Home News మరో 21 రోజులు ఇల్లు అనే లక్ష్మణ రేఖ దాటి రావద్దు – ప్రధాని...

మరో 21 రోజులు ఇల్లు అనే లక్ష్మణ రేఖ దాటి రావద్దు – ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి

0
SHARE

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి సామాజిక దూరం పాటించడం, అందరూ ఇళ్లకే పరిమితం కావడానికి మించి మరో ప్రత్యామ్నాయం లేదని, అందుకనే నేటి (24 మార్చ్) అర్ధరాత్రి నుంచి 21 రోజులపాటు (15 ఏప్రిల్ వరకు) దేశం మొత్తంలో మూసివేత (లాక్ డౌన్) అమలు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడి ప్రకటించారు. ప్రజలు తమ ఇల్లనే `లక్ష్మణ రేఖ’ దాటకుండా తమ ప్రాణాలతోపాటు, కుటుంబసభ్యులు, ఇతరుల ప్రాణాలను కూడా కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. కరోనా గురించి ప్రధాని మోదీ ప్రసంగించడం ఈ నెలలోనే ఇది రెండవసారి. ప్రధాని ఉపన్యాసంలో ముఖ్యాంశాలు.

1. నేటి (24 మార్చ్) అర్ధరాత్రి నుంచి 21 రోజులు (15 ఏప్రిల్ వరకు) దేశం మొత్తంలో మూసివేత (లాక్ డౌన్) అమలవుతుంది.

2. ప్రజలంతా ఇళ్లకు మాత్రమే పరిమితం కావాలి.

3. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి సామాజిక దూరం పాటించడం ఒక్కటే మార్గమని వివిధ వైద్య పరిశోధనల్లో తేలింది.

4. మనతోపాటు కుటుంబసభ్యులు, ఇతరుల ప్రాణాలను కాపాడుకోవడానికి ఇల్లు అనే `లక్ష్మణ రేఖ’ దాటకుండా ఉండాలి.

5. జనతా కర్ఫ్యును విజయవంతం చేసినట్లుగానే ఇది కూడా కచ్చితంగా పాటించాలి.

6. కరోనా వైరస్ సోకినవారేకాక ఇతరులు కూడా పూర్తి జాగ్రత్తలు పాటించాలి.

7. నిర్లక్ష్యంగా ఉంటే భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది.

8. సంపూర్ణ మూసివేత (లాక్ డౌన్) మూలంగా ఆర్ధికపరమైన ఇబ్బందులు అనేకం వస్తాయి. అయినా వాటిని భరించాల్సిందే.

9. ప్రపంచ ఆరోగ్య నివేదిక ప్రకారం వైరస్ ఒక వ్యక్తి ద్వారా వందలమందికి వ్యాపిస్తున్నది.

10. ప్రపంచ వ్యాప్తంగా మొదటి లక్ష మందికి వైరస్ వ్యాపించడానికి 67 రోజులు పడితే, ఆ తరువాత మరో లక్షమందిని 15 రోజుల్లో, ఆ తరువాత మరో లక్షమందిని కేవలం నాలుగు రోజుల్లోనే చుట్టుముట్టింది.

11. ఇంత వేగంగా వ్యాపించే వైరస్ ను అడ్డుకోవడం కేవలం సామాజిక దూరం పాటించడం ద్వారానే సాధ్యం.

12. వైద్య సదుపాయాలను మరింత పెంచేందుకు 15 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం.

13. వైద్యులు సూచించకుండా ఎలాంటి మందులు వాడవద్దు. దీని వల్ల కొత్త సమస్యలు వస్తాయి.

14. అత్యవసర వస్తువుల సరఫరాకు ఏర్పాట్లు కొనసాగుతాయి.