Home Rashtriya Swayamsevak Sangh భారతీయ సంస్కృతిని పురాతన సంప్రదాయాన్ని కాపాడుకోవాలి: ఆర్.ఎస్.ఎస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే

భారతీయ సంస్కృతిని పురాతన సంప్రదాయాన్ని కాపాడుకోవాలి: ఆర్.ఎస్.ఎస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే

0
SHARE

భారతీయ సంస్కృతి గొప్ప వారసత్వాన్ని, సాహిత్యంలో పురాతన సంప్రదాయాలను పరిరక్షించుకోవడం ఈనాటి తక్షణ అవసరమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సర్ కార్యవాహ మాననీయ శ్రీ దత్తాత్రేయ హోసబలే అన్నారు. గురువారం గౌహతిలో 108 తేయాకు కమ్యూనిటీల ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన తేయాకు తెగ సంస్కృతి, సంప్రదాయం, పురాతన ధార్మిక విశ్వాసపు గొప్ప విలువలను కాపాడాలని కోరారు. తేయాకు తెగలోని వివిధ విభాగాలు సంఘటితంగా, ఐక్యంగా ఉండవలసిన ప్రాముఖ్యతను గురించి వారు వివరించారు.

బ్రిటిష్ కాలంలో అస్సాంతో సహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు వచ్చిన తేయాకు తెగ అత్యంత శ్రమకోర్చి, చెమటోడ్చి, జాతి నిర్మాతలుగా నిలిచారని, దేశాభివృద్ధికి తమకు చేతనైనంతగా దోహదపడ్డారని శ్రీ హోసబలే అన్నారు. గిర్మిటియాగా ట్రినిడాడ్, గయానాలకు వచ్చినవారు లెక్కలేనన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ తమ సంస్కృతి, మతాన్ని మరచిపోలేదు. అది నిజంగా వారి గొప్పతనం.

వివిధ రాష్ట్రాల తేయాకు తెగలకు సంబంధించిన వివిధ సంస్కృతులు అసోం భూమిపై ప్రత్యేకమైన మిశ్రమాన్ని పొందాయి. ఇవి మన మొత్తం భారతీయ సంస్కృతిని సుసంపన్నం చేశాయి. సంస్కృతి ఒకటే, కానీ విభిన్న రూపాలలో ఉంటుంది. ఇలా విభిన్న రూపాలలోని సంస్కృతి అనుసంధానాలను మనం చూస్తాము. అది భారతీయ సంస్కృతి ప్రత్యేకత అని ఆయన అన్నారు. మన పురాతన సంస్కృతిని పరిరక్షించడంలో సాహిత్యం ఎంతో ప్రముఖ పాత్ర పోషిస్తోంద‌ని ఆయన గుర్తుచేశారు.

ప్రజల ఆర్థిక పరిస్థితులు బాగున్నప్పుడు జీవన విలువలు కూడా సుసంపన్నం అవుతాయి. నైతిక విలువల ద్వారా ఆర్థిక స్థితిని మెరుగుపరచడం ఆహ్వానించదగిన పరిణామం అని కూడా వారన్నారు.
సంక్షోభ కాలంలో, మెరుగైన జీవనోపాధి కోసం ఒకరికొకరు సహకరించు కోవడం, ఆరోగ్యం, విద్యావసరాల కోసం వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవడం వంటివి పరిగణనలోకి తీసుకోవాలి. సమాజంలోని విద్యావంతులైన ఉన్నత వర్గాల వారు, దీనిని తమ విధిగా భావించి, ఇతర ఆదివాసీ సమాజానికి సరిగ్గా మార్గనిర్దేశం చేయాలని శ్రీ దత్తాత్రేయ జీ అన్నారు.

గౌహతిలో “తేయాకు జాతుల (గిరిజనుల) సామాజిక-ఆర్థిక, సాంస్కృతిక అభివృద్ధి – ప్రభుత్వ సంక్షేమ పథకాలు” అనే సెమినార్‌లో మాట్లాడుతూ, 3, 4 తరాల గిరిజన సామాజిక వర్గాల గురించిన చలన చిత్రాలను రూపొందించి ప్రదర్శించాలని ఆయన సూచించారు. దీనివల్ల భవిష్యత్తు తరాలకు తేయాకు తెగ స్ఫూర్తిదాయకమైన చరిత్ర తెలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. గౌహతిలోని మాధవ్ దేవ్ ఇంటర్నేషనల్ ఆడిటోరియంలో జరిగిన సెమినార్‌లో కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలీ జీ, తేయాకు తెగ‌ల ప్రముఖులు పాల్గొన్నారు.