Home Telugu Articles ప్రమాదం అంచున పంజాబ్

ప్రమాదం అంచున పంజాబ్

0
SHARE

కొన్ని సమస్యలు రావణ కాష్ఠాలు. సమసినట్టే కనిపించినా లోలోపల రగులుతుంటాయి. ఓ గాలి వీచినప్పుడో, ఒక ఎండు పుల్ల తగిలినప్పుడో మళ్లీ రాజుకుంటాయి. పంజాబ్‌లో ఖాలిస్థానీ ఉగ్రవాదం అలాంటిదే. పాకిస్తాన్ పన్నిన కె కె 2 పన్నాగంలో ఒక కె కశ్మీర్ అయితే రెండోది ఖలిస్తాన్. ఎనభైయవ దశకంలో ముందు ఖలిస్తాన్ దావాగ్నిని పాకిస్తాన్ రగిలించింది. సరిగ్గా నాలుగైదేళ్ల తరువాత కశ్మీర్ బడబాగ్ని రగిలింది. సూపర్ పోలీస్ అధికారి కే పీ ఎస్ గిల్ సాహసోపేత నేతృత్వం వల్ల, దివంగత ముఖ్యమంత్రి బేఅంత్ సింగ్ దృఢసంకల్పం వల్ల ఖలిస్తానీలను పూర్తిగా అణచివేశారు.

కానీ గత కొన్ని సంవత్సరాలుగా పంజాబ్‌లో మళ్లీ ఖలిస్తానీ అగ్గి రగులుతోంది. మళ్లీ ఖలిస్తాన్ పేరిట, ఖలిస్తానీ ఉద్యమ నేత జ్నల్ సింగ్ భింద్రావాలా చిత్రాలతో టీషర్టులు, స్కార్ఫ్‌లు బాహాటంగా బజార్లో అమ్ముతున్నారు. పోలీసుల చేతిలో హతమైన ఉగ్రవాదుల వర్ధంతులు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఖలిస్తానీ సమర్థక క్యాసెట్లు నడిరోడ్డు మీద బాహాటంగా వినిపిస్తున్నాయి. గురు వాణి వినిపించాల్సిన పవిత్ర గురుద్వారాల్లో వేర్పాటు వాణి విచ్చల విడిగా మళ్లీ వినిపిస్తోంది. ఇంకో వైపు సరిహద్దులో మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ యథేఛ్ఛగా కొనసాగుతోంది. దశాబ్దాలుగా కష్టించి కూర్చిన ప్రశాంతి మళ్లీ అశాంతిగా మారే సూచనలు కానవస్తున్నాయి.

ఖలిస్తానీ ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు భారత్  భారీ మూల్యాన్నే చెల్లించాల్సి వచ్చింది. 1980- మధ్య కాలంలో దాదాపు 11694 మంది సాధారణ పౌరులు, 1784 మంది భద్రతా సిబ్బంది ఉగ్రవాదానికి పంజాబ్‌లో బలయ్యారు. భద్రతా దళాలు 8000 కు పైబడి ఉగ్రవాదులను హతమార్చారు. దాదాపు రెండు దశాబ్దాలు కొనసాగిన ఈ ఉగ్రవాదం పంజాబ్‌ను యాబై సంవత్సారాలు వెనక్కు నెట్టింది. ఇప్పడు మళ్లీ ఉగ్రవాద భూతం జడలు విప్పుకోవడం ఆందోళనకరమైన విషయం.

ఇటీవల ఇండో పసిఫిక్ క్షేత్రంలో ఎదురవుతున్న సవాళ్లపై ఒకానొక కీలక సమావేశంలో ప్రసంగించిన సేనాధ్యక్షుడు బిపిన్ రావత్ మళ్లీ ఖలిస్తానీ ఉగ్రవాదం పెచ్చరిల్లే సూచనలు కానవస్తున్నాయని వ్యాఖ్యానించడం ఈ సందర్భంగా గమనార్హం. నిజానికి ఖలిస్తానీ వేర్పాటువాదానికి అసలైన ఊతం కెనడా, యూరప్, అమెరికాల్లో ఉంది. ప్రవాసీ సిక్కులు ఎక్కువగా నివసించే ఇంగ్లండ్, కెనడాల్లో వోట్ల కోసం కొన్ని స్థానిక పార్టీలు కూడా ఖలిస్తానీ శక్తులతో చెట్టపట్టాలు వేసుకుంటున్నాయి. ప్రస్తుత కెనడా ప్రభుత్వంలో ఖలిస్తానీ సానుభూతిపరులు ఉన్నారన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నారు.

బబ్బర్ ఖాల్సా ఇంటర్నేషనల్, ఖాలిస్తాన్ జందాబాద్ ఫోర్స్, ఆలిండియా సిఖ్ యూత్ ఫెడరేషన్ వంటి సంస్థలు కెనడా, ఇంగ్లండ్ లో అత్యంత క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. వీటితో పాటు మరో ఎనిమిది ఉగ్రవాద సంస్థలు విదేశాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. సిఖ్ ఫర్ జస్టిస్ అనే ముసుగు సంస్థ ఒకటి విదేశాల్లో పనిచేస్తోంది. ఈ సంస్థ సిక్కుల మానవ హక్కుల గురించి మాట్లాడుతూ, సదస్సులు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున విదేశాల్లో మద్దతును కూడాగడుతోంది. ఈ సంస్థకు పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ ఐ దన్నుగా నిలుస్తోంది.

గత ఆగస్టు నెలలో భారత ప్రధాని నరేంద్ర మోడీ లండన్ లో పర్యటిస్తున్న సందర్భంగా మన జాతీయ జెండాను తగులబెట్టి ఖలిస్తానీ నినాదాలు చేసిన వారంతా ఈ సిఖ్ ఫర్ జస్టిస్ సంస్థ మద్దతుదారులేనన్నది ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. ప్రవాసీ సిక్కులను ప్రభావితం చేయడమే లక్ష్యంగా ఈ సంస్థ పనిచేస్తోంది. ఈ సంస్థ ఛత్రఛాయల్లో పనిచేసే ఉగ్రవాద సంస్థ ఖాలిస్తాన్ గదర్ ఫోర్స్ కీలక అరాచకవాది షబ్నమ్ దీప్ సింగ్ ఇటీవలే మన గూఢచారి సంస్థల చేజిక్కాడు. ఆయన వెల్లడించిన వివరాలు నెమ్మదినెమ్మదిగా విదేశాల్లోని విచ్ఛిన్న వాదులు పంజాబ్ నేలపై మళ్లీ ఖలిస్తానీ గంజాయి సాగు మొదలు పెట్టారని రూఢిచేశాయి.

మరో వైపు పాకిస్తాన్ కూడా పంజాబ్ లో విచ్ఛిన్నకర శక్తులను ప్రోత్సహిస్తోంది. యూరప్, అమెరికా, కెనడాల్లో ఉన్న సిక్కు సముదాయాలను ప్రభావితం చేయడం ద్వారా పంజాబ్ లో  ఎజెండాను నిర్ధారించేందుకు ఐ ఎస్ ఐ ప్రయత్నాలు సాగిస్తోంది. పాశ్చాత్య దేశాల్లోని మానవ హక్కులు, స్వేచ్ఛ, స్రజాస్వామ్యం వంటి సౌలభ్యాల చాటున ఈ శక్తులు విచ్చలవిడిగా విషవమనం చేస్తున్నాయి. వీటిపై చర్యలు తీసుకునే విషయంలోనూ అయా దేశాల ప్రభువ్వాలు ఉదాసీన వైఖరిని అవలంబిస్తున్నాయి.

పంజాబ్ రాష్ట్రంలోనూ అకాలీ నేతలు ఖలిస్తానీలపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఇచ్చగించలేదు. ఈ విషయంలో మిత్రపక్షం బీజేపీ వారితో తీవ్రంగా పోరాడింది. ఇరు పార్టీల మధ్య విభేదాలు సైతం పొడసూపాయి. ఒకనానొక దశలో స్థానిక బీజేపీ నేతలు అకాలీలకు విడాకులివ్వాలని గట్టిగా భావించారు. కాంగ్రెస్ నేత అమరీందర్ సింగ్ ఉగ్రవాదం విషయంలో రాజీలేని ధోరణిని అవలంభిస్తున్నానని చెబుతున్నా, స్థానికంగా అధికార పక్షనేతలు ఉగ్రవాద శక్తులతో మిలాఖత్ అవుతున్నారన్నది వాస్తవం.

ఈ నేపథ్యంలో పంజాబ్ లో ప్రమాద సంకేతాలను ముందస్తుగా గుర్తించి, ఉగ్రవాద రక్కసి మొక్కను వేళ్లతో సహా పీకేయాల్సిన అవసరం ఉంది. ఈ దిశలో మోడీ ప్రభుత్వం, పంజాబ్ లోని అమరీందర్ ప్రభుత్వం, వివిధ భద్రతా విభాగాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కు పంజాబ్ విషయంలో అపారమైన అనుభవం ఉంది. ఆపరేషన్ బ్లూస్టార్ సమయంలో ఆయన ఒక మామూలు రిక్షావాలా రూపంలో స్వర్ణ మందిరంలో ఉండి సమాచారాన్ని సేకరించారు. భింద్రావాలా, మేజర్ సుభ్ బేగ్ సింగ్ వంటి ఉగ్రవాదులను మారువేషంలో పలుమార్లు కలుసుకున్నారు కూడా. అలాంటి నేపథ్యం ఉన్న అజిత్ దోవాల్, నరేంద్ర మోడీలు ఖలిస్తానీ ఉగ్రవాదం పెచ్చరిల్లకుండా సమయం ఉండగానే చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం.

Source: Vijaya Kranthi Editorial