Home News పూంఛ్‌ రక్షకుడు ప్రీతమ్‌సింగ్‌

పూంఛ్‌ రక్షకుడు ప్రీతమ్‌సింగ్‌

0
SHARE

చిడియానూ బాజ్‌ బనావూ బిల్లీ నూ షేర్‌ లడావూ
సవాలాఖ్‌ సే ఏక్‌ లడావూ తబే గోవింద్‌ గురు నామ్‌ మెరా

పిచ్చుకలను గండభేరుండాలుగా మారుస్తాను. పిల్లుల్ని పులులుగా చేస్తాను. సవాలక్ష మందితో ఒక్కడే పోరాడేలా చేస్తాను. అప్పుడే నేను గురుగోవింద సింహుడిని.. సిక్కుల పదవ గురువు గురుగోవిందసింగ్‌ చమ్‌కౌర్‌ సాహెబ్‌లో ఈ మాటలు నింపి, గుప్పెడు మంది సిక్కులతో సువిశాల మొగల్‌ సేనను పచ్చడి చేశాడు. ఆ తరువాత ఆయన దీనా అనే గ్రామానికి వస్తాడు. వీర గురుగోవిందుడు పాదం మోపిన పవిత్ర గ్రామం నుంచి వచ్చాడు మన కథానాయకుడు.

సవాలక్ష మంది శత్రువులతో పోరాడే తత్వం అతనిది. అక్టోబర్‌ 30, 1947న సెలవులో ఉన్నా పరుగుపరుగున ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌కి వచ్చాడతను. ‘నా సెలవు రద్దు చేసుకుంటాను. నేను కూడా యుద్ధంలో పాల్గొంటాను’ అన్నాడు. సాయంత్రం అయిదింటికి వచ్చాడు. అయిదున్నరకి 1 పారా బెటాలియన్‌కి అతడిని పంపించారు. మరుసటి ఉదయం 5.30కి శ్రీనగర్‌లో దిగాడు. ఆయనతో పాటు విహారానికి వచ్చిన భార్యను నువ్వు డెహ్రాడూన్‌కి వెళ్లమని చెప్పి పంపేశాడు.

నవంబర్‌ 21 నాటికి ఆయన పూంఛ్‌ పట్టణంలో తన దళంతో దిగాడు. అప్పటికి పూంఛ్‌ పట్టణం నలు వైపులా శత్రువుల ముట్టడిలో ఉంది. ప్రజలు ఆకలితో అలమటించిపోతున్నారు. ఒకరా.. ఇద్దరా.. ఏకంగా నలభై వేల మంది. కోట్లీ, మీర్‌పూర్‌లలోని హిందువులను ఊచకోత కోసినట్టే తమనూ కోసేస్తారన్న భయం వారిలో స్పష్టంగా కనిపించింది. జమ్మూ కశ్మీర్‌ సైన్యానికి చెందిన సైనికులు తిరోగమనం చేసేందుకు సిద్ధాంగా ఉన్నారు. ఎల్లెడలా నైరాశ్యం, భయం.

ఆయన రావడంతో పూంఛ్‌ ప్రజలకు ధైర్యం వచ్చింది. సైన్యంలో హుషారు వచ్చింది. శత్రువుకు పరాజయం మొదలైంది. ఆయన పేరు ప్రీతమ్‌సింగ్‌.

ప్రీతమ్‌ సింగ్‌ మొట్టమొదట పూంఛ్‌ పట్టణానికి దగ్గర ఉన్న కొండపై మాటు వేసిన పాకిస్తానీ మూకలపై తన సేనలతో విరుచుకుపడ్డాడు. ఆ దెబ్బకు పాకిస్తాన్‌ దిమ్మెరపోయింది. ఆ సాహసోపేత విజయంతోనే పూంఛ్‌లోని ప్రజలకు తమ రక్షకుడు వచ్చాడని అర్థమైపోయింది. ఆ తరువాత ప్రీతమ్‌సింగ్‌ పదే పదే పాకిస్తానీ శత్రువులను చికాకు పరచడం మొదలుపెట్టాడు.

అంతలో ఆయనకు వెనక్కి రమ్మని ఆదేశాలు వచ్చాయి. కానీ ప్రీతమ్‌సింగ్‌ ఆ ఆదేశాలను బేఖాతరు చేశాడు. ఆయన కళ్లముందు ప్రజలు కనిపించారు. వారి భద్రత కనిపించింది. తన బాధ్యత గుర్తొచ్చింది. ఈ సమయంలో వెనకడుగు వేయడం మంచిది కాదని ఆయన అధికారులకు చెప్పాడు. త్రివర్ణ పతాకాన్ని దించి, వెన్ను చూపడం కన్నా చనిపోవడం మేలని ఆయన అన్నాడు.

పూంఛ్‌లోని ప్రజల ఆకలి తీర్చేందుకు ఆయన సైన్య దళాలను పంపి పాకిస్తాన్‌ అధీనంలోని గ్రామాలను దోచుకుని రమ్మని పంపించాడు. ఇలా 90000 మణుగుల ధాన్యాన్ని తెచ్చి మన పౌరుల ఆకలి తీర్చాడు. సాధారణ ప్రజానీకం ఆయన ఆదేశాల మేరకు పనిచేసింది. రోడ్ల నిర్మాణం, నాలాల తయారీ వంటి పనులలో పాలుపంచుకున్నారు. శత్రువుల తుపాకుల మోత మధ్య కూడా వారు ధైర్యంగా పనిచేశారు. ఆ ధైర్యాన్ని వారిలో నూరి పోసింది ప్రీతమ్‌సింగేనని వేరే చెప్పనక్కర్లేదు.

డిసెంబర్‌ 1947 నాటికి భారత విమానాలు పూంఛ్‌లో దిగడం మొదలైంది. ప్రీతమ్‌సింగ్‌ స్థానిక యువకులతో రెండు బెటాలియన్లను తయారు చేసి సుశిక్షిత సైనికులతో పాటు కలిసి శత్రువుతో పోరాడేలా చేశాడు. ప్రీతమ్‌ నాయకత్వ లక్షణాలు చూసిన సైన్యాధికారులు ఆయనకు బ్రిగేడియర్‌గా పదోన్నతి ఇచ్చి గౌరవించారు.

మార్చి 21, 1948లో శత్రువు తూటా తగిలి ప్రీతమ్‌ గాయపడ్డాడు. దాంతో ప్రీతమ్‌ చనిపోయా డన్న పుకార్లు చెలరేగాయి. ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రజలకు ధైర్యం కల్పించేందుకు గాయపడ్డ ప్రీతమ్‌ ఒక ఓపెన్‌ టాప్‌ జీప్‌పై పూంఛ్‌ నగరమంతా తిరిగాడు. దాంతో ప్రజల్లో మళ్లీ ధైర్యం వచ్చింది. పూంఛ్‌ పూర్తిగా సురక్షితం అయిన తరువాత ఏప్రిల్‌ 1948లో షేఖ్‌ అబ్దుల్లా పూంఛ్‌ నగరంలో బహిరంగ సభలో మాట్లాడారు. ప్రజలకు ధైర్యం చెప్పడానికి బదులు మీరంతా ముస్లింలను ఊచకోత కోశారని వారిని షేఖ్‌ తిట్టిపోశాడు. దాంతో ప్రజలు కత్తులు, కటారులు తీసి షేఖ్‌ పైకి దూకారు. ఆ క్షణంలో ప్రీతమ్‌సింగ్‌ అడ్డం నిలబడకపోతే షేఖ్‌ ముక్కలు ముక్కలైపోయి ఉండేవాడు.

ఆ తరువాత నుంచే ప్రీతమ్‌కి కష్టాలు మొదల య్యాయి. ప్రీతమ్‌కి ఉన్న ప్రజాదరణ చూసి షేఖ్‌, కశ్మీరీ అధికారులు, సైన్యంలోని కొందరు ఆయనకు ఎదురు తిరిగారు. ఆయనపై ఆరోపణల వెల్లువ మొదలైంది. దర్యాప్తు కూడా ఏకపక్షంగా జరిగింది. తనపై ఆరోపణలు చేస్తున్న వారికి క్రాస్‌ ఎగ్జామిన్‌ చేసేందుకు ప్రీతమ్‌కు అనుమతి లభించ లేదు. ప్రీతమ్‌పై అరిచి, కేకలు వేసి, విమర్శించి, ఆయనపై లేని నేరాలు మోపి ఆయనకు శిక్ష పడేలా చేసిన వ్యక్తి బ్రిగేడియర్‌ బిఎం కౌల్‌. సదరు కౌల్‌ గారే 1962 నాటి చైనా యుద్ధంలో అత్యంత అసమర్థమైన నాయకత్వాన్నిచ్చి, మనం ఘోరంగా ఓడిపోయేలా చేసిన జనరల్‌ గారు. ప్రీతమ్‌సింగ్‌ ముస్లింలను ఊచకోతకోయించాడని ఆయనపై ఆరోపణలు చేశారు. ఆయన ఎంతో మంది ముస్లింలను స్వయంగా కాపాడిన ఉదాహరణలు బోలెడన్ని ఉన్నా ఆయనను బోనెక్కించారు. చివరికి జనవరి 1951లో ఆయనకు శిక్ష వేశారు. ముగ్గురు పోలీసులను ఆయన కొట్టారన్నది ఒక ఆరోపణ. కానీ ఆరోపణలు చేసిన ముగ్గురు పోలీసులూ తమ కేసులను ఉపసంహరించు కున్నారు. చివరికి ఒక కంబళీ దొంగతనం చేశాడని, డబ్బుల లావాదేవీల్లో మోసాలు చేశాడని ప్రీతమ్‌ సింగ్‌పై ఆరోపణ చేశారు.

త్రివర్ణ పతాకం గౌరవం కోసం ప్రాణాలకు తెగించి, పాకిస్తానీల ప్రశంసలను సైతం పొందిన ప్రీతమ్‌సింగ్‌ను సస్పెండ్‌ చేశారు. ఆయన పతకాలను లాగేసుకున్నారు. ఆయన సాధించిన విజయాన్ని మరుగుపరిచారు. నాలుగైదేళ్ల క్రితం ఆయన అనామకుడిగా చనిపోయారు. ఆయన గురించి పత్రికల్లో కనీసం రెండు వాక్యాల వార్త రాలేదు. కానీ పూంఛ్‌ పట్టణానికి వెళ్లండి. ఇంటింటా పూంఛ్‌ రక్షకుడు ప్రీతమ్‌సింగ్‌ ఫోటోలు దర్శనమిస్తాయి. పూంఛ్‌ నడిబొడ్డున ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించి నేటికీ పూజిస్తూ ఉన్నారు.

– ప్రభాత్‌

(జాగృతి సౌజన్యం తో )