Home News రామ మందిర నిర్మాణం హిందువుల విశ్వాసానికి సంబంధించిన విషయం – శ్రీ భయ్యాజీ జోషి

రామ మందిర నిర్మాణం హిందువుల విశ్వాసానికి సంబంధించిన విషయం – శ్రీ భయ్యాజీ జోషి

0
SHARE

ముంబై కేశవ సృష్టి లో మూడు రోజులపాటు జరిగిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారిణి మండలి సమావేశాలల్లో చర్చించిన వివిధ జాతీయ అంశాలను గురించి సర్ కార్యవాహ్ శ్రీ సురేశ్ జోషి పత్రికల వారికి వివరించారు.

రామమందిరం కోట్లాదిమంది హిందువుల మనోభావాలు, విశ్వాసాలతో ముడిపడిన విషయమని భయ్యాజీ అన్నారు. దీనిపై కోర్టు వేగంగా విచారణ పూర్తిచేయాలని అన్నారు. గత 30 ఏళ్లుగా రామమందిర నిర్మాణం కోసం హిందూ సమాజం ఉద్యమాన్ని సాగిస్తోందని ఆయన గుర్తుచేశారు. అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణం జరగాలని, అందుకు ఎదురవుతున్న అడ్డంకులన్నీ తొలగిపోవాలని హిందువులంతా కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ఇప్పటికే దీని కోసం చాలాకాలం ఎదురుచూశారని, ఈ నిరీక్షణ మరింత ఎక్కువ అవుతున్నదని అన్నారు. 2010 సర్వోన్నత న్యాయస్థానం ఈ విషయమై తీర్పునిచ్చింది. 2011 నుండి ఈ విషయమై విచారణ ఆగిపోయిఉంది. సర్వోన్నత న్యాయస్థానికి చెందిన ముగ్గురు సభ్యుల బెంచ్ ఈ కేసు విచారణ జరిపింది. అయితే విచారణను బెంచ్ దీర్ఘకాలానికి వాయిదా వేసింది. విచారణ ఎప్పుడు చేపడతారని అడిగినప్పుడు మా ప్రాధామ్యాలు మాకు ఉంటాయంటూ బెంచ్ సమాధానమిచ్చింది. కేసు ఎప్పుడు విచారించాలన్నది న్యాయస్థానపు నిర్ణయంపైన ఆధారపడి ఉన్నప్పటికి కోర్ట్ ఇచ్చిన సమాధానం మాత్రం అవమానకరంగా ఉందని హిందూ సమాజం భావించింది. కోర్ట్ ధోరణి సమాజం మొత్తానికి ఆశ్చర్యాన్ని, విచారాన్ని కలిగించింది. ఈ విషయంలో సర్వోన్నత న్యాయస్థానం మరోసారి ఆలోచించాలి. కోర్ట్ లను సమాజం గౌరవించాలి. అలాగే కోర్ట్ లు కూడా సామాన్య ప్రజానీకపు భావాలను, విశ్వాసాలను గౌరవించాలి.

రామ మందిర విషయమై ఆర్డినెన్స్ తీసుకువచ్చే అంశం ప్రభుత్వానికి సంబంధించినదని, దానిపై ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలన్నది ప్రభుత్వమే చూసుకుంటుందని భయ్యాజీ అన్నారు. అయోధ్య రామజన్మభూమిలో ఒకప్పుడు మందిరం ఉన్నదని ఆధారాలు లభిస్తే అప్పుడు ఆ స్థలంలోనే మందిర నిర్మాణం జరగడానికి ప్రభుత్వం అంగీకరిస్తుందంటూ నరసింహారావు ప్రభుత్వం కోర్ట్ కు ప్రమాణ పత్రాన్ని గతంలో దాఖలు చేసింది. అక్కడ ఒకప్పుడు మందిరం ఉండేదనడానికి తగిన ఆధారాలను పురాతత్వ శాఖ కోర్ట్ కు సమర్పించింది కాబట్టి అక్కడ మందిర నిర్మాణానికి ఎవరికి అభ్యంతరాలు ఉండనవసరంలేదని ఆయన అన్నారు.

రామమందిర నిర్మాణం గురించి ప్రభుత్వంపై తాము ఎలాంటి ఒత్తిడి తీసుకురావడం లేదని, పరస్పర సమ్మతి ద్వారా ఒక పరిష్కారం కుదరాలని తాము భావిస్తున్నామని ఆయన వెల్లడించారు. పూజ్య సాధుసంతులతో మాట్లాడి పరిష్కారం కనుగొనాలని ఆయన అన్నారు. ఏ ప్రభుత్వామైనా చట్టం, సర్వ సమ్మతి అనే రెండు విషయాలను సంతులనం చేసుకుంటూ ముందుకు సాగుతుందని ఆయన అన్నారు.  పూర్తి బలం ఉన్నప్పటికి అయోధ్య విషయంలో ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురాకపోవడానికి కారణం కోర్ట్ పై ఉన్న విశ్వాసమేనని, కోర్ట్ కూడా  సున్నితమైన, సంవేదనశీలమైన మందిర విషయాన్ని అర్ధం చేసుకుని నిర్ణయాలు తీసుకోవాలని భయ్యాజీ కోరారు.

శబరిమల గురించి మాట్లాడుతూ ఇది దేవాలయాల్లో స్త్రీలకు ప్రవేశం కల్పించడం గురించి మాత్రమే అయితే తాము దానిని సమర్ధిస్తామని అన్నారు. హిందూ సమాజంలో ఏ పూజ చేయాలన్నా భార్యాభర్తలు ఇద్దరు ఉండాల్సిందేనని, హిందూ పరంపరలో స్త్రీ, పురుషుల మధ్య ఎలాంటి భేదభావం లేదని అన్నారు. అయితే దేవాలయాల్లో కొన్ని నియమాలు ఉంటాయని, ఏ సమాజమైనా కేవలం హక్కుల పైన కాకుండా పరంపర, ఆచారాల ప్రకారం నడుస్తుందని అన్నారు. అన్ని దేవాలయాల్లో మహిళలకు కూడా ప్రవేశం ఉండాలి కానీ కొన్ని ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్న దేవాలయాల గురించి ఆ దేవాలయపు వ్యవస్థలో ఉన్నవారితో చర్చించకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని ఆయన అన్నారు. అలా ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు కోర్ట్ దేవాలయ వ్యవస్థలోని అందరికీ నచ్చచెప్పడానికి ప్రయత్నించాలని అన్నారు.

కార్యకారిణి మండలి సమావేశాల గురించి చెపుతూ వీటిలో సంఘ కార్యాన్ని గురించి సమీక్ష జరిగిందని భయ్యాజీ వివరించారు. గత 6 ఏళ్లలో సంఘ కార్యం రెట్టింపు వేగంతో వృద్ధి చెందిందని అన్నారు. దేశం మొత్తంలో 35వేల 5వందల గ్రామాల్లో శాఖలు నడుస్తున్నాయని ఆయన వెల్లడించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కొత్తగా 1400 ప్రదేశాలకు చేరుకున్నామని అన్నారు. మొత్తం 55825 శాఖలు నడుస్తున్నాయని చెప్పారు. ఒక సంవత్సరంలో 22వందల శాఖలు పెరిగాయని వెల్లడించారు.

సాప్తాహిక్ మిలాన్ లు 17 వేల గ్రామాల్లో నియమితంగా జరుగుతున్నాయని ఆయన వివరించారు. నెలకొకసారి జరిగే సంఘమండలి కార్యక్రమాలు 9వేల గ్రామాల్లో జరుగుతున్నాయి. 61వేల స్థానాల్లో సంఘ ప్రత్యక్షంగా ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తోంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది స్వయంసేవకుల సంఖ్యలో లక్షకు పైగా పెరుగుదల ఉంది. తాలూకా, బ్లాక్, మండల్ విభజన ద్వారా కార్య విస్తరణ కోసం ప్రయత్నిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అలా 56వేల 6వందల మండల్ లు ఏర్పడ్డాయని, అందులో 32వేల మండల్ లలో కార్య విస్తరణ జరిగిందని తెలిపారు.

దేశవ్యాప్తంగా సంఘం 1.70 లక్షల సేవ ప్రకల్పాలు నిర్వహిస్తోంది. ఈ సేవా ప్రకల్పాలు గ్రామీణ, గిరిజన, నగర ప్రాంతాల్లో నడుస్తున్నాయి. 25 పెద్ద ఆసుపత్రులు, 12 బ్లడ్ బ్యాంక్ లు ఇందులో ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో ఒక ఉపాద్యాయుడు ఉండే ఏకల్ విద్యాలయాలు 50 వేల కంటే ఎక్కువ గ్రామాల్లో నడుస్తున్నాయి. అనేక గ్రామాల్లో ప్రాధమిక చికిత్సాలయాలు ఉన్నాయి. అలాగే 10 వేల ఆరోగ్య కార్యకర్తలు సాధారణ వ్యాధులకు గ్రామాల్లోనే చికిత్స అందజేస్తున్నారు. 20 వేల మహిళల స్వయంసహాయ బృందాలు నడుస్తున్నాయి. వీటితో పాటు హాస్టళ్లు, కోచింగ్ క్లాస్ ల నిర్వహణ కూడా జరుగుతోంది. గత సంవత్సరం దేశ వ్యాప్తంగా 30వేల మంది స్వయంసేవకులు 2వేల స్థానాల్లో 13లక్షల మొక్కలు నాటారు. రాబోయే రోజుల్లో ఈ కార్యాన్ని మరింత విస్తరించడం జరుగుతుంది. పర్యావరణ, జల సంరక్షణ విషయమై కార్యకారిణి మండలి  లోతుగా చర్చించిందని, రాబోయే కాలంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామని భయ్యాజీ వెల్లడించారు.