాతం ప్రజలు అనగా మన దేశం ఈ సిఏఏ చట్టాన్ని స్వాగతిస్తున్నారని, అయినా ప్రభుత్వం అందరినీ కలుపుకోవాలని, దేశమంతా సమావేశాలు నిర్వహిస్తోందని తెలిపారు. తమ సొంత పార్టీ, ప్రభుత్వాల చరిత్ర వారికే తెలియని అజ్ఞ్యానంలో నేటి కాంగ్రెస్ పార్టీ ఉందని అన్నారు. సిఏఏ చట్టం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్ దేశాలలో మతవివక్షను ఎదుర్కుంటున్న అక్కడి `అల్పసంఖ్యాక వర్గాలకు’ వర్తిస్తుంది, వారికైనా కొన్ని ప్రాథమికాలను, ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే పౌరసత్వం ఇవ్వబడుతుంది కానీ ప్రతివారికీ కాదు, ముఖ్యంగా వారు 31డిసెంబర్ 2014 ముందే భారత్ వచ్చి ఉండాలి అని చెప్పారు. మతవివక్షకు గురైన ఆ దేశాల మైనారిటీలకు అని మాత్రమే చట్టంలో అదనంగా చేర్చబడింది అని చెప్పారు. సిఏఏ చట్టానికి భారత పౌరులకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్తూ స్వయంగా ప్రధాని మోదీ గారు కూడా ఈ విషయంపై హామీ ఇచ్చారు అని అన్నారు. ఈ చట్టం ఏ వర్గం పట్ల వివక్షత చూపదు, అలాగే పూర్తిగా రాజ్యాంగబద్ధమైనది అని అన్నారు.
దేశవిభజన మతప్రాతిపదికపై జరిగిన అతి దారుణం, 1.50 కోట్ల ప్రజలు రెండు దేశాలలోను వలసపోవాల్సి వచ్చింది, పాకిస్తాన్, ఆ తరువాత బంగ్లాదేశ్ `ఇస్లామిక్’ దేశాలుగా మారి, అక్కడి మైనారిటీలైన హిందువులు, సిక్ఖులు ఇతరులపై దమనకాండ, అణచివేత సాగించడంవల్ల అనేకమంది, అప్పటినుండి తమ మానప్రాణ సంరక్షణకై భారత్ కి పారిపోయి రావడం జరిగింది. ఇవి ఆపే ప్రయత్నంలో 1950లో `నెహ్రు-లియాకత్’ ఒప్పందం జరిగినా, పాకిస్తాన్ దానిని ఖాతరు చేయకపోవడంవల్ల ఈ వలసలు ఆగలేదు. బంగ్లాదేశ్ ఏర్పడిన తరువాత, ఇందిరా గాంధి-ముజిబుర్ రెహ్మాన్ ల మధ్య జరిగిన చర్చల్లో కూడా 12లక్షల మంది శరణార్ధులకి భారత్ పౌరసత్వం లభించింది. భారత్ చారిత్రిక, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రస్తుత మోదీ ప్రభుత్వం కూడా కొనసాగిస్తూ, మత వివక్షకు గురైన శరణార్థులకి పౌరసత్వం కల్పించే విధంగా చట్ట సవరణ చేసింది. ఇది మన దేశ చారిత్రక, నైతిక బాధ్యత అని చెప్పారు. దీనికి ప్రతిపక్షాలు కావాలని రాద్ధాంతo చేస్తూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నాయని, ప్రజలు వారి కుట్రలు గమనించాలని చెప్పారు. అస్సాం సమస్య మూలాలు వేరని, బంగ్లాదేశ్ శరణార్థులు 70లలో కూడా తమ రాష్ట్రానికి వచ్చి అక్కడి జనాభా నిష్పత్తిని, స్థానిక సంస్కృతిని అతలాకుతలం చేయడం వల్ల అక్కడి ప్రజల ఆక్రోశం సహేతుకమైనది, అందుకే ప్రభుత్వం 1985 లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం చేసిన ఒప్పందం, ముఖ్యంగా క్లాస్ 6, ఇప్పుడు అమలు చేయడానికి పూనుకుందని చెప్పారు.
అంతకుముందు ప్రజ్ఞాభారతి అధ్యక్షులు శ్రీ హనుమాన్ చౌదరి మాట్లడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వాలు బాధ్యత విస్మరించి, దశాబ్దాలుగా చేయని పనిని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే, ఇతర రాజకీయ పార్టీలు సమర్థించకపోగా, దేశ౦లో అరాచకం సృష్టించి, విచ్చిన్నకర శక్తులను ప్రోత్సహిస్తున్నాయని అన్నారు. కొన్ని పార్టీలు మైనారిటీ రాజకీయాలు చేస్తూ హిందూ-వ్యతిరేకులుగా మారాయని అన్నారు. ఈ కార్యక్రామానికి వేలమంది ప్రజలు, ఎందరో ప్రముఖులు హాజారయారు.