Home News తెలంగాణ: ఎమ్మెల్యే కుల ధృవీకరణపై ఎన్.ఎస్.సి.ఆర్.పి.ఎస్ ఫిర్యాదు 

తెలంగాణ: ఎమ్మెల్యే కుల ధృవీకరణపై ఎన్.ఎస్.సి.ఆర్.పి.ఎస్ ఫిర్యాదు 

0
SHARE
స్టేషన్ ఘనపూర్ నియోజక ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య కుల ధృవీకరణపై జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి (ఎన్.ఎస్.సి.ఆర్.పి.ఎస్) జనగాం జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేసింది.
ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం నుండి అసెంబ్లీకి ఎన్నికైన రాజయ్య నిజానికి క్రైస్తవుడు అని, ఆ విషయాన్ని దాచిపెట్టి ఎస్సీ కుల ధృవీకరణ పత్రంతో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి పోటీ చేసినట్టు  ఎన్.ఎస్.సి.ఆర్.పి.ఎస్ అధ్యక్షులు కర్నె శ్రీశైలం తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్సి రిజర్వేషన్ తాలూకు ప్రయోజనాలను తాడికొండ రాజయ్య తన రాజకీయ లబ్ధికోసం దుర్వినియోగం చేశారని ఆరోపించారు.
తాటికొండ రాజయ్య స్టేషన్ ఘనపూర్ నుంచి టిఆర్ఎస్ పార్టీ తరఫున 2018లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఎమ్మెల్యే తాను క్రిస్టియన్ అని పలు సభల్లో ప్రకటించుకున్నారని, 2019లో జరిగిన ఒక ఎన్నికల బహిరంగ సభలో కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసినట్టు పేర్కొంటూ అందుకు తగిన వీడియో క్లిప్పింగుని తమ ఫిర్యాదుతో జతచేసారు.
రాష్ట్రపతి ఉత్తర్వులు (1950) ప్రకారం ఎస్సి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి క్రైస్తవ మతం లేదా ఇస్లామ్ మతంలోకి మారితే ఇకపై తన ఎస్సీ హోదా రద్దు అవుతుంది. దీని ప్రకారం క్రైస్తవుడిగా మారిన తాటికొండ రాజయ్య ఎస్సీ రిజర్వేషన్ కలిగి ఉండరని, కాబట్టి ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించిన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి చట్టబద్ధంగా అర్హత ఉండదని కర్నె శ్రీశైలం అన్నారు.
రాజయ్య ఈ నియమాన్ని ఉల్లంఘించారని, అతని ఎస్సీ కులధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేయడంతో పాటు,  తప్పుడు ధ్రువపత్రాలను చూపి ప్రభుత్వ అధికారులను మోసం చేసినందుకు అతడిపై ఎఫ్ఆర్ఐ నమోదు చేయడానికి పోలీస్ శాఖను ఆదేశించాలని తమ ఫిర్యాదులో కర్నె శ్రీశైలం కోరారు. అంతేకాకుండా సరైన విచారణ చేయకుండా ఎస్సీ కులం ధ్రువీకరణ పత్రాల జారీ చేసిన సంబంధిత రెవెన్యూ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.