
ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉందని, జిఎస్‌టి, ఆదాయ పన్ను రిటర్న్ పోర్టల్స్ రెండింటిలో లోపాల కారణంగా, పన్ను చెల్లింపుదారులకు దేశ ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం దెబ్బతిన్నదంటూ పాంచజన్య వారపత్రిక ప్రచురించిన కథనంతో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కు ఎలాంటి సంబంధం లేదని, అది పూర్తిగా వ్యాస రచయిత వ్యక్తిగత అభిప్రాయమని ఆర్ ఎస్ ఎస్ అఖిల భారత ప్రచార ప్రముఖ్ శ్రీ సునీల్ అంబేకర్ స్పష్టం చేశారు. ఢిల్లీ నుండి వెలువడే పాంచజన్య వారపత్రిక `ఆర్ ఎస్ ఎస్ అనుబంధ వారపత్రిక’ కాదని కూడా ఆయన స్పష్టం చేశారు.
భారతదేశాభివృద్ధిలో ఇన్ఫోసిస్ పాత్ర ఎంతో ఉన్నదని, ఆ కంపెనీ రూపొందించిన పోర్టల్ లకు సంబంధించి కొన్ని సమస్యలు ఉండవచ్చని, పాంచజన్య వ్యాసంలో వ్యక్తం చేసిన అభిప్రాయాలు పూర్తిగా ఆ వ్యాస రచయితవేనని ఆయన ఒక ట్వీట్ లో పేర్కొన్నారు. అలాగే పాంచజన్య పత్రిక ఆర్ ఎస్ ఎస్ అధికారిక, అనుబంధ పత్రిక కాదని, అందువల్ల ఈ వ్యాసంలోని వ్యాఖ్యలు, అభిప్రాయాలను ఆర్ ఎస్ ఎస్ కు ఆపాదించకూడదని ఆయన స్పష్టం చేశారు.
తాజా ఎడిషన్‌లో, పాంచజన్య ఇన్ఫోసిస్ ‘సాఖ్ ఔర్ అఘాత్’ (ఖ్యాతి, నష్టం) పై నాలుగు పేజీల ముఖపత్ర కధనాన్ని దాని వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి చిత్రంతో ప్రచురించింది.
भारतीय कंपनी के नाते इंफोसिस का भारत की उन्नति में महत्वपूर्ण योगदान है।इंफोसिस संचालित पोर्टल को लेकर कुछ मुद्दे हो सकते हैं परंतु पान्चजन्य में इस संदर्भ में प्रकाशित लेख,लेखक के अपने व्यक्तिगत विचार हैं,तथा पांचजन्य संघ का मुखपत्र नहीं है।@editorvskbharat
— Sunil Ambekar (@SunilAmbekarM) September 5, 2021