చాలా సంవత్సరాలకు పూర్వం భారతరత్న సుబ్రహ్మణ్య భారతి వ్రాసిన ఒక పుస్తకంలో ”సాంస్కృతిక జాతీయవాదాన్ని వ్యతిరేకిస్తున్న వారివల్ల భరతమాత బిడ్డల మధ్య వైరం ఏర్పడి శాంతి; సమానత్వం సన్నగిల్లి సెక్యులర్; సెక్యులర్ కాని భావాలతో ఓ రకం రాజకీయ అంటరానితనం అంతటా ఏర్పడుతోంది. ఇదే దేశ సమగ్రతకు భంగం కలిగిస్తుంద”ని హెచ్చరించారు.
పై మాటలు అక్షరసత్యమని గడచిన కొన్ని దశాబ్దలుగా దేశంలో చోటు చేసుకొంటున్న పరిణామాలు, సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. సాంస్కృతిక జాతీయ వాదాన్ని వ్యతిరేకించే శక్తులు దేశంలో అంతర్గత సంఘర్షణలు నిర్మాణం చేయటానికి పని గట్టుకొని ప్రయత్నం చేస్తున్నాయి. దేశంలో, విదేశాలలో జాతీయ వాదులపై, హిందుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు.
శశిధరూర్ కువ్యాఖ్యలు
ఈ మధ్యనే శశిధరూర్ (కాంగ్రెసు) Why I am a Hindu? అనే పుస్తకం వ్రాసారు. దానిలో ఒక్క ప్రక్క పరంపరాగత హిందుత్వ విషయాలు ప్రస్తావిస్తూనే, ఆర్.ఎస్.ఎస్. చెప్పే హిందుత్వ భావాలు అసలైన హిందూఇజంకు భిన్నంగా ఉన్నాయని, అసలైన హిందూఇజమ్ గురించి అందరం తెలుసుకోవాలని వ్యాఖ్యనించారు.
రామచంద్ర గుహ కువ్యాఖ్యలు
రామచంద్రగుహ ఈ మధ్య (Outlook) పత్రిక వెలువరించిన గణతంత్ర దినోత్సవ ప్రత్యేక సంచికలో ‘దేశభక్తి – యుద్ధోన్మాదం’ అనే శీర్షికతో వ్రాసిన వ్యాసంలో రాజ్యాంగ జాతీయవాదం గురించి ప్రస్తావిస్తూ ”ప్రపంచంలో , భారత్‌లో ఉన్న జాతీయ వాదాన్ని వివరించారు. ఐరోపా ఖండంలోని దేశాలు ఒకే భాష, ఒకేమతం, ఒక శత్రుభావనలతో జాతీయత, జాతులు ఏర్పడ్డాయి. భారత్ నుండి విడిపోయి క్రొత్త దేశంగా ఏర్పడిన పాకిస్తాన్ అచ్చం ఐరోపా దేశాల జాతి-జాతీయత ఆలోచనలతో ఏర్పడింది. ఆ దేశంలో భాష ఉర్దూ; మతం ఇస్లాం; భారత్ వ్యతిరేకత మూల సూత్రాలుగా ఉన్నాయి. ఇండియాలో ఒకే మతం, ఒకే భాషతో ముడిపెట్టి జాతి-జాతీయతమని నిర్వచించలేదు. మన రాజ్యాంగ్న నిర్మాతలు ఇండియన్ రిపబ్లిక్‌ను షరతులు లేని ప్రజాస్వామ్యం, మత భాషాపరమైన బహుళత్వం, కుల, లింగ సమానత్వం పేదరిక నిర్మూలన అనే దానిని ప్రతిపధికగా చెప్పారు. దానినే ‘రాజ్యాంగ దేశభక్తి’ అని అనుకోవచ్చు. దేశ స్వాతంత్ర పోరాటంలో అహింస, సత్యాగ్రహం, హిందూ- ముస్లిం ఐక్యత, అంటరానితనం నిర్మూలించడం, ఆర్థిక స్వాలంబనను ఆధారం చేసుకొని గాంధీజీ పనిచేశారు. భారత్‌లో హిందూ-ముస్లిం ఐక్యత కొరకు గాంధీజీ జీవించారు, మరణించారు. గాంధీజీ నడచిన బాటలోనే పనిచేస్తూ ఈ దేశంలో ఉన్న వివిధత్వాన్ని కాపాడుకోవటంలోనే దేశ భవితవ్యం ఉంది.”
“కాని దేశంలో ఇప్పుడు చోటుచేసుకొంటున్న పరిణామాలు చూస్తూంటే ఈ దేశంలో వివిధత్వాన్ని నాశనం చేసే ప్రవృత్తులు ఎక్కువగా కనబడుతున్నాయి. వ్యక్తి నిష్ఠ పెరుగుతోంది. స్వాతంత్య్ర పోరాటం నుండి వికసిస్తూ వస్తున్న జాతీయ వాదానికి వ్యతిరేకంగా ఒక క్రొత్త జాతీయవాదం ముందుకు వస్తున్నది. ఆ జాతీయ వాదం ఐరోపా ఖండంలో ఉండే జాతీయవాదంలాగా ఉంది. దానికి మతం- హిందూఇజం, భాష-హిందీ, శత్రువు- పాకిస్తాన్. ఈ జాతీయ వాదానికి కేంద్రం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం, సంఘం ఈ దేశంలో హిందీని జాతీయ భాషగా చేయాలనుకొంటున్నది. నీవు ఏ ప్రాంతం వాడివైనా, ఏ భాష నీ మాతృ భాష అయినా, నీవు తప్పక హిందీ మాట్లాడాలని అంటున్నారు. ఇట్లా అనటం రాజ్యాంగ దేశభక్తికి వ్యతిరేకం; అంటే ఈ జాతికి వ్యతిరేకం. ఆర్.ఎస్.ఎస్. సర్‌సంఘచాలక్ శ్రీ గురూజీ గోళ్వల్కర్ ఆలోచనలు ఉన్న పుస్తకం “బంచ్ ఆఫ్ థాట్స్”. దానిలో ఈ దేశానికి అంతర్గత శత్రువులు ఇస్లాం, క్రైస్తవం, కమ్యూనిజం అని వ్రాయబడింది. నేను ముస్లిం, క్రైస్తవం, కమ్యూనిస్టుని కాను కాని నన్ను ఆర్.ఎస్.ఎస్. వాళ్ళు అంతర్గత శత్రువుగా చూస్తున్నారు.”
రాజ్యాంగ పరిషత్‌లో అంబేడ్కర్ చేసిన చివరి ప్రసంగంలో ”మతం పట్ల భక్తి, ముక్తికి దారితీయవచ్చు కానీ, రాజకీయాలలో వ్యక్తుల ఎడల భక్త నియంతృత్వానికి, దేశ పతనానికి దారితీస్తుంది” అని చెప్పారు. ఈ రోజున దేశంలో పరిస్థితులు ఆ దిశలో ప్రయాణం చేస్తున్నాయని, అది దేశానికి ప్రమాదకరమని ఇంకోక పత్రికలో వచ్చింది.
National Review.com లో వచ్చిన వివరాలు
జార్జ్.జె.మార్లిన్ అనే ఒక క్రైస్తవ ప్రముఖుడు National Review.com అనే వెబ్‌సైట్‌లో క్రైస్తవంలోకి మారిన దళితుల ఎడల ఈ దేశంలో వివక్షత ఉందని వాపోయాడు. భారతదేశంలో ముస్లింలు; క్రైస్తవులు అందులో ముఖ్యంగా మతం మారిన దళితులనకు లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారని, దళితులకు రాజ్యాంగం నిర్దేశించిన రిజర్వేషన్లు; ఇతర సౌకర్యాలు బౌద్ధ మతంలోకి; సిఖ్ఖు మతంలోకి మారిన వారికి వర్తిస్తున్నాయికానీ ఇస్లాం, క్రైస్తవంలోకి మారితే వర్తించటం లేదని, ఇదేమి వివక్ష అని ప్రశ్నించాడు.
“భారతదేశం అమెరికాతో వ్యూహత్మకంగా సంబంధాలు ఏర్పాటు చేసుకొని దక్షిణ ఆసియాలో రాజకీయ సంతులనం సాధించే దిశగా ప్రయాణం చేస్తున్నది. ఆర్థిక వ్యవస్థలను శక్తివంతం చేయటానికి చేపట్టిన ఆర్థిక సంస్కరణల వల్ల లక్షల మంది దారిద్య్రరేఖ నుండి పైకి వస్తున్నారు. ఈ విషయాలను ప్రభుత్వం తన సమాచార వ్యవస్థల నుండి విశేష ప్రచారం చేసుకొంటున్నది. మా లక్ష్యం దేశాభివృద్ధి అనే ప్రచారం మాటున దేశంలో మైనార్టీలపై జరుగుతున్న దాడులను తెరవెనుకకు నెట్టి వేస్తున్నది. ఇస్లాం; క్రైస్తవం భారతదేశంలో పుట్టలేదు బయట దేశాల నుండి దిగుమతి అయ్యాయి. ఈ రెండు మతాలలోకి మారిన వారిపై దేశంలోని హిందుత్వ శక్తులు; ఆర్.ఎస్.ఎస్. దాడుల చేస్తున్నది భారతదేశంలో ముస్లింలకు; క్రైస్తవులకు భద్రత లేకుండా పోతున్నది. అమెరికా, పాశ్చాత్య దేశాలు భారతదేశంలో మైనార్టీల రక్షణ కొరకు జోక్యం చేసుకోవాలి; కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి” అని వ్రాశాడు.
మతం మారిన దళితులకు రిజర్వేషన్ సౌకర్యాలు కొనసాగిస్తే తమ మతం మార్పిడి పంట పండించుకోవచ్చు. దానికోసం ప్రభుత్వంపైన; కేసు విచారణ చేస్తున్న సుప్రీంకోర్టు పైన ఒత్తిడి తెస్తున్నారు. అంతేగాక మతం మారిన దళితులు, మారని దళితుల మధ్య సంఘర్షణలను నిర్మాణం చేయటానికి క్రైస్తవ శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. క్రైస్తవం, ఇస్లాం చేస్తున్న కుట్రలను వమ్ము చేయాలి. దేశంలో అంతర్గత భద్రతను కాపాడుకోవాలి. శతాబ్దాలుగా ఇస్లాం; క్రైస్తవం పన్నిన వలలో అనేక దేశాలు పడిపోయి వాటి నామ రూపాలు లేకుండా పోయాయి. భారత్‌లో కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు. భారత్‌లో పుష్కలంగా పంట పండించుకొంటున్నారు. మారుతున్న ప్రపంచ పరిస్థితులలో పాశ్చాత్య దేశాలలో ఇస్లామీకరణ వేగం పుంజుకుని క్రైస్తవుల సంఖ్య పడిపోతున్నది. ఈ మధ్య పత్రికలలో, టి.వి.ఛానళ్ళలో చైనా ప్రభుత్వమే ఆ దేశంలో చర్చిలు ఎట్లా కూలగొడుతున్నాదో చూశాము. ఒక్క ప్రక్క పాకిస్తాన్‌కు పూర్తి సహకారం అందిస్తూనే తమ దేశంలో ముస్లింలను ఎట్లా అణచివేస్తుందో పత్రికలలో వార్తలు మనకు తెలియజేస్తున్నాయి. అమెరికా, పాశ్చాత్య దేశాలు భారత్‌లో మైనార్టీల రక్షణకు ఒత్తిడి తేవాలనటం, ఈ దేశ సార్వభౌమత్వాన్ని సవాలు చేయటమే. అటువంటి వ్యక్తులు, శక్తులపై కేంద్రం తగు చర్య తీసుకునే విధంగా ఈ దేశ ప్రజలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి. తద్వారా ఈ దేశ సార్వభౌమత్వం కాపాడుకోవాలి.
దళితుల పేరుతో రాజకీయాలు
ఈ దేశంలో దళితులకు రాజ్యాధికారం దక్కాలంటే దళితులు- కమ్యూనిస్టులు కలవాలని ప్రచారం చేస్తున్నారు. గుజరాత్ ఎన్నికలలో దళిత నాయకుడిగా ఎదిగి వచ్చిన జిగ్నేష్ మేవాని హైద్రాబాద్ వచ్చినప్పుడు ”ఈ దేశంలో దళితుల అభ్యున్నతికి అంబేడ్కర్ వ్యాఖ్యలే శిలాశాసనం కాదు. కులరహిత, దోపిడి రహిత సమాజం ఏర్పాటుకు నిరంతరం పోరాటం చేస్తున్న కమ్యూనిస్టులతో దళితులు చేతులు కలపాలి. దళితులకు నిజమైన మిత్రులు కమ్యూనిస్టులే” అని అన్నాడు.
“అంబేడ్కర్‌కు కమ్యూనిస్టులంటే భిన్న వైఖరి ఉంటే దానిని శిలాశాసనంగా తీసుకోవలసిన అవసరం లేదు. కారల్‌మార్క్సు మాటలు గాని; తన మాటలను గాని శిలాశానంగా తీసుకోవలసిన అవసరం లేదని అంబేడ్కరే స్వయంగా చెప్పారు” అని చెప్పాడు. దళితులు ముస్లింలు కలిస్తే విజయం మనదేనని ముస్లిం నాయకులు మాట్లాడుతున్నారు. ఈ విధంగా దళితులను రాజకీయకంగా ప్రభావితం చేయాలని కమ్యూనిస్టులు, మావోయిస్టులు, ముస్లింలు విపరీత ప్రయత్నం చేస్తున్నారు.
ముగింపు :
రామచంద్ర గుహ జాతీయ వాదం; గాంధీజీ అనుసరించిన విషయాలను ప్రస్తావించారు. కాని గాంధీజీకి ప్రేరణ హిందుత్వమే. సాంస్కృతిక జాతీయ వాదం విషయంలో కూడా గాంధీజీకి చాలా స్పష్టత ఉంది. Hinduswaraj అనే పత్రికలో గాంధీజీ వ్రాసిన ఒక వ్యాసంలో ”భారత్ గురించి పురాతన కాలం నుండి చెప్పబడిన విషయాలు పరిశిలీస్తే, ఈ దేశంలో ఆధ్యాత్మిక జాతీయవాదం వేల సంవత్సరాల నుంచి ఉన్నది అనే విషయం మనకు అర్థమవుతుంది. దానికి ఉదాహరణగా రాముడు నిర్మించిన సేతువు (రామేశ్వరం) దక్షిణంలో ఉంది, తూర్పున ఒరిస్సాలో జగన్నాథ్ మందిరం, అట్లాగే ఉత్తరాన హరిద్వార్ ఉన్నాయి. దేశమంతటి నుండి ప్రజలు ఈ పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ ఉంటారు. వారేమీ మూర్ఖులు కారు. వేల సంవత్సరాల నుండి ఒక సాంస్కృతిగా జాతిగా ఉంది, అందుకే ఆ ప్రదేశాలు దేశమంతటికి శ్రద్ధా కేంద్రాలు. ఈ దేశంలో మతం మారిన ముస్లింలు కూడ ప్రధాన జీవన ధారలో కలసి పోవాల”ని గాంధీజీ చెప్పారు. అరవింద మహర్షి మాటలలో ‘హిందూ జాతీయవాదంలో మతానికి స్థానం లేదు”. ఈ దేశంలో జన్మించిన మహర్షులు, మహ పురుషులు సృష్టి రచనలో ఉన్న భిన్నత్వాన్ని, ఆ భిన్నత్వంలో ఉన్న ఏకత్వతాన్ని దర్శించారు. సృష్టిలో ఉన్న ఈ వైవిధ్యాన్ని కాపాడుకొంటూ, వైవిధ్యంలో ఉన్న ఏకత్వ భావనతో, మనమంత జీవించాలని చెప్పారు. అదే మన ధర్మం. ఈ దేశానికి ధర్మమే ఆధారం. వేల సంవత్సరాల నుండి ఈ దేశంలో ధర్మబద్ధంగా జీవిస్తూ రాజ్యశక్తికి అతీతంగా ఒక గొప్ప సంస్కృతి నిర్మాణమయ్యింది. ఆ సంస్కృతీ ఈ దేశ మౌలిక స్వభావం. ఆ సంస్కృతే ఈ దేశ జాతీయత. అందుకే ఈ దేశంలో సాంస్కృతిక జాతీయత అందరిని కలపగలుగుతుంది, దానికి పండుగలు, పరమేశ్వరతత్వం, ఈ దేశాన్ని మాతృభూమిగా భావించటం, ఇవన్నీ వైవిధ్యంలో ఉన్న ఏకత్వం. ఇట్లా ఈ దేశంలో సాంస్కృతిక జాతీయ భావం వేల సంవత్సరాల నుండి గంగా నదిలాగా ప్రవహిస్తున్నది.
శతాబ్దాలుగా ఈ దేశంలో కొనసాగుతున్న మతం మార్పిడులు, దాడులు ఎన్నొ సామాజిక సమస్యలు సృష్టించాయి. ఈ రోజును కూడ మతం మార్పిడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇస్లాం ఆక్రమణ మనస్తత్వం, లవ్‌జిహాద్ క్రొత్త క్రొత్త సమస్యలకు కారణమవుతోంది.
– రాంపల్లి మల్లికార్జున రావు