Home Interviews అయోధ్యపై కుహనా సెక్యులరిస్టుల వాదన వీగిపోతుంది – కోన్రాడ్‌ ఎల్‌స్ట్‌

అయోధ్యపై కుహనా సెక్యులరిస్టుల వాదన వీగిపోతుంది – కోన్రాడ్‌ ఎల్‌స్ట్‌

0
SHARE

బెల్జియంకు చెందిన కోన్రాడ్‌ ఎల్‌స్ట్‌ ప్రాచీన హిందూ సంస్కృతి, భారతీయతలను ఎంతగానో గౌరవిస్తారు, అభిమానిస్తారు. వివిధ మతాల తులనాత్మక పరిశీలన, అధ్యయనం చేసే కోన్రాడ్‌ హిందూ-ముస్లిం సంబంధాలు, భారతీయ చరిత్రను కూడా పరిశీలించారు. లెవియన్‌ కాథలిక్‌ విశ్వవిద్యాలయం నుంచి దర్శనశాస్త్రాలు, చైనా, భారత్‌, ఇరాన్‌ల గురించి అధ్యయనం చేసి పిహెచ్‌డి పట్టా పుచ్చుకున్నారు. స్వయంగా రోమన్‌ కాథలిక్‌ అయిన 58 ఏళ్ళ కోన్రాడ్‌ ఎల్‌స్ట్‌ కాథలిక్‌ మతాన్ని తిరస్కరిస్తారు. తననుతాను ‘మతం లేని మానవతావాది’గా చెప్పుకుంటారు. హిందుత్వాన్ని గురించి ఆయన అధ్యయనం చేశారు. 1988 నుండి 1992 వరకు బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు ఆయన భారత్‌లో మతపరమైన సమస్యలను పరిశీలించి తన మొదటి పుస్తకం రచించారు. ఆ పుస్తకంలో ఆయన ‘బాబ్రీ మసీదు ఎక్కడ ఉండేదో, అక్కడ మొదట్లో మందిరం ఉండేది’ అని స్పష్టం చేశారు.

తన ‘అయోధ్య అండ్‌ ఆఫ్టర్‌’ అనే పుస్తకంలో ఆయోధ్య రామమందిర ఉద్యమం వల్ల ఇక్కడి సమాజం, సంస్కృతులతో మమేకం అయ్యే అవకాశం భారతీయ ముస్లింలకు వచ్చిందని కోన్రాడ్‌ ఎల్‌స్ట్‌ అభిప్రాయపడ్డారు. నిజానికి ఆ ఉద్యమం జాతీయ సమైక్యత సాధనకు మంచి ముందడుగని అన్నారు. భారతీయ సంస్కృతి, అయోధ్య మొదలైన అంశాల గురించి కోన్రాడ్‌ ఎల్‌స్ట్‌ తన అభిప్రాయాల్ని ఈ ఇంటర్‌వ్యూలో తెలియజేశారు..

ప్రశ్న : మీ పేరు పలకడం కష్టమే. ఆ పేరుకు అర్థం ఏమిటి ?

సమాధానం : నిజమే. నా పేరు పలకడం కొద్దిగా కష్టమే. ‘ఎలాంటి భయం, ఉద్రేకం లేకుండా ఆలోచించే వాడు’ అని దాని అర్థం.

ప్రశ్న : కోర్టుల్లో సాగుతున్న అయోధ్య కేసు గురించి మీరేమంటారు ?

స : ఇంతకాలం సాక్ష్యాధారాలు చూపాలని బూటకపు సెక్యులరిస్టులు బుకాయిస్తూ ఉంటే, హిందువులు వారికి సాక్ష్యాధారాలు చూపించడానికి, తాము చెప్పేది నిజమని నచ్చచెప్పడానికి తాపత్రయపడుతున్నారు. తమ సమయాన్ని ఇలా వృధా చేసుకుంటున్నారు. ఇది చాలా హాస్యాస్పదం. సాక్ష్యాధారాలు ముస్లిముల వైపు నుంచి చూపించడానికి ప్రయత్నాలేవీ జరగలేదు. బాబర్‌ గానీ, అతని సేనాపతి గానీ అక్కడ ‘మసీదు’ కట్టాడంటే ఆ భూమిని ఆక్రమించాడని అర్ధం. ఆ రోజుల్లో ఆ భూమిని బాబరు ఎవరి నుంచీ కొన్నట్లు గానీ, పొందినట్లు గానీ ఎలాంటి ఆధారాలూ లేవు. అలాగే అయోధ్య ఎప్పుడూ ముస్లిములకు పవిత్ర యాత్రా స్థలం కూడా కాదు. అక్కడ మసీదు ఉండేదని, వివాదం ఏర్పడిన తరువాత ముస్లింలు ఏనాడూ అక్కడ నమాజు చేయలేదని స్పష్టమవుతోంది. దీనినిబట్టి అక్కడ నమాజు చేయడంలో ముస్లిములకు ఎలాంటి ఆసక్తి లేదని తేలుతోంది. అయితే అయోధ్య హిందువులకు మాత్రం అత్యంత పవిత్రస్థలం, పుణ్యస్థలం అని చెప్పడానికి అనేక ఆధారాలున్నాయి. ఇక్కడే భగవాన్‌ శ్రీరాముడు జన్మించాడు. చారిత్రక ఆధారాల దృష్ట్యా చూసినా బూటకపు సెక్యులరిస్టుల వాదన అనేకసార్లు వీగిపోయింది.

కానీ విచిత్రమేమిటంటే సాక్ష్యాధారాలు చూపాల్సిన బాధ్యతను 70 ఏళ్ళుగా హిందువులే మోస్తున్నారు. పురాతత్వ ఆధారాలను చూస్తే ఒకప్పుడు అక్కడ రామమందిరం ఉండేదని స్పష్టమవుతోంది. ఇలా చారిత్రక, పురాతత్వ ఆధారాలు చూపాలంటూ గోలపెట్టిన వారు ఇప్పుడు కొత్త వాదాన్ని తెరపైకి తెస్తున్నారు. ‘ఎప్పుడో జరిగిపోయిన విషయాల గురించి ఇప్పుడు గొడవపడడం అవసరమా ? వాటిని మరచిపోవచ్చును కదా. బాబర్‌ ఎప్పుడో చేసిన తప్పుకు ఇప్పుడు ముస్లిములను దోషులుగా నిలబెట్టడం ఎంతవరకూ సబబు. కనుక అయోధ్యలో యథాతథ స్థితిని కొనసాగించాలి. రామమందిర నిర్మాణపు ఆలోచనను పక్కన పెట్టాలి’ అంటున్నారు. ప్రపంచంలో ఏ ముస్లిమైనా అయోధ్యకు తీర్థయాత్ర కోసం వస్తాడా ? లేదు. ఇక్కడకు రావాలని ఏ ముస్లిమూ అనుకోడు. కానీ భారత్‌లో ప్రభుత్వాలన్నీ ఈ సత్యాన్ని కప్పుపుచ్చుతూనే ఉంటాయి. ముస్లిం సంతుష్టీకరణ కోసం ఈ సమస్యను పొడిగిస్తూనే వచ్చాయి. అధికసంఖ్యాకుల మనోభావాలను పట్టించు కునేందుకు ఎప్పుడూ ప్రయత్నించలేదు. అటు సెక్యులరిస్టులు, ఇటు ముస్లిం ముల్లాలు ఈ సమస్యను సాగదీయడానికే చూస్తున్నారు.

ప్రశ్న : అయితే ఇదంతా మరొక సామ్రాజ్యవాద ధోరణి అయిన ఇస్లామీకరణ అని చెప్పవచ్చునా ?

స : సరిగ్గా అదే. ప్రపంచం మొత్తాన్ని ఇస్లామీకరణ చేయాలన్న ప్రయత్నాలు జోరుగా సాగాయి. ప్రపంచాన్ని ఖిలాఫత్‌ లేదా ఖలీఫా పాలనలోకి తేవాలన్నదే ఈ ప్రయత్నాల ఉద్దేశ్యం. తమ ఆధీనంలో లేనివాటిని స్వాధీనం చేసుకోవాలని ముస్లిం పాలకులు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇదే మనసత్త్వం ఇప్పటికీ కొనసాగుతోంది.

ప్రశ్న: హిందుత్వం అంటే ఏమిటని మీరనుకుంటున్నారు?

స : హిందువులు చాలా సామాన్యమైన, నిరాడంబర మైన వారు. మరోవైపు క్రైస్తవులలో మూఢనమ్మకాలు ఎక్కువ. ఆ నమ్మకాలు ఎలా ఉంటాయంటే ఒక వ్యక్తి జన్మించి, శిలువపై వేలాడి, ఆ తరువాత మళ్ళీ బ్రతికి వచ్చి తమ పాపాలన్నింటినీ ప్రక్షాళన చేసేస్తాడని వాళ్ళు అనుకుంటారు. ఇక ముస్లిముల ధోరణి పూర్తిగా వేరు. తమ మతమే చిట్టచివరి వరకూ నిలిచి ఉంటుందని, ‘తీర్పు’ వచ్చే రోజు మానవాళి అంతా అల్లా ముందు నిలబడతారని, వాళ్ళవాళ్ళ కర్మలను అనుసరించి తీర్పు ఉంటుందని భావిస్తారు. ఆధునిక కాలంలో కూడా ఇలాంటి విశ్వాసాలు కలిగి ఉండడం నిజంగా ఆశ్చర్యమనిపిస్తుంది.

హిందువులు సాధారణమైన ఆలోచనలు, భావనలు కలిగినవారు. వాళ్ళు అందరితో కలిసి జీవించాలను కుంటారు. సర్వపంథ సమభావన వారి మౌలిక లక్షణం. అంటే పూజా పద్ధతి తమకంటే వేరైనప్పటికీ వారితో కలిసి జీవించడానికి హిందువులకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. హిందూ ధర్మంలో కూడా కొన్ని లోపాలున్నాయి. కానీ మొత్తంమీద చూస్తే హిందూ ధర్మంలో మానవత్వం ఎక్కువ.

ప్రశ్న : నేటి ప్రపంచంలో మతపరమైన ద్వేషం పెచ్చుమీరిపోతోంది. కొన్ని మతాలు తీవ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో హిందూమతం ఇలాంటి విద్వేషపూరిత మతాలపై ఎలా విజయం సాధించగలదు ?

స : హిందువులు మొట్టమొదట చేయవలసినది ఏమిటంటే తమపై తాము నమ్మకాన్ని పెంచుకోవడం. తమ ధర్మం, జీవన విధానం పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండడం. తమ గతాన్ని మరచిపోకూడదు. ముఖ్యంగా భారతదేశంలో క్రైస్తవ మిషనరీలు అమలు చేసిన కుట్రల్ని గుర్తుంచుకోవాలి. క్రైస్తవ మిషనరీలు చేసిన కుట్రలు అన్నీ ఇన్నీ కావు. వాళ్ళు మతమార్పిడులకు పాల్పడుతున్నారు. కత్తితో ఇస్లాం చేసిన పనినే డబ్బు, ప్రలోభాల ద్వారా క్రైస్తవం చేస్తోంది. అందువల్ల వారిపట్ల జాగ్రత్తగా ఉండాలి. కానీ దురదృష్ట వశాత్తు మిషనరీలు ఈ దేశంలో సాగించిన అమానుష కాండను హిందువులు మరచిపోతున్నారు. హిందువులు తమ ధర్మాన్ని మరచిపోవడంకంటే ఇలా గతంలో తమకు ఎంతో అన్యాయం చేసిన క్రైస్తవ మిషనరీల అకృత్యాలను మరచిపోవడం మరింత ప్రమాదకరం. దేశ సరిహద్దుల రక్షణతో పాటు పెద్దఎత్తున జరుగుతున్న సాంస్కృతిక దాడిని కూడా హిందువులు పట్టించుకోవాలి. పాశ్చాత్య సంస్కృతిని గుడ్డిగా అనుకరించడం మానుకోవాలి.

ప్రశ్న : ఈ మధ్యకాలంలో ప్రాచీన, సహనశీల హిందూ ధర్మం వేరు; పిడివాద, రాజకీయ హిందుత్వం వేరంటూ ఒక కొత్త వాదన తెర పైకి వచ్చింది. హిందుత్వాన్ని, హిందూ జాతీయవాదాన్ని గురించి మీరేమనుకుంటున్నారు ?

స : హిందూ జాతీయవాదం గురించి ప్రస్తుతం చర్చ జోరుగా సాగుతోంది. గాంధీ తరహా పిరికి, అసమర్థ హిందుత్వాన్ని ఈ దేశంలో అమలు చేయాలని కాంగ్రెస్‌ చాలా ప్రయత్నించింది. ఇస్లాం, క్రైస్తవాలను ప్రశంసించడం, తమ ధర్మంలో లోపాలు వెతకడం, ఇతరులతో కలిసుండాలంటూ అవసరానికి మించి సర్దుకోవడం వంటివి ఈ ధోరణిలో కనిపిస్తాయి. భారతదేశంలో తమను తాము సెక్యులరిస్టులమని చెప్పుకునే వర్గం ఒకటుంది. ఆ వర్గం ఎప్పుడూ హిందుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. కానీ వాళ్ళకి అప్పుడప్పుడు తమ పేరులోని హిందుత్వం జ్ఞాపకం వస్తుంటుంది. వెంటనే తాము కూడా హిందువులమేనంటూ గొంతు చించుకుంటారు. అయితే వాళ్ళని నేను హిందువులుగా పరిగణించను. ఉదాహరణకు శశిథరూర్‌, రాహుల్‌ గాంధీలనే తీసుకోండి. ఒకాయన హఠాత్తుగా హిందుత్వం, హిందువు అంటే ఏమిటో నిర్వచనాలు ఇవ్వడం మొదలుపెడితే, మరొకాయనకు తాను జంధ్యం ధరించిన హిందువునని ఈ మధ్యనే గుర్తుకొచ్చింది. కానీ వీళ్ళిద్దరూ చేసే పనులు మాత్రం పూర్తిగా హిందూ వ్యతిరేకమైనవని ఎవరికైనా తెలుస్తుంది. పైకి మాత్రం తాము హిందువులమని చెప్పుకుంటారంతే.

ప్రశ్న : హిందువులు తమ ధోరణిని మార్చుకో వలసిన అవసరం ఉందని మీరనుకుంటున్నారా ?

స : హిందూ ఆచారాలు, పద్ధతుల వెనుక ఉన్న సైద్ధాంతిక భూమిక, సకారాత్మక ధోరణిని తెలుసుకుని ఆచరిస్తే చాలు. అలాగే వాటి గురించి ఎలాంటి తక్కువ భావం కలిగి ఉండాల్సిన అవసరం లేదు. ఇలా చేస్తే హిందుత్వానికి నష్టం చేయడానికి, అవహేళన చేసేందుకు ప్రయత్నిస్తున్నవారి ఆటలు కడతాయి.

ప్రశ్న : వహాబీ ఉద్యమం వల్ల ముప్పు ఉంటుందా ? దీనికి విరుగుడు ఏమిటి ?

స : వహాబీ ఉద్యమం వ్యాప్తి చెందుతుండడం నిజంగా పెద్ద సమస్యే. అయితే ఈ వహాబీ ప్రభావం నాకు పెద్దగా అనుభవంలోకి రాలేదు. కానీ ప్రపంచం లోని కొన్ని దేశాల్లో ఇది బాగా వ్యాప్తి చెందింది. ఈ వహాబీవాదం త్వరలోనే అంతమవుతుందని మాత్రం చెప్పవచ్చును. నా చిన్నప్పుడు చాలామంది చర్చ్‌కి వెళ్ళేవారు. కానీ ఇప్పుడు అలా చర్చ్‌కు వెళ్ళేవారి సంఖ్య బాగా తగ్గిపోయింది. చర్చీలు ఖాళీగానే ఉంటున్నాయి. వాటిల్లో ఇప్పుడు దుకాణాలు, పబ్‌లు వెలుస్తున్నాయి. అలాగే ఇస్లాం ఎంత పెద్ద సమస్య, అది భావితరాలను ఎంతగా ప్రభావితం చేస్తుందన్న విషయాన్ని నేను కచ్చితంగా చెప్పలేను. ఇస్లామేతరుల ముందున్న మార్గం ఒక్కటే. వాళ్ళు తమ ఆచార వ్యవహారాలు, సంస్కృతి పట్ల పూర్తి నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఇతరులను అనుకరించరాదు.

ప్రశ్న : భారత్‌లో సెక్యులర్‌ రాజకీయాలు, బిజెపి రాజకీయాలను మీరు ఎలా చూస్తారు ?

స : బిజెపి రాజకీయాలు అని వేరుగా ఉన్నాయని నేను అనుకోను. ఇక్కడ అమెరికా లేదా బ్రిటన్‌కు చెందిన వర్గం ఆధిపత్యం చెలాయిస్తోంది. అది ఈ దేశానికి మంచిది కాదు. నరేంద్ర మోదీ ప్రధాని అయిన తరువాత ఈ దేశంలో ప్రజలు కష్టపడి పనిచేయడం కనిపించింది. ఆయన సమర్థత, కార్యదక్షత నన్ను ముగ్ధుణ్ణి చేశాయి. కానీ ఇప్పటికీ హిందూ ధర్మాన్ని కించపరచడానికి, దిగలాగేందుకు ప్రయత్నిస్తున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అలాంటి వాళ్ళను గుర్తించడం చాలా అవసరం. అలాగే యోగి ఆదిత్యనాధ్‌ పనితీరు కూడా నాకు బాగా నచ్చింది. నేను మొదటిసారి ఆయన్ని చూసినప్పుడు, ఆయన వ్యవహారశైలిని గమనించినప్పుడు భారతదేశంలో పెద్దమార్పు వచ్చిందనిపించింది. ఆయన యోగి. ఆత్మసంయమనం ఆయన లక్షణం. అలాంటి వ్యక్తి రాజకీయాలలోకి రావడమంటేనే అది గొప్ప మార్పు. ఏ దేశంలోనైనా మాతృభాష ద్వారానే ప్రగతి సాధ్యపడుతుంది. చైనా, జపాన్‌, జర్మనీ మొదలైన దేశాలే ఇందుకు ఉదాహరణ. భారత్‌ కూడా అదే మార్గంలో పయనించాలి.

ప్రశ్న : బిజెపి పట్ల దేశంలో ఎలాంటి వాతావరణం ఉందనుకుంటున్నారు ?

స : బిజెపి అనుసరించే విధానాలు ఎలా ఉన్నా, ఆ పార్టీ పట్ల ప్రజల్లో అసత్యాలు బాగా ప్రచారంలో ఉన్నాయి. ఈ ప్రచారం కాంగ్రెస్‌, వామపక్షాలు చేస్తున్నాయి. చారిత్రక విషయాల్ని వక్రీకరించడం, అసత్యాలను ప్రచారం చేయడం, అన్నిటికీ ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపిలను దోషులుగా నిలబెట్టడం వంటి పద్ధతులు అవి అనుసరిస్తున్నాయి.

ప్రశ్న : హిందువులకు మీరిచ్చే సందేశం ఏమిటి?

స : ఈసారి కూడా బిజెపి తన సొంత బలంతోనే పూర్తి మెజారిటీ సాధిస్తుందని ఆశిస్తాను. ఇప్పటి వరకూ చేయకుండా మిగిలిపోయిన పనులు కూడా పూర్తి చేస్తుందనుకుంటాను. అభివృద్ధి గురించి అందరూ మాట్లాడతారు. కానీ ప్రజలు బిజెపినే ఎందుకు ఎన్నుకున్నారు ? ఈ సమాజాన్ని జాగృతం చేయడానికి, దేశానికి అత్యంత ముఖ్యమైన పనులను పూర్తిచేయడానికి బిజెపి ప్రయత్నించాలి. దేశం అన్ని విధాలుగా అభివృద్ధి సాధించాలంటే విద్యావ్యవస్థను పూర్తిగా మార్చాలి. రాజ్యాంగం అందించిన చట్టాలన్నింటినీ సక్రమంగా అమలు చేయాలి. ఉదాహరణకు ఉమ్మడి పౌరస్మృతి. ఇప్పటివరకూ అల్పసంఖ్యాక వర్గపు హక్కుల గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఇక అధిక సంఖ్యాకుల గురించి పట్టించుకో వాలి. నెహ్రూ, ఇందిరాగాంధీల ఆలోచనా ధోరణిని పక్కకు పెట్టి అధిక సంఖ్యాకుల కోసం ఈ ప్రభుత్వం ఏదైనా చేయగలిగితే అదే చాలా గొప్ప పని అని నేను భావిస్తాను.

(జాగృతి సౌజన్యం తో)