Home News రైల్వే స్టేషన్‌లో ఉచిత వైఫై వినియోగించుకుని కేరళ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పాసయ్యాడు

రైల్వే స్టేషన్‌లో ఉచిత వైఫై వినియోగించుకుని కేరళ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పాసయ్యాడు

0
SHARE

అనుకున్నది సాధించాలనే తపన ఉంటే.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా.. ఎక్కడైనా మన కలను నిజం చేసుకోవచ్చు. ఇందుకు కేరళలోని ఎర్నాకులం రైల్వేస్టేషన్‌లో ఓ కూలీగా పనిచేస్తున్న శ్రీనాథే మంచి ఉదాహరణ. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు.. రాత్రింబవళ్లూ కష్టపడి చదవి పరీక్షలకు సన్నద్ధమవుతుంటారు. ఇందు కోసం లక్షల కొద్దీ డబ్బులు ఖర్చు పెట్టి.. కోచింగ్‌లు తీసుకుంటారు. అయితే అవేమీ లేకుండా రైల్వేస్టేషన్‌లోనే ఉంటూ కూలీ పనిచేసుకుంటూ కేరళ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(కేపీఎస్సీ) పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు.

ఇందుకోసం ఎలాంటి కోచింగ్‌ సెంటర్లలో చేరలేదు. ఖరీదైన స్టడీ మెటీరియల్‌ కొనలేదు. కేవలం రైల్వే స్టేషన్‌లో లభించే ఉచిత వైఫై సేవలను వినియోగించుకున్నాడు ఈ 27 ఏళ్ల యువకుడు శ్రీనాథ్‌. ఇడుక్కి జిల్లాకు చెందిన శ్రీనాథ్‌.. వైఫై ద్వారా స్టడీ మెటీరియల్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు. రైల్వేస్టేషన్‌లో కూలీగా తన పని తాను చేసుకుంటూ ఇయర్‌ఫోన్ల ద్వారా వాటిని వింటూ పరీక్షకు సిద్ధమయ్యాడు. రోజు రాత్రి 10 నుంచి ఒంటి గంట వరకూ తాను చదవిన వాటిని పునరుశ్చరణ చేసుకునేవాడు.

2015 నుంచి గూగుల్‌, రైల్‌టెల్‌ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై సేవలు లభిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఉచిత సేవలు శ్రీనాథ్‌ పనిని మరింత సులభం చేశాయి. గత 18 నెలలుగా కేసీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. రెండుసార్లు పరీక్షలకు హాజరైన శ్రీనాథ్‌కు ఆశించిన మేర ఫలితాలు రాలేదు. కానీ, మూడో ప్రయత్నంలో మాత్రం 83 శాతం మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. కేసీఎస్సీ పరీక్షలో మంచి స్కోర్‌ సాధించగానే.. అతని స్నేహితులు, కుటుంబసభ్యులు, బంధువుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అయితే ఏ మాత్రం పొంగిపోలేదు. ప్రస్తుతం రైల్వే గ్రూప్‌ డీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు.

(ఈనాడు సౌజన్యం తో)