- రంగంలోకి స్వయంసేవకులు
- మర పడవలతో ప్రత్యక్ష సహాయక చర్యలు
- ఆహార పదార్థాలు అందజేత
వరదనీటిలో.. అక్కడక్కడా మరపడవలు. ఒక్కో పడవలో ఆహార పొట్లాలు.. తాగునీరు తీసుకొని ఖాకీ నిక్కర్లు వేసుకున్న నలుగురు వ్యక్తుల ప్రయాణం. వరదనీటిలో సాయం కోసం ఎదురు చూస్తున్న వారికి పొట్లాలు అందించడం. వారిని సహాయక శిబిరాల్లోకి తరలించడం. ఇది ప్రకృతి ప్రకోపానికి గురైన దేవభూమి కేరళలో వారం రోజులుగా కన్పిస్తున్న దృశ్యం. చిన్న సాయం చేసి సోషల్ మీడియాతో పాటు.. మీడియాలో విపరీత ప్రచారం చేసుకునే వాళ్లున్న సమయంలో.. వీళ్లు ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఇంతకీ మరపడవల్లో ఉన్నవారెవరూ..? ఈ దృశ్యాలు ఎక్కడా ఏ మీడియాలో ఎందుకు కన్పించడం లేదు. దీనిపై “విజయక్రాంతి” అందిస్తున్న కథనం.
దేశంలో దేవభూమిగా పేరుగాంచిన కేరళపై ప్రకృతి కన్నెర్రజేసింది. 1924 తర్వాత ఎన్నడూ లేనంతగా వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తాయి. జన జీవనం స్థంబించి పోయింది. ఈ విపత్తుతో కేరళ పరిస్థితి దారుణంగా మారిపోయింది. అనేక చోట్ల ప్రజలు వరదల్లో చిక్కుకుపోయారు. ఆహారం, నీరు లేక అల్లాడిపోతున్నారు. సాయం కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు. దాదాపు 13జిల్లాల్లో ఇంకా రెడ్ అలర్ట్ కొనసాగుతుండటమే ఇందుకు నిదర్శనం. దాదాపు 100 డ్యాములు, రిజర్వాయర్లు, నదులు మునిగిపోయాయి. రహదారులు ధ్వంసమయ్యాయి. ఆగస్టు 26వరకు కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. వందలాది సహాయక శిబిరాల్లో లక్షల మంది ప్రజలు బిక్కుబిక్కు మంటున్నారు.
ఇప్పటికి 324 మంది మృతి చెందగా 3 లక్షలమంది ప్రజలు నిరాశ్రయులయ్యారని అధికారికంగా వెలువడిన లెక్కలు. అయితే.. వాస్తవ లెక్కలు ఇంతకు మించి ఉంటాయని, సమస్య తీవ్రతను పరిశీలిస్తే అర్థమవుతోంది. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్న.. ప్రజల అభిమానం చూరగొని. తమను తాము గొప్పవాళ్లుగా అభివర్ణించుకునే వారు.. ప్రకటనలకు.. ట్విట్టర్లో సందేశాలకు పరిమితమైతే.. వరద బీభత్సం ప్రారంభమైన రోజు నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్ఎస్) రంగంలోకి దిగింది. ఆ సంస్థకు సంబంధించిన వేలాదిమంది స్వయం సేవకులు బాధితులకు అండగా నిలిచారు. మరపడవలను సమకూర్చుకొని రంగంలోకి దిగారు. 150 మరపడవల్లో ఒక్కో దానిలో నలుగురు చొప్పున 600 మంది స్వయం సేవకులు ప్రత్యక్షంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.
ఎక్కడికక్కడ ఆ సంస్థ సభ్యులు సమకూరు స్తున్న ఆహార పొట్లాలను, తాగునీరు, దుస్తులను తీసుకొని వరద ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. చిక్కుకున్న వారిని రక్షించడానికి తాళ్లు సమకూర్చుకొని వెళ్తున్నారు. సైనికులు కూడా వెళ్లడానికి వీలులేని ప్రాంతాలకు సాహోసపేతంగా స్వయంసేవకులు వెళ్తున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడంతో పాటు ఆహార పొట్లాలు, దుస్తులు అందిస్తున్నారు. సహాయక శిబిరాలను ఏర్పాటు చేయడంతో పాటు నిరాశ్రయులను అక్కడికి చేరుస్తున్నారు. వారికి ఆహారం అందించడంతో పాటు వైద్య సాయం అందిస్తున్నారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న సైనికులు, ప్రభుత్వ సిబ్బందికి సైతం సహాయపడుతున్నారు. ఆర్ ఎస్ ఎస్ కేరళ ప్రాంత ప్రచారక్ పీఈబీ మీనన్. ప్రాంత కార్యావహ్ గోపాలన్ కుట్టి నేతృత్వంలో గడిచిన వారం రోజులుగా వారు నిత్యం శ్రమిస్తున్నారు.
చిన్నసాయం చేసిన వారు.. చేసిన సాయానికి ఎన్నోరెట్ల ప్రచారం కోరుకునే సమయంలో ప్రకృతి విపత్తితో అల్లాడుతూ దీనస్థితిలో ఉన్న ప్రజలకు సాయం చేస్తూ కనీన ప్రచారం కూడా ఆర్‌ఎస్‌ఎస్ కోరుకోవడం లేదు. ఆ సంస్థ నైజం కూడా అదే. అయితే ఆ సంస్థ ప్రచారం కోరుకోకున్నా.. ఆ సంస్థను వ్యతిరేకించే వారు మాత్రం నిత్యం వార్తల్లో నిలుపుతున్నారు. ఎవరు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా.. ఆర్‌ఎస్‌ఎస్ పట్టించుకోకుండా తన కార్యకలాపాల్లో నిమగ్నమవుతోంది. అది దేశంలో ఎక్కడ ఎలాంటి విపత్తులు ఎదురైనా.. నేనున్నానంటూ ఆ సంస్థకు చెందిన స్వయం సేవకులు రంగంలోకి దూకుతారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1977లో జరిగిన దివిసీమ ఉప్పెన చోటు చేసుకున్న సమయం లో స్వయంసేవకులు చేసిన సాయం ఇప్పటికి మరపురాదు. ఆనాటి సేవలో ప్రస్తుత ఎంపీ బండారు దత్తాత్రేయ లాంటి వారు స్వయంసేవకులుగా ప్రత్యక్షంగా పాల్గొన్నారు. కానీ, వలిగొండలో జరిగిన రైలు ప్రమాదంలో కానీ ఆ సంస్థ నిర్వహించిన పాత్ర ప్రశంసనీయం. దేశంలో ఎక్కడ ఏది జరిగిన దానికి ఆర్‌ఎస్‌ఎస్ అండగా నిలిచిదంటూ ప్రచారం చేస్తూనే ఉండడం పరిపాటి. గడిచిన వారం రోజులుగా ఆర్‌ఎస్‌ఎస్ పేరు ఎక్కడా ఎవరూ ఉచ్చరిం చడం లేదు. పత్రికల్లో, మీడియాలో సదరు సంస్థ పేరుతో వార్తలు కనబడడం లేదు. సంబంధంలేని సంఘటనలకు ఆర్‌ఎస్‌ఎస్‌కు అంటగట్టే ఈ లౌకికవాదులు.. లేదా సంస్థలతో పాటు మీడియాకు.. వారం రోజులుగా సాహసంగా ఆర్‌ఎస్‌ఎస్ చేస్తున్న సాయం కన్పించడం లేదాఅన్నది ఇక్కడ ప్రశ్నార్థకం.
సాయం చేయండి-: ప్రాంత ప్రచారక్ పీఈబీ మీనన్
వరద కారణంగా ఇబ్బందిపడుతున్న ప్రజలకు సాయం అందించాలని ఆర్‌ఎస్‌ఎస్ కేరళ ప్రాంత ప్రచారక్ పీఈబీ మీనన్ ఒక ప్రకటనలో కోరారు.
సాయం అందించేవారు దేశీయ సేవా భారతి కేరళ, ధనలక్ష్మీ బ్యాంక్, బ్రాంచి ఎస్‌ఎల్‌పురం. ఖాతా నెం బర్ 002700100040740, ఐఎఫ్‌ఎస్సీ కోడ్, DLXB 0000027కు పంపించాలని కోరారు.
(విజయక్రాంతి సౌజన్యం తో)