Home News పాకిస్తాన్ దుర్వినియోగంలో కర్తార్‌పూర్ కారిడార్

పాకిస్తాన్ దుర్వినియోగంలో కర్తార్‌పూర్ కారిడార్

0
SHARE

భక్తులు యాత్ర చేయడం కోసం ఏర్పాటు చేసిన కర్తా‌ర్‌పూర్ కారిడార్‌ను పాకిస్తాన్ దుర్వినియోగం చేస్తున్నది. యాత్రకు విచ్చేస్తున్న భక్తులతో వాణిజ్యపరమైన సంబంధాలను నెలకొల్పుకోవడానికి, ఇంటెలిజెన్స్ వర్గాల సమావేశాలకు కారిడార్‌ను పాకిస్తాన్ వినియోగిస్తున్నదని సంబంధిత వర్గాలు తెలిపాయి.

పాకిస్తాన్‌కు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కారిడార్‌లో మకాం వేశాయి. భారత్‌ నుంచి వెళుతున్న యాత్రికుల నుంచి సమాచారం సేకరించడానికి పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీల అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల కర్తా‌ర్‌పూర్ కారిడార్ వద్ద రోటరీ క్లబ్ అధికారుల సమావేశం జరిగింది. కారిడార్ దుర్వినియోగం పట్ల భారత్ వైపు అధికారులు అభ్యంతరం తెలిపారు. అందుకు తగిన ఆధారాలు సేకరించిన తర్వాత ఈ విషయాన్ని సాధ్యమైనంత త్వరగా పాక్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలనే ఆలోచనలో భారత్ అధికారులు ఉన్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కారిడార్‌ను వాణిజ్యపరమైన సమావేశాలకు సైతం వినియోగిస్తున్నారు. వాస్తవానికి కారిడార్ ఏర్పాటు ప్రధానంగా ధార్మిక యాత్రకు ఉద్దేశించింది. కారిడార్‌లో వాణిజ్యపరమైన సమావేశాలపై నిషేధం ఉంది.

కర్తార్‌పూర్ కారిడార్ భారత్‌లో గురుద్వారా డేరా బాబా నానక్‌ను పాకిస్తాన్‌లో గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను అనుసంధానం చేస్తుంది. ఈ కారిడార్ ద్వారా భారత్-పాకిస్తాన్ సరిహద్దు నుంచి పాకిస్తాన్ వైపు 4.7 కిలోమీటర్ల దూరంలోని కర్తార్‌పూర్‌లో గురుద్వారా సందర్శనానికి భారతీయులను ఎలాంటి వీసా లేకుండా అనుమతిస్తారు. సిక్కులకు సంబంధించి అత్యంత పవిత్రమైన ప్రాంతంగా కర్తార్‌పూర్‌లో గురుద్వారాను భక్తులు కొలుస్తారు.

కర్తార్‌పూర్ కారిడార్ ప్రతిపాదన 1999 సంవత్సరం మొదట్లో వచ్చింది. ఢిల్లీ-లాహౌర్ బస్సు దౌత్యంలో భాగంగా అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ల మధ్య కారిడార్ ప్రతిపాదన వచ్చింది. కర్తార్‌పూర్ కారిడార్‌కు సంబంధించి భారత్ వైపు శంకుస్థాపనను 2018 సంవత్సరం నవంబర్ 26న ప్రధాని నరేంద్ర మోడీ చేశారు. 2019 సంవత్సరం నవంబర్ 12న గురునానక్ 550వ జయంతి నాటికి కారిడార్ నిర్మాణం పూర్తయ్యింది.