Home News అమెరికాలో ఉద్యోగాన్ని వదిలి, స్వదేశంలో ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గిస్తున్న యువకుడు

అమెరికాలో ఉద్యోగాన్ని వదిలి, స్వదేశంలో ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గిస్తున్న యువకుడు

0
SHARE

పర్యావరణ కాలుష్యాన్ని కలిగించే అతి ముఖ్యమైన పదార్థాలలో ప్లాస్టిక్‌ ఒకటి అని మనందరికీ తెలిసిందే… చాలామంది ప్లాస్టిక్‌ వాడ కాన్ని తగ్గించాలని రకరకాల ఉద్యమాలను కూడా నిర్వ హిస్తున్నారు. అలా తన స్వరాష్ట్రమైన తమిళనాడులో ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించా లని ఓ యువకుడు అనుకున్నాడు. అందుకోసం అమెరికాలోని తన ఉద్యోగాన్ని కూడా వదిలేసుకున్నాడు. మొక్కజొన్న, కూరగాయాలు, కాగితపు వ్యర్థాల నుండి పర్యావరణహిత సంచులను రూపొందించాడు. ఆ సంచులు కేవలం మూడు నెలల్లోనే మట్టిలో కలిసిపోతాయి. అంతేకాకుండా భూమి సారతకు ఎటువంటి నష్టాన్ని కలిగించవు. కాగితంలాగా బూడిదయ్యే విధంగా బయోడిగ్రేడబుల్‌ సంచులను అందుబాటులోకి తెచ్చాడు. అంతేకాకుండా కరిగిపోయే విధంగా ఆ పర్యావరణహిత సంచులు ఉండడం మరో విశేషం.

ఈ సమస్య నుండి తన సొంత రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి శిబి సెల్వన్‌ ముందుకొచ్చారు. ఎప్పటికైనా తను స్వదేశానికి రావాల్సిందేనని, దేశాభివృద్ధి కోసం తనవంతు కృషి చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటానని శిబి చెబుతారు. అందులో భాగంగానే తమిళనాడులో ప్లాస్టిక్‌ వినియోగం తగ్గించే యత్నంగా ‘రెగెనో’ సంస్థను ఆయన స్థాపించారు. కోయంబత్తూరులోని తిరుప్పూ రుకు చెందిన అతను ఊటీలోని పాఠశాలలో  అతడు చదువుకున్నాడు. అప్పుడు ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను అతను మరిచిపోలేదని చెబు తుంటాడు… తగ్గించు, పునర్వినియోగించు, పునరుత్పాదణ చేయు అనే అంశాలు తన మెదడులో పాతుకుపోయాయని శిబి చెబుతుంటారు. కాని వాటిని పాటించే వారు తక్కువ అనే విషయం అతడిని బాధిస్తుంటుంది. చెన్నై లయోలా కాలేజ్‌ పూర్వ విద్యార్థి అయిన శిబి సెల్వన్‌ అమెరికాలోని విశ్వవిద్యాలయంలోతన ఆర్థిక శాస్త్ర పట్టాను పొందారు. నాలుగు సంవత్సరాల పాటు అక్కడ గడిపారు. ఓ ఆటో మొబైల్‌ విడి భాగాల తయారీ కంపెనీలో పనిచేశారు. అయితే అమెరికావాసులు పర్యావరణహిత సంచుల వినియోగంలో పాటిస్తున్న నియమాలు అతడిని ఆకట్టుకున్నాయి. ప్లాస్టిక్‌ వినియోగాన్ని అమెరికన్లు తగ్గించే పద్ధతులు అతనని ఆకర్షించాయి. బయోడిగ్రేడబుల్‌ సాంకేతికతను భారతదేశంలో ప్రవేశపెట్టాలని భావించారు. ఆ విధంగా ‘రెగెనో’ సంస్థకు సంబంధించిన ఆలోచన పుట్టింది. అమెరి కాలో యువ పారిశ్రామికవేత్తగా పరిశోధనలు చేసిన శిబి, తన ప్రణాళికల రూపాన్ని ఇవ్వడానికి 2016 సంవత్సరం డిసెంబరు నెలలో భారతదేశానికి వచ్చారు. ప్రారంభంలో తన తండ్రి వస్త్ర పరిశ్రమ లోని ఉద్యోగులను తన పరిశోధనలకు సహాయంగా నియమించుకున్నారు. అలా ఏడాదిపాటు శ్రమిం చాడు. గత ఆరు నెలల క్రితమే ‘రెగెనో’ సంస్థకు పూర్తి స్థాయిలో వ్యవస్థీకృత రూపం ఏర్పడింది. కొద్దికాలంలోనే సంతృప్తికరమైన విజయాలను సంస్థ సాధించింది.

పర్యావరణహిత సంచుల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడం ఎంతో అవసర మని శిబి చెబుతారు. ప్లాస్టిక్‌ వల్ల పర్యావరణా నికి, ప్రజలకు పొంచి ఉన్న ప్రమాదాల పట్ల దేశంలో చాలా మంది పౌరులకు అవగాహన లేదని ఆయన అభిప్రాయపడతారు. ఒక్కసారి వినియో గించి పడేసే ప్లాస్టిక్‌ వినియోగం 35శాతానికి పైగానే ఉందంటారు.

పర్యావరణహిత ఉత్పత్తులతో పోలిస్తే ప్లాస్టిక్‌ ఉత్పత్తులు తక్కువ ధరకే లభిస్తాయి. ప్లాస్టిక్‌ బ్యాగులు, కప్పులు, సంచులకు మార్కెట్లో ఎక్కువ డిమాండ్‌ ఉంటుంది. కాబట్టి ప్రజల్లో పర్యావరణం పరిరక్షణ పట్ల సానుకూలా దృక్పథాన్ని పెంచడానికి శ్రమించక తప్పదు. ప్లాస్టిక్ను బహిష్కరించి పర్యావరణహిత ఉత్పత్తుల వాడకాన్ని పెంచడానికి అవగాహన కల్పించాల్సిందేనని శిబి అంటారు.

రెగెనో ఉత్పత్తులను మొక్కజొన్న, కూరగాయలు, కాగితాల వ్యర్థాల నుండి తయారుచేస్తామని, అవి మట్టిలో కలిసిపోవడానికి 3 నెలల కంటే తక్కువ సమయం పడుతుందని శిబి పేర్కొంటున్నారు. అంతేకాకుండా వ్యవసాయోత్పత్తికి, నేల సారానికి ఎటువంటి హాని కలిగించవని వివరిస్తారు. వేడి నీటిలో కూడా తమ ఉత్పత్తులు కరిగిపోతాయని ధీమా వ్యక్తం చేస్తారు.

ప్లాస్టిక్‌ బ్యాగులతో పోలిస్తే బయోడిగ్రేడబుల్‌ బ్యాగుల ఉత్పత్తి ధర 50 శాతం ఎక్కువగానే ఉంటుంది. కాని కాటన్‌ బ్యాగులు, పేపరు బ్యాగుల కంటే బయోడిగ్రేడబుల్‌ బ్యాగుల ధర తక్కువే ఉంటుంది. వాటి పరిమాణాన్ని బట్టి ధరలు మారుతుంటాయి. అయితే ప్రత్తి, ప్లాస్టిక్ల మిశ్రమంతో రూపొందించే సంచులు ఎంతో ప్రమాదకరమైనవి. వాటిలో 60శాతం ప్లాస్టిక్ను ఉత్పత్తిదారులు వినియోగిస్తారు. ఆ సంచులు నెమ్మదిగా సముద్రం లోకి చేరుతాయి. సంచుల్లోని కాటన్‌ నీటిలో కలిసిపోయినా.. మిగిలిన ప్లాస్టిక్‌ సూక్ష్మ కణాలను చేపలను తింటాయి. తరువాత ఆ చేపలను మనుషులు తినడం వల్ల అనారోగ్యాల బారిన పడడం, క్యాన్సర్‌ వ్యాధికి గురయ్యే అవకాశాలు లేకపోలేదు.

ప్రస్తుతం చాలా మంది ప్రజలు పర్యావరణ హితమైన ఉత్పత్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. దానిని ఆధారం చేసుకునే ‘రెగెనో’ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చినట్లు శిబి వివరిస్తారు. ధర ఎక్కువగా ఉన్నకారణంగా చాలా మంది పర్యావరణహిత ఉత్పత్తులను కొనేందుకు వెనుకాడుతుంటారని, అయితే ధరలు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని, సెల్ఫోన్‌ తొలినాళ్ళలో లక్షకు పైగా ఉండేదని, ప్రస్తుతం 500లకే లభిస్తుందని చెబుతారు. అలా మార్కెట్లో పోటీ పెరిగినప్పుడు ప్రజలకు తక్కువ ధరకే బయోడిగ్రేడబుల్‌ ఉత్పత్తులు లభించే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలను తమ ఖాతాలో వేసుకుంటామనే శిబి మాటలలోని ఆత్మ విశ్వాసాన్ని ఉట్టిపడేలా చేస్తాయి.

 – లతాకమలం

(లోకహితం సౌజన్యం తో)