Home News ప్రజాపోరాటంలో ‘పూజారి మాణిక్యం’ త్యాగం మరువలేనిది

ప్రజాపోరాటంలో ‘పూజారి మాణిక్యం’ త్యాగం మరువలేనిది

0
SHARE

పూజారి మాణిక్యం పాత వరంగల్ జిల్లా ప్రస్తుత ములుగు జిల్లాలో అటవీ ప్రాంతం అయిన మంగపేట దగ్గర్లోని తిమ్మాజీ పేట గ్రామ వాసి. చిన్నతనం నుండే జాతీయభావనను ఎదన నింపుకున్న స్వయంసేవక్.  హైస్కూల్ విద్య, కళాశాల విద్యనభ్యసిస్తున్న సమయంలో విద్యార్థి నాయకునిగా విద్యార్థులను నేషన్ ఫస్ట్, సెల్ఫ్ లాస్ట్ అంటూ దేశసేవలో ముందుకు నడిపిన వ్యక్తి. ఏబీవీపీ లో అలవడిన నాయకత్వ పటిమ తో భారతీయ జన సంఘ్ , BJP లలో వివిధ స్థాయిల్లో పనిచేశారు. మంగపేట సింగిల్ విండో ఛైర్మెన్ గా పేద ప్రజలకు అనేక సేవలు చేశారు. ఆ తర్వాత తిమ్మాజీ పేట గ్రామ సర్పంచ్ గా 1987 లో ఎన్నికయ్యారు. గ్రామ ప్రజల తలలో నాలుకలా వుండేవాడు, అన్ని గ్రామ సమస్యలు మాణిక్యం గారి నాయకత్వాన పరిష్కరించబడేవి. అలా ప్రజాచైతన్యానికి దిక్సూచిగా మారిన మాణిక్యం గారి ఎదుగుదల “అడవిలో పేరుకు అన్నలుగా దేశంలో పడ్డ దొంగల్లా” ఉండే నక్సలైట్లకు సహించలేదు. మాణిక్యం గారి వల్ల తమకు రావాల్సిన వాటాలు ఆగిపోయాయి అనుకున్నారో లేక తమ ఉనికికే ప్రమాదం అనుకున్నారేమో.? మాణిక్యం గారి హత్యకు పథకం రచించారు. 20 ఏప్రిల్ 1995 న పూజారి మాణిక్యం గారిని, తన సోదరుడు ఆదినారాయణను రాత్రి గం.7.30 ని.లకు నరహంతక నక్సలైట్లు వేసుకున్న పథకం ప్రకారం మాట్లాడడానికని చెప్పి అడవిలోకి తీసుకెళ్లారు. తాను సర్పంచ్ గా ఉన్న తిమ్మాజీ పేట గ్రామం నుండి 25 లక్షల రూపాయలు తమకు కప్పం చెల్లించాలనే డిమాండ్ చేశారు. వీళ్ళు హత్య చేయడానికే వచ్చారని గమనించిన ఆదినారాయణ కొంత దూరం పరుగెత్త బోయి నక్సల్స్ వెంబడిస్తున్న తరుణం లో క్రింద పడిపోగా మారణాయాయుధాలతో ఆదినారాయణ ను అక్కడే చంపేశారు.ఇది గమనించిన మాణిక్యం వెంటనే తేరుకొని బెబ్బులిలా అక్కడే ఉన్న నక్సలైట్ చాతిపై చేతితో బలంగా కొట్టడం తో అతడు అక్కడే రక్తం కక్కుకొని అడ్డం పడ్డాడు. మరో నక్సలైట్ ను బలంగా ఒట్టి చేతులతోనే గుద్దడం తో అక్కడే మట్టికరిచాడు.మరో దళ కమాండర్ కు తీవ్రగాయాలయ్యాయి. ఇంతలో అక్కడే గుంపు గా ఉన్న మిగతా నక్సల్ గుండాలు నేరుగా ఎదురుకోలేక తమవద్ద ఉన్న టార్చ్ లైట్ వెలుతురు ను మాణిక్యం కళ్ళ లోకి కొట్టి అతన్ని చుట్టు ముట్టి తమవద్ద ఉన్న

మారణాయుధాలతో మాణిక్యాన్ని హతమార్చారు. నక్సలైట్లు అంటేనే హడలిపోయే రోజుల్లో తనను అంతమొందించాలనే జనశక్తి నక్సల్స్ గుంపు నుండి ఇద్దరిని పరలోకానికి పంపించాడంటే పూజారి మాణిక్యం ఉగ్రవాద నక్సల్స్ తో ఒక యుద్ధమే చేసి వీరమరణం పొందాడు. అందుకే భారతప్రభుత్వం తదనంతర కాలంలో (1996) యుద్ధంలో సైనికునికి ఇచ్చే “కీర్తిచక్ర”అవార్డు ను పూజారి మాణిక్యం గారికి ప్రకటించింది. నిజంగా జయహో పూజారి మాణిక్యం జయహో… నీ ధైర్యం, నీ తెగువ మాకందరికీ ఆదర్శం.

ఈ రోజు ఆ యుద్ధ వీరుడు”పూజారిమాణిక్యం” వర్ధంతి రోజు, ఆయనను స్మరిద్దాం. ఆయన చేసిన యుద్ధం నుండి మనకిచ్చిన సందేశాన్ని అనుసరిద్దాం.

– ఆకారపు కేశవరాజు