Home Telugu Articles నోట్ల రద్దుపై మమతకు ఎందుకంత ఉలికిపాటు?

నోట్ల రద్దుపై మమతకు ఎందుకంత ఉలికిపాటు?

0
SHARE

* శారదా చిట్‌ఫండ్‌ కుంభకోణం ఆమె ‘కళంకిత’ చరిత్రకు నిదర్శనం

* పలువురు టియంసి యంపీలు, మంత్రులు, నాయకుల అరెస్ట్‌

* ఉగ్రవాదానికి నిధుల మళ్లిస్తూండటంతో బంగ్లాదేశ్‌ నిరసన

నిజాయితీ రాజకీయాలకు తానే ప్రతి రూపంగా భావించే పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పెద్ద నోట్ల రద్దుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో నల్లధనం విషవక్షాన్ని కూల్చివేయడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెద్దనోట్ల రద్దు ప్రకటించగానే, శివంగి వలె తాండవం చేస్తూ అన్యాయం జరిగిపోతున్నట్లు ఆమె గగ్గోలు పెడుతున్నారు. ఈ విషయంలో ఆమె తీరు దేశంలో అందరికి విస్మయం కలిగించింది. ఆమె కేవలం రాజకీయంగా లబ్ది పొందటం కోసం ఈ విధంగా చేస్తున్నారా, తనకు, తన పార్టీవారికి సంబంధం ఉన్న అవినీతి దళారులను కాపాడటం కోసం ఆరాటపడుతున్నారా అనే అనుమానం కలిగిస్తున్నది.

నల్లబజారు వ్యాపారులు, సరుకులను దొంగ తనంగా దాచేవారికి, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన ఈ చర్యను వ్యతిరేకించడం ఏమిటని అంతా ఆశ్చర్యపోయారు. ”ఇది పేదలకు వ్యతిరేకం కాదు, పైగా వారికి మేలు చేయడానికే మమతాజి” అంటూ బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా హితవు కూడా చెప్పారు.

బ్యాంకుల వద్ద, ఏటీఎమ్‌ల వద్ద వేలాదిమంది ప్రజలు క్యూలలో నిలబడుతూ ఉండడంతో, వారందరిని ఆకట్టుకోవడం కోసం అన్నట్లుగా ఆమె నోట్లరద్దుకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టారు. అయితే క్యూలలో ఇబ్బందులుపడుతున్న ప్రజలు సహితం మోదీ ఎంతో ధైర్యంతో ఈ పని చేసారని మెచ్చు కొంటూ ఉండటాన్ని ఆమె సహించలేక పోతున్నారు.

రాజకీయంగా బద్ద శత్రువైన సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి స్వయంగా ఫోన్‌ చేసి ఈ రద్దు విషయమై నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కలసి ఉద్యమిద్దామని మమతా చెప్పారు. అయితే ఆమె కేవలం తమ పార్టీవారి ఆధీనంలో ఉన్న చిట్‌ఫండ్‌ల ద్వారా నల్లధనం సమకూర్చుకున్న సిండికేట్‌లను కాపాడుకోవడం కోసమే ఈ ఉద్యమం చేపడుతున్నారుని రాష్ట్ర సిపిఏం కార్యదర్శి సురాజ్య కాంత్‌ మిశ్రా ఆరోపించారు.

‘చిట్‌ఫండ్‌ కుంభకోణంలో ఉన్నవారి గురించి దేశ ప్రజలకు తెలియదా ? అటువంటి వారా నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిపేది’ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవహేళన చేశారు. లక్షలాది మంది తాము కష్టపడి సంపాదించుకున్న డబ్బును చిట్‌ఫండ్‌లలో పెడితే, రాజకీయ నాయకుల అండతో ఆ మొత్తాన్ని అదశ్యం చేశారని, దానితో చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ”వారా నా మీద ఆరోపణలు చేసేది ?” అంటూ ఆయన విస్మయం వ్యక్తం చేశారు.

మమతా అవినీతికి ప్రతిరూపం శారదా చిట్స్‌

అంతర్జాతీయంగా సంచలనం కలిగించిన శారదా చిట్‌ఫండ్‌ కుంభకోణంలో టిఎంసి ఎంపీలతో సహా అనేక మంది రాజకీయ నాయకులు భారీఎత్తున నిధులు పొందారని ఆరోపణలు వచ్చాయి. సిబిఐ కథనం మేరకు టిఎంసి ఎంపీలు కునాల్‌ ఘోష్‌, సరిజోయ్‌ బోస్‌, మాజీ డిజిపి రజత్‌ మజుందార్‌, రాష్ట్ర మంత్రి మదన్‌ మిత్ర నిందితులు. కునాల్‌ ఘోష్‌ నెలకు 16 లక్షల రూపాయల జీతం తీసుకొంటూ ఈ కంపెనీలో పనిచేశారు. సరిజోయ్‌ బోస్‌ ఈ సంస్థ మీడియా వ్యవహారాలు చూడగా, మదన్‌ మిత్ర గ్రూప్‌ ఉద్యోగుల యూనియన్‌ అధ్యక్షుడిగా బహిరంగంగా అందులో పెట్టుబడులు పెట్టమని ప్రజలను ప్రోత్సహించారు.

మమతా బెనర్జీ వేసిన పెయింటింగ్‌లు కొనడానికి ఈ సంస్థ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుదీప్తో సేన్‌ 1.86 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ తరువాత ఆ గ్రూప్‌ వార్తా పత్రికలు అన్నింటిని ప్రతి ప్రభుత్వ గ్రంథాలయం కొనుగోలు చేయాలంటూ ఆమె ప్రభుత్వం ఒక ఉత్తర్వు జారీ చేసింది.

2014 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా బిజెపి ప్రధాన మంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీ ప్రచారానికి వెళ్ళినప్పుడు తన పెయింటింగ్‌లను 1.86 కోట్ల రూపాయలకు అమ్మడం ద్వారా ఈ కుంభకోణంలో మమతా బెనర్జీ ప్రత్యక్షంగా ప్రయోజనం పొందారని ఆరోపించారు. ఈ ఆరోపణలతో ఖంగుతిన్న టిఎంసి నాయకులు మోదీపై కోర్ట్‌లో పరువు నష్టం దావా వేస్తామని ప్రకటించినా అటువంటి సాహసం చేయలేకపోయారు.

భారీ నష్టాలు తెస్తున్న ఈ కంపెనీకి చెందిన ల్యాండ్‌మార్క్‌ సిమెంట్‌ కంపెనీకి ఆమె మంత్రి వర్గంలోని టెక్స్‌టైల్‌ మంత్రి శ్యామపద ముఖర్జీ సహ యజమాని. ఈ కంపెనీ అక్రమాలపై పలు ఆరోపణలు వచ్చినా సెబీ మినహా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి దర్యాప్తుకు పూనుకోలేదు. 2012 డిసెంబర్‌ 7న ఈ కంపెనీ ఆర్థికంగా అక్రమాలకు పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదులపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు జరిపించాలని రిజర్వు బ్యాంక్‌ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు కోరినా పట్టించుకోలేదు.

సుదీప్తో సేన్‌ 2013 ఏప్రిల్‌ 6న సిబిఐకి వ్రాసిన లేఖలో తాను పలువురు రాజకీయ నాయకులకు పెద్దమొత్తాలను చెల్లించానని అంగీకరించారు. నష్టాలు వచ్చే మీడియా కంపెనీలలో చేరమని టిఎంసి నాయకుడు కునాల్‌ ఘోష్‌ తనను బెదిరించి ఒత్తిడి తెచ్చారని, తనకు చెందిన ఒక టెలివిజన్‌ ఛానెల్‌ను మార్కెట్‌ ధరకన్నా చాల తక్కువకే కొన్నారని కూడా పేర్కొన్నారు.

సాధారణ ప్రజల నుండి కోట్లరూపాయలు వసూలు

ఒక ఊహాజనిత పథకంలో భారీ రాబడులు రాగలవని నమ్మించి పెద్ద ఎత్తున సాధారణ ప్రజల నుండి డిపాజిట్‌లను సేకరించిన శారదా చిట్‌ కుంభకోణంగా పేర్కొనే ఈ కుంభకోణం దేశంలోనే అతి పెద్ద ఆర్థిక నేరంగా, రాజకీయ అవినీతికి నిదర్శనంగా నిలచింది. ఈ పథకం కుప్పకూలిన ఏప్రిల్‌, 2013 నాటికి సుమారు 17 లక్షల మంది నుండి 20 వేలు నుండి 30 వేల కోట్ల రూపాయల డిపాజిట్‌లను వసూలు చేశారు.

2013 జనవరి నాటికీ ఈ గ్రూప్‌ ప్రజలకు చెల్లించవలసిన మొత్తాలకన్నా వారి వద్ద ఉన్న నిధులు తక్కువగా ఉండడంతో డిపాజిట్‌ చేసినవారు, ఏజెంట్లు ఆందోళన చేయడం ప్రారంభించారు. దానితో ఈ పథకం కుప్పకూలగానే 2013 ఏప్రిల్‌ 17న శారదా గ్రూప్‌కు చెందిన సుమారు 600 కలెక్షన్‌ ఏజెంట్లు టిఎంసి ప్రధాన కార్యాలయానికి వెళ్లి ప్రభుత్వం జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు.

క్రమంగా రాష్ట్రమంతా బాధితులు ఆందోళన చేయడం ప్రారంభించారు. దక్షిణ బారసాత్‌ ప్రాంతంలోని ప్రతి ఇంటిలో కనీసం ఒకరైనా ఈ కుంభకోణంలో నష్టపోయారుని వార్త పత్రికలు కథనాలు ప్రచురించాయి. దానితో అనేకమంది విద్యార్థులు చదువు మానివేయవలసివచ్చింది. వ్యాపారులు షాప్‌లను మూసుకో వలసి వచ్చింది.

దేశవ్యాప్తంగా ఈ కథనాలు వార్తాపత్రికలలో పతాక శీర్షికలతో వస్తూ ఉండడంతో ఏప్రిల్‌ 20న సుదీప్తో సేన్‌పై అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేశారు. వారం రోజుల తరువాత కాశ్మీర్‌లో పోలీసులు అతనితో పాటు మరో ఇద్దరు దెబీజాని ముఖేర్జీ, అరవింద్‌ సింగ్‌ చౌహన్‌లను కూడా అరెస్ట్‌ చేశారు. ప్రజలనుండి తీవ్ర ఒత్తిడి రావడంతో సభ్యులతో న్యాయ విచారణ జరపడం కోసం రాష్ట్ర ప్రభుత్వం శ్యామల కుమార్‌ సేన్‌ కమీషన్‌ను నియమించింది. ఈ సందర్భంగా ”జరిగింది ఏదో జరిగి పోయిందిలే” అంటూ మమతా బెనర్జీ చాలా ఉదాసీనంగా మాట్లాడటం ఈ దర్యాప్తు పట్ల ఆమెకు ఆసక్తి లేదని స్పష్టం చేసింది.

ఇలా ఉండగా, 2013 ఏప్రిల్‌ 24న ఆమె చిట్‌ఫండ్‌ బాధితులకోసం పొగాకు ఉత్పత్తులపై 10 శాతం అదనపు పన్ను విధించడం ద్వారా 500 కోట్ల రూపాయల నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం తీవ్రమైన వివాదానికి దారితీసింది. ఈ ప్రభుత్వ చర్యను ఆర్‌బిఐ ఆ తరువాత ప్రశ్నించింది. ఈ సందర్భంగా నమోదైన క్రిమినల్‌ కేసులన్నింటిని కలిపి దర్యాప్తు జరపడం కోసం ఒక సిట్‌ను కూడా ఏర్పాటు చేశారు.

అయితే సిబిఐ, ఇడి, ఎస్‌ఎఫ్‌ఐఓ వంటి కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఈ కేసులను చేపట్టడాన్నికి మాత్రం ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. 2013 మే 23న శారదా గ్రూప్‌కు చెందిన టెలివిజన్‌ ఛానల్స్‌ ‘తార న్యూస్‌’, ‘తార మ్యూజిక్‌’లను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆసక్తిగా ఉన్నట్లు మమతా ప్రకటించారు. చివరకు సుప్రీంకోర్టు ఆదేశంపై మే, 2014లో సిబిఐ దర్యాప్తు చేపట్టింది.

80 మంది ఆత్మహత్య

మీడియా కథనాల ప్రకారం 80 మందికి పైగా డిపాజిట్‌ చేసిన వారు, ఏజెంట్లు, వివిధ కంపెనీల డైరెక్టర్‌లు ఆత్మహత్యలు చేసుకున్నారు. చివరకు సుప్రీంకోర్టు ఆదేశంపై సీబీఐ ఈ కేసు దర్యాప్తును చేపట్టవలసి వచ్చింది.

ఈ కుంభకోణం పట్ల పశ్చిమ బెంగాల్‌ అంతా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ప్రజలు నిరసన ప్రదర్శనలు చేస్తూ, శారదా గ్రూప్‌ కార్యాలయాలపై దాడులు జరిపి ధ్వంసం చేయడం ప్రారంభించారు. బాధితులు కలసి ”చిట్‌ ఫండ్‌ బాధితుల ఐక్య వేదిక”ను ఏర్పరచుకొని, దర్యాప్తు సత్వరం జరిపించి, డిపాజిట్‌లను తిరిగి ఇవ్వాలని నిరసన, ఆందోళనలు చేయడం ప్రారంభించారు. ఈ వేదికకు సంబంధించిన వారిని పలు చోట్ల టిఎంసి కార్యకర్తలు బెదిరించి, వారిపై దౌర్జన్యాలు జరిపారు.

ఉగ్రవాదులకు నిధుల మళ్లింపు

2014 సెప్టెంబర్‌లో ఆనంద్‌ బజార్‌ పత్రికతో పాటు పలు బెంగాలీ వార్త పత్రికలు పలు స్వదేశీ, విదేశీ నిఘా విభాగాల నివేదికలను ఉటంకిస్తూ వరుసగా ప్రచురించిన వార్త కథనాల ప్రకారం, బంగ్లాదేశీ తీవ్ర వాద సంస్థ జమాత్‌ ఇ ఇస్లామీకి చెందిన స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా వ్యవస్థాపకుడైన టిఎంసి ఎంపీ అహ్మద్‌ హస్సన్‌ ఇమ్రాన్‌ దేశం నుండి పెద్ద ఎత్తున నిధులను మళ్ళించారు.

ఈ నిధులతో బంగ్లాదేశ్‌లో వీరి వ్యవస్థాపకులైన యుద్ధనేరస్థులపై జరుగుతున్న విచారణలు అడ్డుకోవడం కోసం, అవామీ లీగ్‌ ప్రభుత్వాన్ని అస్థిర పరచడం కోసం తీవ్రవాద కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ వార్తా కథనాలపై తీవ్రంగా స్పందించిన షేక్‌ హసీనా నాయకత్వంలోని బంగ్లాదేశ్‌ ప్రభుత్వం లోతైన దర్యాప్తు జరపడం కోసం ఒక కమీషన్‌ను నియమించింది. దానితో అగ్గిమీద గుగ్గిలం వలె ఊగిపోయిన మమతా బెనర్జీ కోల్‌కతాలోని బంగ్లాదేశ్‌ డిప్యూటీ హైకమీషనర్‌ను పిలిపించి, మీడియాలో ఎంపిక చేసిన లీక్‌లతో ప్రోటోకాల్‌ ఉల్లంఘనకు పాల్పడుతున్నారంటూ నిరసన తెలిపారు.

ఆ తరువాత రెండు దేశాల మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చలలో బంగ్లాదేశ్‌ విదేశాంగ మంత్రి అబుల్‌ హస్సన్‌ మహమూద్‌ అలీ తమదేశంలోని ఉగ్రవాదులకు భారత్‌ నుండి నిధులు వస్తూ ఉండటంపట్ల జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్‌ ధోవల్‌కు తెలుపుతూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు. తీవ్రవాద సంస్థ ద్వారా అల్‌ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలకు శారదా నిధులు చేరుతున్నా యంటూ బంగ్లాదేశ్‌కు చెందిన మానవ హక్కుల ఉద్యమకారుడు షారియార్‌ కబీర్‌ సహితం ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రతిపక్షాలలో సహితం అనుమానాలు

నోట్లరద్దుకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ చేపట్టిన ఆందోళనల పట్ల సహితం ఇతర ప్రతిపక్షాలు సహితం పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అందుకే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ మినహా మరెవరూ ఆమెతో కలసి సాగడానికి సుముఖంగా కనిపించడం లేదు. పార్లమెంట్‌ సమావేశాల మొదటి రోజున అందరం కలసి రాష్ట్రపతిభవన్‌ వరకు ఊరేగింపుగా వెళదామని నాయకులందరినీ స్వయంగా కోరినా, తీరా ఆ రోజు ఉద్యమంలో ఇతరులెవరినీ పట్టించుకోకుండా ఆప్‌, శివసేన, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ప్రతినిధులతో వెళ్లడంతో అంతా విస్మయం చెందారు.

అట్లాగే పార్లమెంట్‌లో మిగిలిన పక్షాలతో కాకుండా ఆమె భిన్నంగా వ్యవహరిస్తున్నది. రాజ్యసభలో అందరూ జెపిసి నియామకం కోసం పట్టుబడుతుంటే ఆమె వద్దంటున్నది. ఆమె ధోరణి ఎవరికీ అంతుబట్టడం లేదు.

టి.ఇంద్రసేనారెడ్డి

(జాగృతి సౌజన్యం తో)