Home News ఎస్సీ బాలిక‌పై అత్యాచారం కేసు: FIRలో ఎస్సీ, ఎస్టీ చ‌ట్టం సెక్షన్లు న‌మోదు చేయ‌ని పోలీసులు!

ఎస్సీ బాలిక‌పై అత్యాచారం కేసు: FIRలో ఎస్సీ, ఎస్టీ చ‌ట్టం సెక్షన్లు న‌మోదు చేయ‌ని పోలీసులు!

0
SHARE

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ ప్రాంతంలోని ఎస్సీ బాలికపై పాస్టర్ అత్యాచారం కేసులో మరో అంశం వెలుగులోకి వస్తోంది. నిందితుడైన స్థానిక పాస్టర్ మీద ఐపీసీ, పోక్సో చట్టాలపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం క్రింద మాత్రం కేసు నమోదు చేయకపోవడం చర్చనీయాంశమైంది.

కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన అలవాలా సుధాకర్ అనే చ‌ర్చి పాస్ట‌ర్ గ‌త జూన్ నెల 22 తేదీన సమీప గ్రామంలో ఒక మతపరమైన కార్య‌క్ర‌మానికి హ‌జ‌ర‌య్యాడు. ఆ స‌మ‌యంలో కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన 10 సంవ‌త్స‌రాల ఎస్సీ బాలిక‌పై  పాస్ట‌ర్ క‌న్నుప‌డింది. కార్య‌క్ర‌మం అనంత‌రం ఆ బాలిక‌ను చ‌ర్చికి ద‌గ్గ‌ర‌లోని ర‌హ‌స్య ప్ర‌దేశానికి తీసుకెళ్లి ఆమెపై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాడు. భ‌యంతో ఆ బాలిక అర‌వ‌డం ప్రారంభించింది. దీంతో కంగుతిన్న పాస్ట‌ర్‌ ఈ విష‌యాన్ని ఎవ‌రికీ చెప్పకూడ‌ద‌ని బాలిక‌కు రూ.50  ఇచ్చి  త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేశాడు. విష‌యం తెలుసుకున్న బాలిక త‌ల్లి వెంట‌నే సర్పవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేర‌కు చర్చి పాస్టర్ అలవాలా సుధాకర్‌ను గత వారం పోలీసులు అరెస్టు చేశారు.

బాధితురాలి తల్లి ఫిర్యాదు ఆధారంగా పాస్ట‌ర్ పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం, ఐపిసీ లోని ఇతర సెక్షన్ల కింద అతనిపై కేసులు న‌మోదు చేశారు. అయితే బాధిత బాలిక ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందినప్పటికీ పోలీసులు నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ  (అత్యాచారాల నిరోధక) చట్టంలోని సెక్షన్ల కింద కేసును న‌మోదు చేయ‌లేదు. దీనిపై ఎస్సీ-ఎస్టీ రైట్స్ ఫోరం తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. ఈ మేర‌కు ఎస్సీ జాతీయ క‌మిష‌న్‌కు లేఖ ద్వారా ఫిర్యాదు చేసింది.

మీడియాతో మాట్లాడుతున్న సమయంలో పాస్టర్ అలవాలా సుధాకర్ అంటూ నిందితుడి పూర్తి పేరు చెప్పిన పోలీసులు, తాము నమోదు చేసిన ఎఫ్.ఐ.ఆర్ లో మాత్రం కేవలం సుధాకర్ అని మాత్రమే రాయడం, నిందితుడు పూర్తి పేరు, తండ్రిపేరు, కులం, వ‌య‌స్సు, అత‌ని వృత్తికి సంబంధించిన వివ‌రాలు ఎక్క‌డా ప్ర‌స్త‌వించ‌లేద‌ని ఎస్సీ-ఎస్టీ రైట్స్ ఫోరమ్ తమ ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సంబంధిత పోలీసు అధికారి నిందితుడికి స‌హ‌క‌రిస్తున్న అనుమానాలను ఎస్సీ ఎస్టీ రైట్స్ ఫోరం లేఖ‌లో వ్యక్తం చేసింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఫోరం కమిషన్‌ను కోరింది.

Source : NIJAM TODAY