Home News సేంద్రియ వ్యవసాయంతో రుణఉచ్చు నుంచి విముక్తి

సేంద్రియ వ్యవసాయంతో రుణఉచ్చు నుంచి విముక్తి

0
SHARE

సేంద్రియ వ్యవసాయం రైతులకు రుణ ఉచ్చు నుంచి విముక్తి ల‌భిస్తుంద‌ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌.ఎస్‌.ఎస్‌) సర్ సంఘ చాలక్ మోహన్ భాగవత్ విశ్వాసం వ్యక్తం చేశారు. సేంద్రియ వ్య‌వ‌సాయం రైతుల‌ను స్వావలంబన వైపు తీసుకెళ్తుందని ఆయ‌న అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో ఏకలవ్య ఫౌండేషన్ నిర్వహించిన సేంద్రీయ వ్యవసాయంపై అవ‌గాహ‌న‌ కార్యక్రమంలో మోహన్ భాగవత్ పాల్గొని ప్ర‌సంగించారు. ఆధునిక వ్యవసాయంతో పోలిస్తే సేంద్రియ వ్యవసాయానికి త‌క్కువ ఖ‌ర్చు అవుతుంద‌ని, అధిక ధరతో కూడిన ఎరువులను కూడా కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదని తెలిపారు. ఆధునిక వ్యవసాయం ద్వారా పండించే పంటలకు కనీస మద్దతు ధర ఇచ్చినా కొంత మేర నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెప్పారు. కానీ సేంద్రియ వ్య‌వ‌సాయం వ‌ల్ల రైతులు ఆర్థికంగా ఎదగ‌వ‌చ్చని అన్నారు.

అంతేకాకుండా సేంద్రియ వ్యవసాయాన్ని అవలంబించే వారు విత్తనాల కోసం ఆయా కంపెనీల బానిసత్వం నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చ‌న్నారు. పంటలను పండించే క్రమంలో అనేక రకాల ఎరువులను వాడటం వ‌ల్ల నేల పాడవడంతో పాటు, అలా పండించిన పంటలు తిన‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ వంటి అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తున్నాయ‌న్నారు. భూసారంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడే పంటలు పండించ‌డ‌మే సేంద్రియ వ్య‌వ‌సాయ విధాన‌మ‌ని ఆయ‌న వివ‌రించారు.

త‌న దృష్టిలో పొల‌మే ప్ర‌యోగ‌శాల, రైతే శాస్త్ర‌వేత్త అని మోహ‌న్ భాగ‌వ‌త్ అన్నారు. రైతులు శాస్త్రవేత్త‌లుగా మారిన‌ప్పుడే సాగు ఖ‌ర్చులు త‌గ్గి వ్య‌వ‌సాయం లాభాసాటిగా మారుతుంద‌న్నారు. సేంద్రియ వ్య‌వ‌సాయంతో పెట్టుబ‌డి ఖ‌ర్చులు త‌గ్గించ‌డంతో పాటు మార్కెటింగ్‌లో ఉపాధి, సొంత‌గా విత్త‌న ఉత్ప‌త్తి చేసుకోవ‌చ్చునని తెలిపారు. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారంతా ఇప్పుడు సొంత ప్రాంతాల్లో సేంద్రియ వ్య‌వ‌సాయం చేయ‌డానికి వ‌స్తున్నార‌ని అన్నారు. బీహ‌ర్‌లో ఒక వ్య‌వ‌సాయ క్షేత్రాన్ని సంద‌ర్శించిన‌ప్పుడు త‌న దృష్టికి వ‌చ్చిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌స్తావించారు. ” ఓ ఉన్నతాధికారి త‌న ఉద్యోగాన్ని వ‌దిలేసి, సేంద్రియ వ్య‌వ‌సాయాన్ని ప్రారంభించారు. సాగు విధానం చూసిన అత‌ని కొడుకు, కొడ‌లూ త‌మ ఉద్యోగాల‌ను వ‌దిలి సాగుకు సాయం చేశారు. అక్క‌డ నీటి కొర‌త ఉండ‌డంతో కొంత కొల‌ను తవ్వించి పై నుంచి వ‌చ్చే నీటిని అందులో నిల్వ చేశారు. వెదురు బొంగుల‌ను చక్రానికి అమ‌ర్చి స‌హ‌జ‌సిద్ధంగా వ‌చ్చిన ఆ నీటిని పొలానికి మ‌ళ్లించారు ” అని వివ‌రించారు. ఇలా ప్ర‌తి ఒక్క‌రూ సేంద్రియ వ్య‌వ‌సాయాన్ని ప్రొత్స‌హించాల‌ని సూచించారు.

సేంద్రీయ వ్యవసాయాన్ని అవలంబించడమంటే కేవలం ఎరువులను వాడకపోవడం మాత్రమే కాదని, పూర్వీకుల విధానాన్ని కొనసాగించడమని మోహన్ భాగవత్ ఈ సంద‌ర్భంగా అన్నారు. సేంద్రియ వ్యవసాయాన్నికొంత‌మంది వ్యతిరేకిస్తున్నారని, అలాంటి వారు వారి గర్వాన్ని పక్కన పెట్టి, సేంద్రియ రైతులు సాధిస్తున్న విజయాలను గ‌మ‌నించాల‌ని పిలుపునిచ్చారు. రైతులు త‌మ ప్రయోజ‌నాల‌ కోసం సంఘ‌టితం కావాల‌ని, ఆందోళ‌న‌ల కోసం కాద‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రూ సేంద్రియ వ్య‌వ‌సాయాన్ని ప్రొత్స‌హించి వ్య‌వ‌సాయ రంగంలో భార‌త్‌ను అగ్ర‌స్థానంలో నిల‌పాల‌ని ఈ సంద‌ర్భంగా మోహ‌న్ భాగ‌వ‌త్ రైతుల‌ను కోరారు.

“ఏక‌ల‌వ్య ఫౌండేష‌న్” ను శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారు 2006లో ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో స్థాపించారు. ఈ ఫౌండేష‌న్ ద్వారా ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజ‌నులు, ఆదివాసీల కోసం వారి ఆర్థిక స‌మృద్ధి, సామాజిక వికాసం కోసం అనేక కార్యక్ర‌మాలు చేప‌ట్టారు. ఇందులో భాగంగా గ‌త 7,8 సంవ‌త్స‌రాల నుంచి సేంద్రియ వ్య‌వసాయాన్ని పెంపొందించడానికి “సేంద్రియ మిత్ర” అనే పేరుతో ఒక ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్ర‌స్తుతం ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 1800 మంది రైతులు దాదాపు 3వేల ఏక‌రాల‌లో సేంద్రియ వ్య‌వ‌సాయం చేస్తున్నారు. ఈ మేర‌కు ఫిబ్ర‌వ‌రి 26న 2500 రైతు కుటుంబాల‌తో  “సేంద్రియ మిత్ర రైతు స‌మ్మేళ‌నం” పేరుతో ఒక కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మ‌హ‌రాష్ట్రకు చెందిన భ‌గావ‌త్ క‌థాఅవ‌తార్ శ్రీ నారాయ‌న్ మ‌హారాజ్ గారు, ఆర్‌.ఎస్‌.ఎస్ స‌ర్ సంఘ‌చాల‌క్ మోహ‌న్ భాగ‌వ‌త్ గారు పాల్గొని మార్గ‌ద‌ర్శనం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆర్‌.ఎస్‌.ఎస్ క్షేత్ర స‌హ సంఘ‌చాల‌క్ శ్రీ దూసి రామ‌కృష్ణ గారు. క్షేత్ర ప్రచార‌క్ సుధీర్ ‌గారు, ఆర్‌.ఎస్‌.ఎస్ తెలంగాణ ప్రాంత సంఘచాల‌క్ శ్రీ బూర్ల ద‌క్షిణ‌మూర్తి గారు, స‌హ సంఘ‌చాల‌క్ శ్రీ సుంద‌ర్‌రెడ్డి గారు, ప్రాంత కార్య‌వాహ శ్రీ కాచం ర‌మేష్ గారు, ఇందూర్ విభాగ్ సంఘ‌చాల‌క్ శ్రీ జ‌న‌గాం న‌రేంద‌ర్ రెడ్డి గారు, ఏక‌ల‌వ్య ఫౌండేష‌న్ స‌భ్యులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.