Home News బెంగళూరులో ఆర్.ఎస్.ఎస్ అఖిల భారతీయ ప్రతినిధి సమావేశాలు

బెంగళూరులో ఆర్.ఎస్.ఎస్ అఖిల భారతీయ ప్రతినిధి సమావేశాలు

0
SHARE

అఖిల భారతీయ ప్రతినిధి సభ సమావేశాలు ఈ నెల 19, 20 లలో బెంగళూరులో జరుగుతాయని ఆర్.ఎస్.ఎస్ అఖిల భారత ప్రచార ప్రముఖ్ శ్రీ అరుణ్ కుమార్ తెలియజేశారు. ప్రతినిధి సభ సమావేశాల గురించి ఆయన పత్రికల వారికి సమాచారం అందించారు. ఈ సమావేశాల్లో భవిష్యత్ కార్యక్రమాల గురించి చర్చతోపాటు ప్రణాళిక రూపొందించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. దేశంలోని అన్నీ రాష్ట్రాల నుంచి ప్రతినిధులుగా ఎన్నికైన వారితోపాటు రాష్ట్రాల కార్యదర్శులు(కార్యవాహ), అధ్యక్షులు (సంఘచాలక్), ప్రచారక్ లు ఇందులో పాల్గొంటారు. ఒక రోజు ముందు (మార్చ్18) అఖిల భారతీయ కార్యకారి మండలి సమావేశం జరుగుతుందని అరుణ్ కుమార్ తెలిపారు.

ప్రతినిధి సభ సమావేశాలు గత ఏడాది బెంగళూరులో జరగాల్సిందని, కానీ కోవిడ్ మహమ్మారి కారణంగా సమావేశాలు రద్దయ్యాయని, కనుక సమావేశాలు ఈసారి కూడా ఇక్కడే ఏర్పాటుచేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈసారి కూడా పరిస్థితులు పూర్తిగా సర్దుకోనందున 15వందలమందికి బదులుగా 450 మంది మాత్రమే ఈ సమావేశాలకు వస్తున్నారని, మిగిలినవారు వారివారి ప్రాంతాల నుంచి ఆన్ లైన్ ద్వారా సమావేశాల్లో పాల్గొంటారని అరుణ్ కుమార్ తెలిపారు. మూడురోజులకు బదులు సమావేశాలు రెండురోజులు మాత్రమే ఉంటాయి.

మొదటిరోజు వార్షిక నివేదిక సమర్పించడం, తీర్మానాలకు సంబంధించి విషయాన్ని నిర్ణయించడం జరుగుతుందని, ఆ వివరాలు మాననీయ సహ సర్ కార్యవాహ మన్మోహన్ వైద్య పత్రికలవారికి అందజేస్తారని అరుణ్ కుమార్ తెలిపారు. రెండవరోజు గత మూడేళ్ళ కార్య సమీక్ష ఉంటుందని, అందులో కొత్తగా ఏర్పాటుచేసిన పర్యావరణ గతివిధి(కార్యవిభాగం) క్రింద చేపట్టిన ప్లాస్టిక్ వాడకం తగ్గించడం, జల సంరక్షణ మొదలైన కార్యక్రమాల గురించి చర్చ ఉంటుంది. అలాగే కరోన సంక్షోభ కాలంలో సంఘ స్వయంసేవకులతో కలిసి పనిచేసిన అనేకమంది వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలతో కలుపుకుని మరింత బృహత్తరమైన సామాజిక పరివర్తన ప్రణాళికను రూపొందించే చర్చ కూడా జరుగుతుందని ఆయన వెల్లడించారు. రాగల 3 ఏళ్లలో చేపట్టవలసిన కార్యక్రమాల ప్రణాళిక కూడా నిర్ణయమవుతుంది. ఇదే రోజు సర్ కార్యవాహ ఎన్నిక కూడా జరుగుతుంది.

తరువాత విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. రిజర్వేషన్ ల గురించి అడిగిన ప్రశ్నకు సంధానమిస్తూ ఈ విషయంలో సంఘ అనేకసార్లు తన విధానాన్ని స్పష్టం చేసిందని, రాజ్యాంగబద్ధమైన అంశానికి సంఘ సమర్ధన ఎప్పుడూ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సమావేశాల చివరిరోజున(మార్చ్20) సర్ కార్యవాహ పాల్గొనే పత్రిక ప్రతినిధుల సమావేశంలో అన్నీ ప్రశ్నలకు సమాధానం చెపుతారని అరుణ్ కుమార్ తెలిపారు.

https://www.facebook.com/samacharabharati/posts/1586214754907486