Home Ayodhya రామమందిర నిర్మాణానికి సాధుసంతులతో స్వతంత్ర ట్రస్ట్‌ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం.

రామమందిర నిర్మాణానికి సాధుసంతులతో స్వతంత్ర ట్రస్ట్‌ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం.

0
SHARE

రామాలయ ట్రస్ట్‌ (శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ) లో 9 మంది శాశ్వత సభ్యులు, ఆరుగురు నామినేటెడ్‌ సభ్యులు వెరసి 15 మంది సభ్యులుంటారని, వీరిలో ఒక దళితుడు కూడా ఉంటారని హోంమంత్రి అమిత్‌ షా ట్వీట్‌ చేశారు. ఏ రాజకీయ పక్షానికి చెందినవారూ ఈ ట్రస్ట్‌లో లేరు. పరాశరన్‌ను అధిపతిగా చేసిన కేంద్రం ఎక్కువగా సాధు సంతులకు అవకాశం కల్పించింది.

శాశ్వత సభ్యులు వీరు: ప్రయాగ్‌రాజ్‌ జ్యోతిష పీఠాధిపతి స్వామి వాసుదేవానంద్‌, ఉడిపి మఠాధిపతి జగద్గురు మాధవాచార్య స్వామి విశ్వ ప్రసన్నతీర్థ, హరిద్వార్‌కు చెందిన యుగపురుష్‌ పరమానంద్‌, పుణేకు చెందిన స్వామీ గోవిందదేవ్‌, అయోధ్య రాజకుటుంబీ కుడు విమలేందు మోహన్‌ ప్రతా ప్‌ మిశ్రా, అయోధ్యలో హోమియోపతి డాక్టరు అనిల్‌మిశ్రా, 1989లో వీహెచ్‌పీ శిలాన్యాస్‌ సమయలో పునాదిరాయి వేసిన పట్నాకు చెందిన కమలేశ్వర్‌ చౌపాల్‌ అనే దళితుడు, నిర్మోహీ అఖాడా చీఫ్‌ మహంత్‌ ధీరేంద్ర దాస్‌.

నామినేటెడ్‌ సభ్యులు: ట్రస్ట్‌ ఎంపిక చేసుకునే ఇద్దరు వ్యక్తులు, కేంద్ర సర్వీసులో ఉన్న జాయింట్‌ సెక్రటరీ హోదా గల ఐఎఎస్‌ అధికారి, రాష్ట్ర ప్ర భుత్వ ఐఏఎస్‌ అధికారి, అయోధ్య కలెక్టర్‌ (ఎక్స్‌ అఫీషియో సభ్యుడు), రామాలయ నిర్మాణ ప్రాంగణ వ్యవహారాలు చూసే పాలకమండలి ఛైర్మన్‌(ఎక్స్‌ అఫీషియో సభ్యుడు) నామినేటెడ్‌ సభ్యులు. నామినేటెడ్‌ మెంబర్లంతా హిందువులై ఉండాలి.

పరాశరన్‌ ఇల్లే ట్రస్ట్‌ ఆఫీసు

రామాలయ ట్రస్ట్‌ కార్యాలయాన్ని ఢిల్లీలోని గ్రేటర్‌ కైలాష్‌ ప్రాం తంలో ఏర్పాటు చేస్తారు. ఈ కార్యాలయ భవనం ఎవరిదో కాదు. ట్రస్ట్‌ చైర్మన్‌, అయోధ్య కేసులో రామ్‌లలా, హిందూ పక్షాల తరఫు న ధాటిగా వాదనలు వినిపించిన మాజీ అటార్నీ జనరల్‌ పరాశరన్‌ ఇల్లేనని హోం శాఖ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం ఆయనను ‘పితామహ’ అని సంబోధిస్తుం ది. జడ్జీలకు కూడా ఆయనంటే ఎంతో గౌరవం. తాను మరణించేలోపు అయోధ్య కేసుకు సంబంధించి పూర్తి న్యాయం జరగాలని ఈ 92 ఏళ్ల లాయర్‌ విన్నవించడం ఇప్పటికీ అందరికీ గుర్తే.

ట్రస్ట్‌ సభ్యుల నియామక నోటిఫికేషన్‌ వెలువడగానే యూపీ సర్కారు అయోధ్యలోని రామాలయ స్థలాన్ని ఆ ట్రస్ట్‌కు లాంఛనంగా అప్పగించింది. 1994 నుంచి ఈ స్థలానికి రిసీవర్‌గా ఫైజాబాద్‌ కమిషనర్‌ ఉన్నారు. బుధవారం రాత్రి ప్రస్తుత ఫైజాబాద్ (అయోధ్య జిల్లా) కమిషనర్‌ ఎంపీ అగర్వాల్‌ ట్రస్ట్‌ సభ్యుల్లో ఒకరైన విమలేందు మోహన్‌ మిశ్రాకు ఓ పత్రికా సమావేశంలో ఆ బాధ్యతలను అప్పగించారు.