సమాజానికి తిరిగివ్వడం మనందరి కర్తవ్యం – భారతీయ ఋషులే ఇందుకు స్ఫూర్తి
– సీబీఆర్ ప్రసాద్, భారత వాయుసేన మాజీ అధికారి
విజయవాడకు 30 కిలోమీటర్ల దూరంలోని కేతనకొండకు చెందిన మాజీ ఎయిర్ ఫోర్స్ అధికారి శ్రీ సి బి ఆర్ ప్రసాద్ (74) తన ఏడు దశాబ్దాల జీవన ప్రస్థానంలో తన కుటుంబ ఖర్చులు పోను దాచిన సొమ్మంతా రక్షణ శాఖ సహాయ నిధికి అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ మేరకు ఆయన 15/7/19 సోమవారం నాడు రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి 1.08 (ఒక కోటి ఎనిమిది లక్షల) కోట్ల రూపాయల చెక్కును అందజేశారు.
“ నా 20 సంవత్సరాల వయసులో నేను ఎయిర్ ఫోర్స్ లో పని చేస్తూ ఉన్నప్పుడు మా ఎయిర్ ఫోర్స్ అధికారులు కోయంబత్తూరుకు చెందిన జి డి నాయుడు అనే ఒక పెద్దాయనను ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. “సమాజ హితానికై సర్వస్వాన్ని సమర్పించడమనే భారతీయ ఋషుల సమున్నత ఆదర్శం కారణంగానే మన భారత దేశం ఉన్నత స్థానంలో నిలిచింది. మన కుటుంబ అవసరాలకు పోను మిగిలిన సంపాదనను సమాజానికి తిరిగివ్వడం మనందరి కర్తవ్యం” అని ఆయన చెప్పారు. ఆ మాటలే స్ఫూర్తిగా నా జీవితానికి పునాది వేసిన ఎయిర్ ఫోర్స్ ఋణం ఈ విధంగా తీర్చుకున్నాను” అని “మీకీ ఆలోచన ఎలా వచ్చింది?” అన్న విలేఖరుల ప్రశ్నకు సమాధానంగా చెప్పారు శ్రీ ప్రసాద్. “మనం ఈ భూమ్మీదకు వచ్చేటప్పుడు వట్టి చేతులతో వచ్చాం. వెళ్ళేటప్పుడు వట్టి చేతులతోనే వెళ్తాం. మన సంపాదనలోంచి మన కుటుంబ కనీస అవసరాలు పోను మిగిలిన మొత్తాన్ని, శేష జీవితాన్ని సమాజానికి సమర్పించడమే సరియైనది.” అని కూడా శ్రీ ప్రసాద్ పేర్కొన్నారు.
తొమ్మిదేళ్ళపాటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేసిన శ్రీ ప్రసాద్ ఆ తర్వాత 30 ఏళ్ళ పాటు పౌల్ట్రీ ఫాం నడిపారు. ఆయన సహజంగా మంచి స్పోర్ట్స్ మన్ కూడా. ఒలింపిక్స్ లో మెడల్ సాధించాలన్న తన కల నెరవేరకపోవడంతో 50 ఎకరాల స్థలంలో స్వంతంగా ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని నెలకొల్పి అందులో పిల్లలకు శిక్షణనందిస్తున్నారు.
Source: VSK Andhra