ప్రకృతికీ, మానవుడికీ అవినాభావ సంబంధం ఉంది. ఆ ప్రకృతిలో ముఖ్యంగా ఆరింటిని మనషి తప్పనిసరిగా రక్షించుకోవాలి. అవి లేకపోతే మానవాళి మనుగడే లేదు. అవేమిటి?
1.భూసంపద – భారతీయులు భూమిని తల్లిగా భావిస్తారు. కొలుస్తారు. ‘మాతా పృథివీ, పుత్రోహం పృథివ్యా’. భూమికి, మనకు మధ్య తల్లీబిడ్డల సంబంధం ఉంది. కాబట్టి భూమికి నష్టం చేసే పనులు ఏవీ చేయకూడదు. భూమాతను విషతుల్యం చేయకూడదు. అమృతమయం చేయాలి. రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకూడదు. గో ఆధారిత వ్యవసాయం ద్వారా మట్టిని అమృతమయం చేయాలి.
2.జలసంపద – జలం కూడా తల్లే. కర్మాగారాలవల్ల మానవ జీవనశైలిలోని వకృతుల వల్ల నీరు కూడా కలుషితమవుతోంది. ప్రతి నీటిని ‘గంగామాత’గా భావించి జలసంరక్షణకు పూనుకోవాలి.
3. వనసంపద – అడవి మనకు దేవత. అందుకనే వనమహోత్సవాలు చేస్తాం. వనమంటే వనస్పతి. అంటే ఆరోగ్యంసంపద. అడవుల్ని రక్షించుకోవాలి. పూర్వం దేవుని వనం, పాఠశాల వనం, గ్రామవనం ఉండేవి. వాటిని మళ్ళీ ఏర్పరచుకోవాలి.
4. జీవసంపద – ‘సర్వభూతస్యామాత్మానం’ – అన్ని జీవుల్లో దేవుడున్నాడని నమ్మే విశేష సంప్రదాయం మనది. మానవాళి మనుగడకు పశువులు, పక్షులు మొదలైనవి కూడా ఎంతో దోహదపడుతున్నాయి. కనుక వాటిని కూడా రక్షించాలి. గోవు మనకు తల్లి. ఆ గోవును రక్షించుకోవాలి.
5. జనసంపద – సంతానం కూడా భగవంతుడు ఇచ్చిన సంపద, వరమే. కాబట్టి దానిని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి.మన బిడ్డల్ని మనమే చంపుకునే దురాచారానికి స్వస్తి పలకాలి. ఆడశిశువుల్ని తల్లి కడుపులోనే కడతేర్చే నీచానికి ఒడిగట్టకూడదు. ప్రాణంపోసే శక్తి లేనప్పుడు, ప్రాణంతీసే హక్కు ఎక్కడది? ‘హిందూ జనాభా’ను రక్షించుకోవాలి.
6. గ్రామీణ సాంస్కృతిక సంపద – హరికథ, బుర్రకథ, కోలాటం, వీధినాటకం, నాట్యం మొదలైన గ్రామీణ కళల్ని కాపాడుకోవాలి.
దేశం అంటే ఇదే. ఈ ఆరు సంపదల్ని కాపాడుకుంటే దేశం దానికదే సురక్షిత మవుతుంది.దేశం బాగుంటే మనం బాగుంటాం. ఈ పని ప్రతి గ్రామంలో జరగాలి.
– సీతారాం కేదాలియా
(లోకహితం సౌజన్యం తో)