Home Interviews “పంచ పరివర్తన్” సమాజానికి అవసరం – RSS సర్ కార్య‌వాహ దత్తాత్రేయ హోసబళే జీ

“పంచ పరివర్తన్” సమాజానికి అవసరం – RSS సర్ కార్య‌వాహ దత్తాత్రేయ హోసబళే జీ

0
SHARE

నాగ్‌పూర్‌లో, మార్చి 15 – 17, 2024 జరిగిన అఖిల భారతీయ ప్రతినిధి సభలో, సంఘ ప్రారంభమై ఒక శతాబ్ది పూర్తి కావస్తున్న సందర్భంగా చేపట్టవలసిన పని, కార్యక్రమాల గురించి చర్చ జరిగింది. కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఈ అంశాలు, సంఘ భవిష్యత్తు ప్రణాళికల గురించి, ఆర్‌ఎస్‌ఎస్‌ సర్ కార్య‌వాహ దత్తాత్రేయ హోసబళే జీ ఆర్గనైజర్, పాంచజన్యకు ఇచ్చిన ఇంట‌ర్వూలో వివరించారు…

ఈ ఏడాది ప్రతినిధి సభకు హాజరయ్యేవారి సంఖ్య ఒక్కసారిగా పెరిగినట్లు కనిపిస్తోంది. ఇది ఎలా జరిగింది?

సంఖ్య అకస్మాత్తుగా పెరిగిందనేది నిజం కాదు. అది క్రమంగా జరిగింది. సంఘ‌ పని విస్తరణతో ప్రతినిధుల సంఖ్య కూడా పెరిగింది. శాఖలు పెరిగినప్పుడు, క్రియాశీల స్వయంసేవకుల సంఖ్య సహజంగానే పెరుగుతుంది. దాని ఆధారంగా, ప్రతినిధుల సంఖ్య కూడా పెరుగుతుంది. దానికితోడు ఈసారి పెద్ద సంఖ్యలో ప్రత్యేక ఆహ్వానితులు కూడా ఉన్నారు. వివిధ క్షేత్రాలకు సంబంధించిన సంస్థల ప్రతినిధులు కూడా ఈసారి పాల్గొన్నారు. గత మూడేళ్లుగా కోవిడ్ మహమ్మారి కారణంగా సమావేశాలకు హాజరయ్యేవారి సంఖ్యను పరిమితం చేయాల్సివచ్చింది. ఉదాహరణకు, ఒక సంవత్సరం విభాగ్ ప్రచారక్‌లను, మరొక సంవత్సరం వివిధ రంగాలకు చెందిన కార్య‌క‌ర్త‌ల‌ను ఆహ్వ‌నించ‌లేదు. ఇప్పుడు ఆ పరిమితి లేదు కనుక అన్ని సంస్థల నుండి ప్రతినిధులు వచ్చారు. ఈ కారణంగానే అప్పట్లో ఈ సంఖ్య తక్కువగా ఉండగా, ఇప్పుడు ఒక్కసారిగా పెరిగినట్లు కనిపిస్తోంది.

RSS శతాబ్ది సంవత్సరానికి ఏ ప్రత్యేక లక్ష్యాలు ముందుంచుకున్నారు?

శతాబ్ది సంవత్సరం సందర్భంగా, సంఘ‌ము రెండు లక్ష్యాలను గుర్తించింది. ఒక‌టి శాఖల సంఖ్యను పెంచడం, మ‌రొక‌టి పనిలో గుణాత్మక మెరుగుదల. పని నాణ్యతను పెంచడం ద్వారా, దాని ప్రభావం కూడా పెరుగుతుంది. పరిమాణాత్మక విస్తరణతో పాటు గుణాత్మక వృద్ధిపై దృష్టి ఉంది. అలాగే, సామాజిక దృక్పథంతో `పంచ పరివర్తన్’ అనే అంశాన్ని ముందుకు తెచ్చాము. జాతీయ దృక్కోణంలో మేధోపరమైన కథనాన్ని(narrative) మార్చడం, సామాజిక మార్పు కోసం సజ్జన శక్తిని (ధర్మబద్ధమైన స‌మాజ శక్తి) సమీకరించడం సంఘం లక్ష్యాలు. అందువల్ల, ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది సంవత్సరంలో, సంస్థాగతంగా, సామాజిక స్థాయిలో ఈ విషయాలన్నింటిపై దృష్టి పెట్టడానికి సంఘం ప్రణాళికలు రూపొందించింది.

‘పంచ పరివర్తన్’ భావనను సామాన్య ప్రజానీకానికి ఎలా వివరించాలని ప్రతిపాదిస్తున్నారు, అక్కడ ఏ సవాళ్ళు ఎదురవుతాయి?

సమయం, ప‌రిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు, అదనపు జాగ్రత్త, కృషి, లోతైన ఆలోచన అవసరం. జాతీయభావాల వ్యాప్తికి ప్ర‌స్తుతం అనుకూలమైన సమయం కనిపిస్తోంది. అయితే, ఈ అనుకూలతను మ‌రింత పెంచే దిశ‌గా ప‌నిచేయాలి. పంచ పరివర్తన్‌ అంటే సమాజంలో సమ‌ర‌స‌తను సాధించాలనే పట్టుదల, పర్యావరణ అనుకూల జీవనశైలి, కుటుంబ విలువలను ప్రోత్సహించడానికి కుటుంబ ప్ర‌బోధన్, జీవితంలోని అన్ని అంశాలలో భారతీయ విలువలపై ఆధారపడిన ‘స్వ’ (స్వదేశీ) భావాన్ని పెంపొందించడం, పౌర విధులను పాటించడం కోసం సామాజిక మేల్కొలుపు వంటివి ఉన్నాయి. ఇవన్నీ సమాజానికి సంబంధించినవి. వీటిని విస్తృత సమాజంలోకి తీసుకెళ్లాలి. స్వీయ ఉదాహరణల ద్వారా మార్పు తీసుకురావడానికి కృషి చేయాలి. ఇది కేవలం ఆలోచన, విద్యాపరమైన చర్చకు సంబంధించిన అంశం కాదు. అలాగే ఈ విషయాలను సమాజంలో ప్రతిష్టిత వ్యక్తుల దృష్టికి కూడా తీసుకువెళ్లడం కోసం సమావేశాలు నిర్వహిస్తున్నాం.

ఈ సంవత్సరం ప్రతినిధి సభలో దేవి అహల్యాబాయి హోల్కర్ గురించి ప్రత్యేక ప్రస్తావన వచ్చింది. ఆమె 300వ జయంతి సంవత్సరానికి ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నారా?

శౌర్యం, శక్తికి ప్రతీక అయిన దేవి అహల్యాబాయి హోల్కర్ పేరు మన ఏకాత్మతా స్తోత్రంలో కనిపిస్తుంది. ఆమె చరిత్రను సరిగ్గా విశ్లేషిస్తే, ఆమె సమాజం, మతం, పాలన, పరిపాలన వంటి వివిధ రంగాలలో అనేక అద్భుతమైన కార్యాలను సాధించారు. ఆమె తృతీయ శతాబ్ది (300వ జయంతి) సందర్భంగా, సంఘం రెండు మూడు లక్ష్యాలను గుర్తించింది. సాధారణంగా హిందూ సమాజంలో, సమాజంలోని అణగారిన వర్గాలకు దేశ నిర్మాణానికి దోహదపడే అవకాశం లేదనే లోపభూయిష్టమైన అభిప్రాయం ఉంది. అలాగే స్త్రీల పట్ల కూడా సానుకూలమైన దృక్పథం ఏర్పడవలసి ఉంది. దేవి అహల్యాబాయి హోల్కర్ జీవితం అటువంటి లోపభూయిష్ట ఆలోచనలన్నింటికీ కచ్చితమైన సమాధానాన్ని అందిస్తుంది. తన భర్త అకాల మరణం తర్వాత కూడా రాజ్యపాలనను చేపట్టి ఒక ప్రభావవంతమైన ఉదాహరణను ముందుంచారు. ప్రస్తుత సమాజంలో మహిళల సాధికారత, భాగస్వామ్యం గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం కూడా, రాష్ట్ర సేవికా సమితి, ఇతర సంస్థల మహిళా సమన్వయ్‌లోని మా సోదరీమణులు దేశవ్యాప్తంగా 400 కి పైగా సమావేశాలను నిర్వహించి, ఐదు లక్షల మందికి పైగా మహిళలు అందులో పాల్గొనేలా కార్యక్రమాలను రూపొందించారు. ఈ దృష్ట్యా దేవి అహల్యాబాయి తృతీయ శ‌త జయంతి స్ఫూర్తితో ఆ కార్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉంది. సంఘ్ ద్వారా ప్రత్యేకంగా కార్యక్రమాలను నిర్వహించే బదులు, ఒక సమగ్ర ప్రణాళిక ప్రకారం ఉత్స‌వ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఇది ఇతర మహిళా సంస్థలు, ఇతర సమాజంలోని సభ్యులతో కలిసి వేడుకలను నిర్వహిస్తుంది. సాహిత్యం ప్రచురణతో సహా గొప్ప మహిళల వివిధ కోణాలపై ఉపన్యాసాలు, చర్చల కోసం ప్రణాళికలు ఉన్నాయి.

సంఘం పని క్రమంగా సాగుతోంది, దాంతో పాటు భారత్ పై, సంఘంపై వ్యతిరేక శక్తుల వ్యూహాలు కూడా పెరుగుతున్నాయి. ఈ సవాలును ఎదుర్కోవడానికి సంఘ ప్ర‌ణాళిక ఏమిటి?

ప్రత్యర్థులు సంఘ ఎదుగుదలను గుర్తిస్తున్నారు. కార్య విస్తరణ, సమాజపు భాగస్వామ్యం పెంచడం ద్వారా ప్రతికూల వ్యూహాలకు ప్రతిస్పందించాలని సంఘం సంకల్పించింది.

మీరు మళ్లీ సర్ కార్య‌వాహగా ఎన్నికయ్యారు. సంఘ నిరంకుశ సంస్థ అని చెప్పడానికి ఇది ఉదాహరణ అని విమర్శకులు అంటారు. సంఘంలో ఉన్న ప్రజాస్వామ్య విధానాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? 

సంఘ కార్యకలాపాలు పూర్తి పారదర్శకంగా, బహిరంగంగా జరుగుతున్నప్పుడు ఇది రహస్య, నిరంకుశ సంస్థ అని ఎందుకు ఆరోపిస్తున్నారో నాకు అర్థం కాలేదు. సంఘ శాఖలో ఎవ‌రైనా పాల్గొనవచ్చు. పూర్వ సర్ సంఘ‌చాల‌క్ పూజనీయ బాలాసాహెబ్ దేవరస్ జీ ఒకసారి ఇలా అన్నారు- “సంఘ్‌లో అత్యున్నతమైన పూజ‌నీయ స‌ర్ సంఘ‌చాల‌క్ జీని ఒక సాధారణ స్వయంసేవక్ కూడా ఏదైనా విషయాన్ని గురించి ప్రశ్నించవచ్చును. సర్ సంఘ‌చాల‌క్ జీ స్వయంగా సమాధానం చెబుతారు”. సంఘ్‌లో మనకు కనిపించే ప్రజాస్వామ్యం ఇదే. బహుశా మరే ఇతర సంస్థలోనూ ఇలా ఉండదు. అందుకే విమర్శకులు ఇలాంటి నిరాధార ఆరోపణలు ఎందుకు చేస్తారో నాకు అర్థంకాదు. సంఘం అనేది కుటుంబ వాతావరణంతో కూడిన సంస్థ. ఇక్కడ అన్ని స్థాయిల్లో, అన్ని నిర్ణయాలు తగిన చర్చ, ఏకాభిప్రాయసాధన ద్వారానే తీసుకుంటారు.

దేశంలో త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ప్రజాస్వామ్య వేడుకలను మనం ఎలా చూడాలి? స్వయంసేవకులు, అలాగే సమాజానికి మీరు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు?

ప్ర‌తినిధి స‌భ‌ నివేదికలో ఈ అంశాన్ని ప్రస్తావించాను. ముగింపు స‌మావేశంలో పూజ‌నీయ స‌ర్ సంఘ‌చాల‌క్ జీ త‌న ప్ర‌సంగంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి పౌరుని కర్తవ్యాన్ని గురించి వివ‌రించారు. పంచ పరివర్తన్ లో ఇది కూడా చేర్చబడింది. ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. 100% ఓటింగ్ శాతం ఉండేలా మనం కృషి చేయాలి. ఆయా ప్రాంతాల్లో పని చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమే ఆర్‌.ఎస్‌.ఎస్ లక్ష్యం. అటువంటి సమయాల్లో, జాతీయ సమస్యలను సమాజం ముందుకు తీసుకురావాలి. సామాజిక సంక్షేమం, జాతీయ ఐక్యత, భారతదేశ సంక్షేమంపై చర్చలు జరగాలి. ఇలాంటి అంశాలను విశదీకరించి, అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాలి. అందుకే దీన్ని లోక్‌-మత్‌-పరిష్కార్‌ (ప్రజాభిప్రాయాన్ని ఏర్పరచడం) అని పిలుస్తాం. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ లోక్-మత్-పరిష్కర్ కోసం పట్టుబట్టారు. ఏడాది పొడవునా ఈ పని కొనసాగించాల్సి ఉన్నా, ఎన్నికల స‌మ‌యంలో దీనికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలి.

ఆర్‌.ఎస్‌.ఎస్ తన పనిలో ముందుకు సాగుతుందనడంలో సందేహం లేదు. ఈ పని తదుపరి దశ ఏమిటి?

ఆర్‌.ఎస్‌.ఎస్ చక్కని సంస్థాగత నిర్మాణాన్ని కలిగి ఉంది. కార్యకర్తలు ఈ సంస్థాగత నిర్మాణంలో పని చేస్తారు. అయితే, సంఘ ఒక జాతీయ ఉద్యమం. అందువల్ల, సమాజంలోని అన్ని వర్గాలను ఏకతాటిపైకి తీసుకురావడానికి, సమాజంలోని నీతివంతమైన ఆత్మను మేల్కొల్పడానికి, సమీకరించడానికి, తద్వారా సమగ్ర సామాజిక మార్పును తీసుకురావడానికి కృషి చేయడం అవసరం. సమాజంలో కులాల ఆధారంగా చీలికలు ఉండకూడదు. సమాజంలోని ప్రతి వర్గంలో జాతీయతా భావం వ్యాపింపజేయాలి. సంఘ ఒక బలమైన జాతీయ ఉద్యమంగా మారాలి. ప్రజలలో అవగాహన పెంచుతూ మార్పు కోసం కృషి చేయాలి. అందువల్ల, సంఘం కేవలం ఒక సంస్థగా పరిమితం కాదని, సమాజాన్ని వ్యవస్థీకృతం చేయడానికి కృషి చేస్తుందని చెపుతాము. కాబట్టి సంఘానికి, సమాజానికి మధ్య విభజన రేఖ ఉండదు, ఉండకూడదు. ఈ దృక్కోణం నుండి, సమాజంలోని సకారాత్మక, ధర్మబద్ధమైన శక్తులను ఉత్తేజపరిచే జాతీయవాద స్ఫూర్తిని గ్రహించి, జాతీయ పునరుజ్జీవనం కోసం ఈ ఉద్యమంలో పాల్గొనాలి. దీనిని సంఘ దృష్టి లేదా సంఘ తదుపరి దశగా పేర్కొనవచ్చు.