-చాడా శాస్త్రి
ప్రస్తుతం ఉన్న అనేక చట్టాలు కొన్ని దశాబ్దాల క్రిందట రూపొందించినవే. అప్పట్లో ఆహారాధాన్యలు కొరత తీవ్రంగా వుండేది. వాటిని దృష్టిలో ఉంచుకొని వ్యవసాయం మీద వ్యవసాయ ఉత్పత్తుల మీద పలు ఆంక్షలు పెట్టారు, ప్రోత్సాహకాలు ఇచ్చారు.
ఇక్కడ ముఖ్యంగా గుర్తు పెట్టుకోవలసింది. జనాభా పెరుగుతుంది కాని సాగు భూమి అంత ఎక్కువగా పెరగదు. 1947 లో 35 కోట్ల జనాభా నేటికి నాలుగు రెట్లు పెరిగి సుమారు 140 కోట్లు అయింది. అందుకని ఉన్న భూమిలోనే ఎక్కువ పంట వచ్చే విధంగా గ్రీన్ రెవల్యూషన్ తెచ్చి కొన్ని సంస్కరణలు, ఆధునిక పద్దతులు అంటే కార్పొరేట్స్ తయారు చేసిన హైబ్రిడ్ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు ఉపయోగించి వ్యవసాయ ఉత్పత్తి పెంచారు.
ఏ వస్తువు అయినా ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేస్తేనే వస్తువు ఉత్పత్తి ధర తగ్గుతుంది. కానీ వ్యవసాయం దగ్గరకు వచ్చేసరికి దేశంలో ఎక్కువ శాతం మంది రైతులు తక్కువ ప్రమాణంలో సాగు భూమి ఉండడంతో ఎక్కువ మొత్తములో ఉత్పత్తి చేసే అవకాశం లేక ఉత్పత్తి ఖర్చులు పెరిగి ఉత్పత్తి ధర పెరుగుతోంది. కారణం అవసరానికి మించి ఎక్కువ మంది కార్మికులు వ్యవసాయం మీద ఆధార పడడం.
ఎందుకు ఇలా వ్యవసాయ రంగం మీద ఎక్కువ మంది ఆధార పడుతున్నారంటే మన దేశంలో వ్యవసాయం వంశపారంపర్యంగా వస్తోంది. ఒక తాతకు 1947లో 10 ఎకరాలు ఉంటే అది పిల్లల మధ్య పంపకాలుతో మనవడి దగ్గరకు వచ్చేసరికి 2.5 ఎకరాలు అవుతోంది.
10 ఎకరాలు భూమి వున్నప్పుడు తాత కుటుంబం ఆర్ధికంగా మంచి స్థితిలోనే ఉండేది. కారణం తాతకు అప్పుడు ఇద్దరు కొడుకులు, మొత్తం కుటుంబం నలుగురే. కాని ఇప్పుడు మనవడికి ఆ పరిస్థితి లేదు. కారణం అదే 10 ఎకరాల భూమి మీద ఒక్కో కొడుక్కు ఇద్దరు పిల్లలు అనుకున్నా తాత, మామ్మ, తల్లిదండ్రులు తో కలిసి మొత్తం అదే 10 ఎకరాల భూమి మీద 10 మంది బతకాలి. కారణం వ్యవసాయం బయట సరి అయిన ఉపాధికల్పన లేకపోవడం.
కుటుంబాల్లో ఈ పంపకాలు వల్ల సాగు భూమి చిన్న కమతాలుగా మారి హద్దుల కోసం కొంత భూమి వృధా అయి ఆధునిక పనిముట్లు అవి వాడలేకపోవడంతో ఉత్పత్తి తక్కువ వస్తుంది, కానీ ఉత్పత్తి ఖర్చులు అంటే విత్తనాలు, ఎరువులు, మందులు ఖర్చు పెరుగుతూనే ఉంటుంది. రైతుకు చేతికి వచ్చే ఆదాయం తగ్గుతుంది. ఒకే పంట పదే పదే ఒక భూమిలో వేస్తూ వుండడటంతో భూమి సారం కూడా ప్రతీ సంవత్సరం తగ్గుతూ వచ్చి దిగుబడి తగ్గుతోంది.
ఇప్పుడు అంతా MSP అంటే కనీస మద్దత్తు ధర పెంచాలి అని అడుగుతున్నారు. అంటే మద్దత్తు ధరలు పెరిగే కొద్దీ రిటైల్ లో వినియోగదారుల ధరలు పెరుగుతాయి. ఉదాహరణకు వరికి ఇప్పుడు మద్దత్తు ధర సుమారు 1900 ఉంది. అంటే రిటైల్ లో బియ్యం ధర 40 నుండి 50 వరకు ఉంటుంది క్వాలిటీ బట్టి. అంటే అదే మద్దత్తు 3000 చేస్తే రిటైల్ ధరలు kg 70-80 ఉంటాయి. ఇలా ధరలు పెరిగితే ఎక్కువగా ఇబ్బంది పడేది అల్ప ఆదాయ వర్గాలవారే.
వారికి అసలే ఉన్న స్వల్ప ఆదాయాల్లో తిండి కోసమే ఇంకా ఖర్చుచేయవలసి వస్తుంది. మళ్లీ ప్రభుత్వం రేషన్ ద్వారా సబ్సిడీ లు ఇచ్చి బీదవారికి చవగ్గా సప్లై చేయవలసి వస్తుంది. ఆ సబ్సిడీ డబ్బులు సాధారణ పౌరులే వివిధ టాక్స్ లు ద్వారా ప్రభుత్వానికి చెల్లించాలి.
MSP లు బాగా వస్తున్నాయి అని దేశంలో వరి, గోధుమ పంటలు ఎక్కువగా వేస్తున్నారు. ప్రభుత్వం ఆ పంటలను FCI ద్వారా కొనుగోలు చేసి నిల్వ చేస్తోంది. మన దేశానికి ఆహార బధ్రతా నిల్వలు 41 మిలియన్ టన్నులుగా లెక్క వేశారు. కానీ ప్రస్తుతం అవి సుమారు 90 మిలియన్ టన్నులకు పైబడి ఉన్నాయి. అంటే ఇలా అవసరం లేని నిల్వలు విలువ అక్షరాలా 1,80,000 కోట్లు. ఊరికే వృధాగా గోడౌన్స్ లో పడి ఉన్నాయి. గోధుమలు నిల్వ చేయడానికి గోడౌన్స్ చాలక ఆరుబయట ప్లాస్టిక్ కవర్లు కప్పి ఉంచుతున్నారు వీటి నిర్వహణ ఖర్చు ప్రభుత్వానికి తడిసిమోపుడు అవుతోంది.
అయినా FCI ఈ సరుకులు వదిలించుకోక పోతే మళ్లీ కొత్త పంట ఎలా కొనుగోలు చేస్తారు? అందుకే FCI సేకరించిన ధర కన్నా తక్కువ ధరకు బయట మార్కెట్ లో వేలం వేసి అమ్ముతోంది. బయట నిలవ ఉంచుతున్న గోధుమలు తడిసిపోతున్నాయి కాబట్టి వాటిని ఆల్కహాల్ పరిశ్రమల కు చవగ్గా అమ్మేస్తున్నాది.
అంటే చివరకు టాక్స్ పేయర్ ఈ వ్యాపారస్తులకు, అల్కహాల్ ఫ్యాక్టరీ వాళ్లకు తక్కువ ధరకు ముడి సరుకు సప్లై చేస్తున్నాడు అన్న మాట.
పోనీ ఈ అదనపు నిల్వలు విదేశాలకు ఎగుమతి చేద్దామనుకుంటే పెద్ద కమతాల్లో పండిస్తూ అత్యంత ఆధునిక వ్యవసాయ పద్దతులు అవలంబిస్తున్న విదేశాలు అంటే అమెరికా చైనా బ్రెజిల్ మొ. దేశాల్లో ఉత్పత్తి ఖర్చులు తక్కువుగా ఉండి అక్కడ ఉత్పత్తి ధరలు తక్కువగా ఉంటాయి.. ఇక్కడ ఉత్పత్తి ధరల కంటే ఆ దేశాల్లో ధరలు తక్కువ ఉంటే ఇక్కడ పండించిన ఎక్కువ ఉత్పత్తులు ఎగుమతి చేసే అవకాశం కూడా ఉండదు. అంతే కాక ఇక్కడ ఎగుమతుల కోసం అంటూ ప్రత్యేకంగా పండిస్తే కానీ మన సాధారణ ఆహార ధాన్యాలు అంతర్జాతీయ ప్రమాణాలకు సరిపోవు.
అలా కాక రైతులు అందరూ పోలోమని ఈ వరి, గోధుమలు కాకుండా వాణిజ్య పంటలు, విదేశాల్లో బాగా డిమాండ్ ఉన్న వస్తువులకు సంబంధించిన పంటలు వేసుకుంటే వారి ఆదాయాలు మెరుగుపడతాయి. దేశానికి విదేశీ మారక ద్రవ్యం లభిస్తుంది. కానీ ఇలా వేయడానికి చిన్న రైతులు ధైర్యం చెయ్యలేరు.
మరి దీనికి పరిష్కారం?
MSP లు పెంచుతూ పోవడం కాదు. ఉత్పత్తి ఖర్చులు తగ్గించే మార్గాలు వెతకాలి. ఉన్న భూముల్లోనే ఎక్కువ మొత్తాలలో పంటలు పండించి ఖర్చులు తగ్గించే విధంగా విదేశాలలో లాగా కార్పొరేట్ ఫార్మింగ్ లేదా కనీసం కాంటాక్ట్ ఫార్మింగ్ చేపట్టాలి. ఒకటి రెండు ఎకరాల్లో కాకుండా ఒకేసారి ఒక వంద రెండు వందల హెక్టార్లలో పంటలు పండించే ప్రణాళికలు చెయ్యాలి. రైతులు తమ భూములను ఎదో కంపెనీకి కౌలుకి ఇవ్వాలి. రైతులకు ఖచ్చితమైన కౌలు డబ్బులతో పాటు ఆ వ్యవసాయ క్షేత్రంలో తిరిగి పనిచేసి వేతనం పొందవచ్చు. రైతు రెండు విధాలా ఆదాయం పొందుతాడు ఏ విధమైన రిస్క్ లేకుండా. ఖాళీ సమయాల్లో వేరే పనులుకు కూడా పోవచ్చు.
అప్పుడు ప్రభుత్వాలకు ఈ MSP లు బెడద తప్పుతుంది. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు కూడా తగ్గుతాయి. ధరలు డిమాండ్ మరియు సప్లై ఆధారంగా నిర్ణయం అవుతాయి. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు పెరిగి దేశానికి ఫారెన్ ఎక్స్చేంజి ఆదాయాలు పెరుగుతాయి. నా చిన్న తనంలో పంచదార మీద ఇటువంటి ప్రభుత్వ ఆంక్షలు ఉండేవి. రేషన్ లో ఇచ్చే 3/4కేజీలు తక్కువ ధరకు దొరికేది. మిగతాది బ్లాక్ మార్కెట్ లో చాలా హెచ్చు ధరకు కొనుక్కోవలసి వచ్చేది.
పంచదార మీద ప్రభుత్వ అజమాయిషీ తీసేసిన దగ్గర నుండి మార్కెట్ లో పంచదార తక్కువ ధరలో ఎంత మొత్తములో అయినా ఇప్పుడు దొరుకుతొంది. అలాగే ప్రభుత్వం పరిశ్రమలు అన్ని ప్రాంతాలలో అభివృద్ధి చెందేటట్లు చూసి వ్యవసాయ పనులపై ఎక్కువగా ఆధారపడుతున్న కార్మికులను పారిశ్రామిక కార్మికులుగా తయారు చేయాలి. కమ్యూనిస్ట్ దేశం అయిన చైనా 1978 లోనే ఈ తరహా వ్యవసాయ సంస్కరణలు మొదలు పెట్టి విజయం సాధించింది.