ఇటీవల సంభవించిన ‘తిత్లి’ తుఫాను శ్రీకాకుళం జిల్లాలోని వజ్రపు కొత్తూరు తదితర 10 మండలాలను దెబ్బతీసింది. పలాస రైల్వేస్టేషన్‌లోని పై కప్పులు ఎగిరిపోయాయి. పలాసకు దగ్గరలో ఉన్న టోల్‌గేట్ కప్పులు ఎగిరిపడ్డాయి. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీలు వాయుగుండం ధాటికి ప్రక్కకు ఒరిగి పోయాయి. ఇక సామాన్యుల గృహాల గురించి చెప్పనవసరం లేదు. 7 గురు మృత్యువాత పడ్డారు. గాలుల ఉధృతికి వేలాది ఎకరాలలో ప్రధాన పంటలైన కొబ్బరి, జీడి, మామిడి తోటలు దెబ్బతిన్నాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మత్స్యకారుల పడవలు దెబ్బతిన్నాయి. బహుదా నది పొంగి ప్రవహించి జాతీయ రహదారిని దిగ్భంధనం చేసింది. ఎటూ కదలలేని స్థితి. కరంటు లేదు. మంచినీరు లేదు. మార్గాలన్నీ దిగ్భంధనమయ్యాయి.
ప్రకృతి విపత్తు సంభవించిన ప్రతి సందర్భం లోనూ మేమున్నామంటూ ముందుకు వచ్చి బాధితులకు చేయూతనిచ్చే రాష్ట్రీయ స్వయంసేవక సంఘ కార్యకర్తలు ఈ సందర్భంలో కూడా తక్షణం స్పందించారు. గ్రామాలలో పర్యటించి, తుఫాను బాధితుల తక్షణ అవసరాలను గుర్తించి, వారికి అవసరమైన సాయం అందించారు. అలాగే ప్రకృతి వైపరీత్యాల సమయంలో బాధితులకు సేవలందించే ‘జనసంక్షేమ సమితి’ ఆధ్వర్యంలో కొవ్వొత్తులు, మంచినీరు అందించడం ప్రారంభించారు. ప్రభుత్వ యంత్రాంగం చేరుకోలేని గ్రామాలకు సైతం సంఘ కార్యకర్తలు చేరుకుని ప్రజలకు సేవలందించారు.
సుమారు 75 గ్రామాలలోని వేలాది కుటుంబాలకు కొవ్వొత్తులు, మంచినీరు, 10 వేల దోమతెరలు అందించారు. తన వంతు కర్తవ్యంగా విశాఖ పట్నంలోని భారతీయ విద్యాకేంద్రం, విజ్ఞాన విహార పాఠశాలలు తుఫాను బాధితులైన 10 వేల కుటుం బాలకు తక్షణం కొవ్వొత్తులు, ఇంటికప్పు ఎగిరిపోయిన కుటుంబాల వారికి టార్పాలిన్స్ అందించారు. ఇంకా చాలా చేయవలసి ఉంది. కొన్ని గ్రామాల ప్రజలకు పై కప్పు కొఱకు సిమెంటు రేకులు ఇవ్వవలసి ఉన్నది. పడవలు కోల్పోయిన మత్స్య కారులకు పడవలు ఇవ్వవలసి ఉన్నది. జీవనాధారమైన కొబ్బరి, జీడి మామిడి మొక్కలు పంపిణీ చేయవలసి ఉన్నది. వదాన్యులు, సేవా తత్పరులు తుఫాను బాధితులను ఆదుకోవలసిందిగా మనవి.
స్వయంసేవకుల సంకల్పానికి నిదర్శనం
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం దసరా శెలవుల సమయంలో స్వయంసేవకుల శిక్షణ కోసం ప్రాథమిక శిక్షణ వర్గ నిర్వహిస్తుంది. ఈ వర్గ 7 రోజులపాటు ఉంటుంది. అలా ఈ సంవత్సరం జరిగిన శ్రీకాకుళం జిల్లా ప్రాథమిక శిక్షణ వర్గ 300 మందితో ఇచ్చాపురంలో ప్రారంభమైంది. వర్గ పారంభమైన రోజు ఉదయం తీవ్రమైన తుఫాను. 165 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వర్గలో పాల్గొంటున్న శిక్షార్థుల గ్రామాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వర్గ నిర్వహించే నిర్వాహకులూ ఆ గ్రామాలకు చెందినవారే. వర్గ జరిగే ప్రాంతంలో నీరు లేదు, కరెంటు లేదు. బయట గాలులతో కూడిన భారీ వర్షం. విశేషం ఏమిటంటే ఎవ్వరూ ఇంతటి భయానక వాతావరణాన్ని చూసి భయపడలేదు. ఇంటికి వెళ్లిపోవాలనుకోలేదు. ఒక్కరంటే ఒక్కరికి కూడా ఆ ఆలోచన రాలేదు. శిక్షణ పూర్తి చేయాలన్న దృఢ సంకల్పంతో వచ్చారు. వర్గ ముందుగా అనుకున్న ప్రకారం 7 రోజులూ జరిగింది. శిక్షణ పూర్తి చేశారు. స్వయంసేవకుల సంకల్ప శక్తికి నిదర్శనం ఈ సంఘటన.
(జాగృతి సౌజన్యం తో )