Home Telugu Articles ప్లాస్టిక్‌ నియంత్రణ అందరి బాధ్యత

ప్లాస్టిక్‌ నియంత్రణ అందరి బాధ్యత

జూన్‌ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రత్యేకం

0
SHARE

ప్రస్తుత ప్రపంచంలో ప్లాస్టిక్‌ వినియోగాన్ని విస్మరించలేం. అది మన జీవితంలో ఒక భాగంగా స్థిరపడింది. వాణిజ్యపరంగా భారతదేశంలో ప్లాస్టిక్‌ రంగానికి చాలా భవిష్యత్తు ఉంది. కాని పర్యావరణ రీత్యా తగు జాగ్రత్తలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. ప్లాస్టిక్‌ అవసరాన్ని గుర్తిస్తూనే మనం దాన్ని నియంత్రించినప్పుడు మాత్రమే ఈ అందమైన పర్యావరణాన్ని ముందు తరాల వాళ్ళకు బాధ్యతగా అందించగలుగుతాం.

వాణిజ్య అవసరాల కోసం ప్లాస్టిక్‌ను కీలకంగా ఆటోమొబైల్‌, నిర్మాణ రంగం, ఎలక్ట్రానిక్స్‌ , ఆరోగ్య, టెక్స్‌స్టైల్‌, వ్యవసాయ, ఆహార ఉత్పత్తుల ప్యాకేజింగ్‌ పరిశ్రమలలో వినియోగిస్తున్నారు. మన దేశంలో ప్లాస్టిక్‌ వినియోగం మిగతా దేశాలతో పోలిస్తే చాలా తక్కువ. అమెరికాలో ఒక వ్యక్తి తలసరి వినియోగం 109 కిలోలు, యూరప్‌లో  65 కిలోలు, చైనాలో 45 కిలోలు, బ్రెజిల్‌లో 32 కిలోలు ఉంటే మనదేశంలో మాత్రం 9.7 కిలోలు మాత్రమే.

భారతదేశంలో పశ్చిమ ప్రాంతంలో 47 శాతం, ఉత్తర ప్రాంతంలో 23 శాతం, దక్షిణ ప్రాంతంలో 21 శాతం ప్లాస్టిక్‌ వినియోగం ఉంటే తక్కువగా 9 శాతం మాత్రమే తూర్పు భారతదేశంలో ఉన్నది.

ప్లాస్టిక్‌ అనేది ఒక పెట్రో రసాయన పదార్థం. మన దేశంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ , హల్దియా పెట్రో కెమికల్స్‌, ఇండియన్‌ ఆయిల్‌, గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (గెయిల్‌), హెచ్‌.పి.సి.ఎల్‌, కేమప్లాస్ట్‌ సన్మార్‌, ఫినోలెక్స్‌, సుప్రీం లాంటి సంస్థలు అతి పెద్ద, ప్రధాన ప్లాస్టిక్‌ ఉత్పత్తిదారులు.

పరిశ్రమ

వ్యర్థ పదార్థాలలో ఒక భాగమైన ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణ అనేది ఒక పెద్ద పరిశ్రమగా రూపాంతరం చెందింది. ప్రతి చిన్న, పెద్ద పట్టణాలు దానికి తగిన ప్రాముఖ్యం ఇస్తున్నాయి. ప్రభుత్వ అంచనాల ప్రకారం, దేశంలోని 60 నగరాలలో సరాసరి రోజుకు 15,342 టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు బయటికి పడేస్తున్నాం. అందులో కేవలం 9250 టన్నుల వరకు మాత్రమే తిరిగి రీసైక్లింగ్‌ చేస్తున్నాం.  ఇది ఒక విధంగా ప్రమాదకర హెచ్చరిక లాంటిది. దాదాపు 90 శాతం వరకు ఉన్న ప్లాస్టిక్‌ చెత్తను తిరిగి ఉపయోగించుకునే వీలు ఉన్నపుడు ఒక దేశ పౌరునిగా మన వంతు బాధ్యతగా ప్లాస్టిక్‌ను తిరిగి రీసైక్లింగ్‌ ద్వారా వినియోగించడంపై మనవంతు సహకారాన్ని అందించవలసి అవసరం ఉన్నది. ప్లాస్టిక్‌ వినియోగాన్ని నియంత్రించడమే కాకుండా, ప్లాస్టిక్‌ వ్యర్థాలను తిరిగి రీసైక్లింగ్‌ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది.

గ్రామాల్లో ప్లాస్టిక్‌ వినియోగం 

ప్లాస్టిక్‌ వినియోగం పల్లె ప్రాంతాల్లో వ్యవసాయ అనుబంధ పనిముట్ల రూపంలో వినియోగిస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాలలో వ్యవసాయానికి సహజమైన పిల్ల కాలువల ద్వారా కాకుండా మల్చింగ్‌ విధానం, పాలి హౌస్‌ వ్యవసాయం, డ్రిప్‌ ఇరిగేషన్‌ అంటూ ప్లాస్టిక్‌ పైపుల ద్వారా నీటిని పంపిస్తూ ప్లాస్టిక్‌ వినియోగాన్ని పెంచుకుంటూ పోతున్నారు. కాని వీటిపై కొంత తర్కబద్ధంగా ఆలోచిస్తే జరిగే నష్టాన్ని మనం నివారించవచ్చు.

మల్చింగ్‌ విధానం, డ్రిప్‌ ఇరిగేషన్‌ విధానాలలో మొక్క ఎక్కడ ఉందో అక్కడే నీటిని అందిస్తారు. ఇది వర్షాభావం ఉండే దేశాలలో అయితే బాగుంటుంది. కాని, సమద్ధిగా వర్షపాతానికి అనుకూలమైన మన దేశంలో ఎంత వరకు అవసరం అనేది ఆలోచించకుండా విదేశాలలో వాడుతున్నారు కాబట్టి, మనం కూడా ఉపయోగించాలి అంటే అది సంతప్తికరమైనది కాదు. ఒక 50 సంవత్సరాల క్రితం వరకు సమద్ధిగా ఉన్న వర్షాలు ఎందుకు తగ్గాయి? ఉన్న నీటిని ఎందుకు సద్వినియోగపరచుకోవటం లేదు? అని ఆలోచించకుండా, ప్లాస్టిక్‌ వినియోగం ద్వారా పర్యావరణానికి హాని తలపెడుతున్నాం. దానికి ప్రతిఫలం సహజమైన ప్రకతితో మమేకమైన మన జీవన విధానానికి ఒక్కొక్క అడుగు మనకు తెలియకుండానే దూరమవటం.

గ్రామాలలో ప్లాస్టిక్‌ వస్తువులను గుర్తించి సేకరించడం అనేది చాలా తక్కువ. రోజు వారి వినియోగంలో ఉండే ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగ్స్‌, లేదా కాలం చెల్లిన ప్లాస్టిక్‌ పైపులు ఎక్కడ పడితే అక్కడ పారేస్తూ ఉంటాం. ఇది తాత్కాలికంగా అనగా ఒక 4-5 సంవత్సరాల వరకు బాగానే ఉండవచ్చు కాని, ఆ తరువాత ఆ ప్లాస్టిక్‌ని మనం అక్కడే వదిలి పెట్టడం వలన ఆ ప్రాంతం పూర్తిగా బీడుపోయి, ఆ పంటభూమికి జరిగే నష్టాన్ని రైతు గుర్తించేలోపే జరిగిన నష్టాన్ని అనుభవించాల్సి రావచ్చు. దానికి కారణం గ్రామ పంచాయితి స్థాయిలో రీసైక్లింగ్‌పై చాలా తక్కువ అవగాహన ఉండడం, ప్రభుత్వం కూడా దీనిపై తగిన స్థాయిలో దష్టి పెట్టకపోవడం. కాబట్టి ఈ విషయాన్ని ఎవరికి వారు గుర్తించి ప్లాస్టిక్‌వ్యర్థాలు సేకరించే దిశగా ఆలోచిస్తే రీసైక్లింగ్‌ చేసే అవకాశం చాలా వరకు సులభం అవుతుంది. దానితో పాటు ప్రజలలో అవగాహన స్థాయి పెరిగి ప్లాస్టిక్‌ వినియోగాన్ని ఒక మండల స్థాయిలో లెక్కించే అవకాశం ఉంటుంది. దాంతో అవసరాలకు అనుగుణంగా పర్యావరణ సమతుల్యతను కాపాడుకుంటూ ప్రతి చిన్న, పెద్ద గ్రామ, మండల స్థాయిలో ప్లాసిక్‌ను నియంత్రించే అవకాశం ఉంటుంది.

పట్టణాలు – మహా నగరాలు

పట్టణాలలో ఎక్కువగా గహ అవసరాల కోసం, తక్కువ ఖర్చు అనే పేరుతో ప్రజలు ప్లాస్టిక్‌పై ఆధారపడుతున్నారు. కాని ఆ ప్లాస్టిక్‌ ఎంతవరకు అవసరం అనేది పూర్తిగా మర్చిపోతున్నారు. మహా నగరాలలో ఉన్న నివాస ప్రాంతాలలో మునిసిపాలిటి వాళ్ళు చెత్తను సేకరిస్తున్నారు కాని, ప్రత్యేకంగా ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించి విభజించే పద్ధతి లేదు. కేవలం కొంత మంది మాత్రమే తమ జీవనోపాధి కోసం ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించే విధానాలు లేవు.

వాణిజ్యపరంగా చూస్తే పైపులు, ట్యూబ్స్‌, గహోపకరణలు, రాసే పరికరాలు, ఆప్టికల్‌ ఫైబరు, పాకేజింగ్‌, ఆహార వస్తువులు నిలువ చేయడానికి ప్లాస్టిక్‌ వాడుతున్నారు. ఇందులో  కొన్ని రంగాలలో ఇది కీలకం. కాని ప్రతిదానికి ప్లాస్టిక్‌ వినియోగం అవసరం లేదు. పరిశ్రమలలో ప్రభుత్వం రూపొందించిన చట్టాల ప్రకారం ప్లాస్టిక్‌ వినియోగం, వితరణ సక్రమంగా ఉంటే 100 శాతం ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్‌ చేసే అవకాశం ఉంటుంది.

అవగాహన కల్పించాలి

ఇటీవల పట్టణాలలో చెత్త కుండీలను తీసేసి ఇంటింటికి తడి పొడి చెత్తను సేకరించే విధానాన్ని ప్రవేశ పెట్టారు. కాని అందులో ముఖ్యమైన ప్లాస్టిక్‌ చెత్తను కూడా ఇంటిలోనే విభజిస్తే, ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌కు ఎక్కవ అవకాశం ఉంటుంది. ఒక ప్రణాళికబద్ధంగా ప్లాస్టిక్‌ను సేకరించే అవకాశం ఏర్పడుతుంది.  పట్టణాలలో ఒక ప్రాంతాన్ని ఒక డంపింగ్‌ యార్డ్‌ (చెత్త ప్రదేశం) గా గుర్తించి అక్కడ గృహవ్యర్థాలను పడవేస్తున్నారు. అది ఎక్కువగా పేరుకుపోయిన తర్వాత కాల్చేస్తున్నారు. అవకాశం ఉన్న చోట్ల మాత్రం రీసైక్లింగ్‌ యూనిట్‌కి పంపి తిరిగి కొన్ని పదార్థాల రూపంలో వినియోగిస్తున్నారు. ఈ పద్ధతి వలన పర్యావరణానికి దీర్ఘకాలికంగా ఏమైనా హాని ఉంటుందా అనే విషయంపై ప్రజలలో అవగాహన కల్పించాలి.

నియంత్రణ కావాలి

మనం వాహనాన్ని ఎంత వేగంగానైనా నడపవచ్చు, కాని దాన్ని నియంత్రించడం తెలియకపోతే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అదే విధంగా ప్లాస్టిక్‌ వినియోగం కూడా. ప్రతి మనిషి విచ్చలవిడిగా ప్లాస్టిక్‌ వినియోగించి, ప్రభుత్వాలు మాత్రమే వాటిని నియంత్రించాలి అంటే అది సహేతుకం కాదు. సమాజంలో మనం కూడా ఒక భాగమే. ఒక విధంగా మనమే ఒక సమాజం అనే స్పహతో ఉండాలి.

ఇంట్లో ప్లాస్టిక్‌ను నియంత్రించడం ఎలా?

ముఖ్యంగా గహోపకరణ వస్తువులలో ప్లాస్టిక్‌ను నియంత్రించవచ్చు. పిల్లల ఆట వస్తువులలో రూపంలో ప్లాస్టిక్‌ ఒక మహాభూతంలా ఉంది. చెక్క స్థానంలో ప్రతి వస్తువును ప్లాస్టిక్‌ ఆక్రమించింది. వీటిని పూర్తిగా నియంత్రించడం తల్లిదండ్రుల చేతుల్లో ఉంది. కేవల కొన్ని గంటల వ్యవధిలోనే ప్లాస్టిక్‌ ఆట వస్తువులు పాడవుతాయి. ఆ తర్వాత వాటిని బయట పడవేస్తారు. వంట గదిలో వంటకు సంబంధించిన ఏవస్తువునైనా నిల్వ చేయడానికి పూర్వకాలంలో పర్యవరణానికి ఎలాంటి హాని తలపెట్టని జాడీలు ఉపయోగించేవారు. కాని ఇప్పుడు వాటి స్థానంలో ప్లాస్టిక్‌ డబ్బాలు ఆక్రమించాయి. గృహంలో ఉపయోగించే వంటపాత్రలు, చెంబులు, గిన్నెలు వగైరాలు రాగి, ఇత్తడి, స్టీల్‌ లోహాలతో ఉండేవి. వాటి స్థానంలోనూ ప్లాస్టిక్‌ వచ్చింది. అలంకరణ వస్తువులు, ప్లాస్టిక్‌ కుర్చీలు, టేబుళ్లు, ఇంటి గుమ్మం ముందు, ఇంటి లోపల వాడే దాదాపు చాలా పరికరాలపై దష్టి పెడితే చాలా వరకు ప్రజలే స్వచ్ఛందంగా ప్లాస్టిక్‌ను నియంత్రించవచ్చు. కేవలం క్యారీ బ్యాగులు నియంత్రిస్తే చాలు అనుకోకూడదు.

ప్రకృతి – పర్యావరణం – హిందుత్వం

ప్రపంచానికి ఆదర్శవంతమైనది హిందూ జీవన విధానం అని, ప్రకతి, పర్యావరణాన్ని దేవుని స్వరూపంగా భావించే మనమే అవసరం లేని చోట కూడా ప్లాస్టిక్‌ను వినియోగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించుకుంటూ సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్‌ను నియంత్రించాలి.

ప్రస్తుత ప్రపంచంలో ప్లాస్టిక్‌ వినియోగాన్ని విస్మరించలేం. అది మన జీవితంలో ఒక భాగంగా స్థిరపడింది. వాణిజ్యపరంగా భారతదేశంలో ప్లాస్టిక్‌ రంగానికి చాలా భవిష్యత్తు ఉంది. కాని పర్యావరణ రీత్యా తగు జాగ్రత్తలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. ప్లాస్టిక్‌ అవసరాన్ని గుర్తిస్తూనే మనం దాన్ని నియంత్రించినప్పుడు మాత్రమే ఈ అందమైన పర్యావరణాన్ని ముందు తరాల వాళ్ళకు బాధ్యతగా అందించగలుగుతాం.

ఇంటి బయట ప్లాస్టిక్‌ను నియంత్రించడం

ఈ కాలంలో ప్రతి వస్తువు ప్యాకింగ్‌ ప్లాస్టిక్‌తో చేసి ఉంటుంది, ఆ వస్తువును ఉపయోగించిన తర్వాత ప్లాస్టిక్‌ ప్యాకింగ్‌ను రోడ్డు పక్కనే పడేస్తున్నాం. ఇలా రోజుకు దేశంలో ఎన్ని ప్లాస్టిక్‌ బాటిళ్ళు, ఎన్ని ప్లాస్టిక్‌ పేపర్లు రోడ్డున పడేస్తున్నాం. వాటిలో ఎంత శాతం రీసైక్లింగ్‌కు వెళుతున్నాయి?

రాజకీయ వ్యవస్థలో భాగంగా ప్రతి ఇంటిని, ప్రతి ప్రాంతాన్ని గ్రామ పంచాయతి వ్యవస్థ కిందికి, గ్రామాలలో పట్టణాలలో పరిపాలన సౌలభ్యం కోసం వార్డులుగా విభజించారు. కానీ అదే దష్టితో ప్లాస్టిక్‌ సేకరించే కేంద్రాలను ఏర్పాటు చేస్తే బాగుంటుంది. జనాభాకు తగినట్టు ప్లాస్టిక్‌ సేకరణ కేంద్రాలు ఉంటే ప్లాస్టిక్‌ నియంత్రించవచ్చు. ప్రతి ఒక్కరూ విధిగా ప్లాస్టిక్‌ వ్యర్థాలను అక్కడికి చేరవేస్తే ప్లాస్టిక్‌ను నియంత్రించగలం.

భారత ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్‌ లాంటి కార్యక్రమం ద్వారా గూడా ప్టాస్టిక్‌ వినియోగంపై అవగాహన కల్పించడం ముదావహం.

దేశంలోని 60 నగరాలలో సరాసరి రోజుకు మనం 15,342 టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు బయట పడేస్తున్నాం, అందులో కేవలం 9250 టన్నుల వరకు మాత్రమే తిరిగి రీసైక్లింగ్‌  చేస్తున్నాం.  కాని 6000 టన్నుల పైగా ప్లాస్టిక్‌ను పూర్తిగా చెత్త రూపంలో వదిలి పెడుతున్నాము. ఇది ఒక విధంగా ప్రమాదకర హెచ్చరిక లాంటిది. కాబట్టి దీనిపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఆలోచించి తగిన చర్యలు తీసుకొని దేశాన్ని ప్లాస్టిక్‌ రహిత దేశంగా చేయడమే మన లక్ష్యం కావాలి.

– కుంటి సురేందర్‌

  (ఈ వ్యాసం మొదట 7 జూన్ 2017 నాడు ప్రచురితమైంది)