Home News ‘ఆర్‌.ఎస్‌.ఎస్’ యావ‌త్ సమాజానికి చెందిన సంస్థ – డాక్టర్ మన్మోహన్ వైద్య జీ

‘ఆర్‌.ఎస్‌.ఎస్’ యావ‌త్ సమాజానికి చెందిన సంస్థ – డాక్టర్ మన్మోహన్ వైద్య జీ

0
SHARE

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనే సంస్థ మొత్తం సమాజానికి చెందిన సంస్థ అని ఆర్‌.ఎస్‌.ఎస్ వ్య‌వ‌స్థాప‌కులు, మొద‌టి సర్ సంఘచాలక్ డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ జీ అన్నార‌ని, గత 99 సంవత్సరాలుగా దీనిని అనుభవిస్తున్నామ‌ని ఆర్‌.ఎస్‌.ఎస్ స‌హ స‌ర్ కార్య‌వాహ డాక్టర్ మన్మోహన్ వైద్య అన్నారు. అఖిల భారత ప్రతినిధుల సభ ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ 2017 నుండి 2024 వరకు సంఘ పని పరిధిని అంచనా వేయడం ద్వారా, దాని సమగ్రత దృష్టికి వస్తుంద‌ని తెలిపారు. దేశంలోని 99 శాతం జిల్లాల్లో సంఘ పని కొనసాగుతోంద‌న్నారు.

అంతకుముందు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారత ప్రతినిధి సభను పూజనీయ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ జీ భగవత్ జీ, మాననీయ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే జీ భారత మాత చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రారంభించారు. ఈ సంవత్సరం మహారాష్ట్ర, నాగ్‌పూర్ లోని రేషిమ్ బాగ్, స్మృతి మందిర్ ప్రాంగణంలో మార్చి 15-17 వరకు సమావేశాలు జరగనున్నాయి. మొత్తం 45 ప్రాంతాల నుండి 1500 మందికి పైగా ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు.

ఈ సంద‌ర్భంగా డాక్టర్ మన్మోహన్ వైద్య జీ సంఘ్ పని విస్తరణ గురించి మాట్లాడుతూ, “పని దృష్ట్యా సంఘంలో 45 ప్రాంతాలున్నాయి. తరువాత స్థాయిలో విభాగ్, జిల్లా, ఖండలున్నాయి. అలా 922 జిల్లాల‌లోని 6597 ఖండ‌ల‌లో 12-15 గ్రామాల‌ను క‌లిపి ఒక మండ‌ల్ గా ప‌రిగ‌ణిస్తారు. అటువంటి 27720 మండ‌ల్ ల‌లో 73,117 దైనందిన శాఖ‌లు న‌డుస్తున్నాయి. గతేడాది కంటే 4466 శాఖలు పెరిగాయి. ఈ శాఖలలో 60 శాతం విద్యార్థి శాఖ‌లు, 40 శాతం ఉద్యోగ లేదా వ్యాపార కార్మిక శాఖ‌లున్నాయి. ఇందులో 40 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 11 శాతం. సాప్తాహిక్ ల‌ సంఖ్య 27,717 కాగా, గతేడాది కంటే 840 పెరిగాయి. సంఘ మండలి సంఖ్య 10,567. నగరాలు, మెట్రోలలోని 10 వేల బ‌స్తీల‌లో 43 వేల శాఖలు న‌డుస్తున్నాయి.

మహిళా సమన్వయం

మహిళా సమన్వయ పనిలో, రాష్ట్ర సేవికా సమితి, వివిధ సంస్థలలో క్రియాశీలక మహిళా కార్య‌క‌ర్త‌లు 44 ప్రాంతాల‌లో 460 మహిళా సదస్సులు నిర్వహించారు. ఇందులో 5 లక్షల 61 వేల మంది మహిళలు పాల్గొన్నారు. సంఘ శతాబ్ది సంవత్సరానికి సన్నాహక కోణంలో ఇది ముఖ్యమైనది. భారతీయ ఆలోచన, సామాజిక మార్పులో మహిళల చురుకైన భాగస్వామ్యాన్ని పెంచడం దీని ఉద్దేశం.

అహల్యాబాయి హోల్కర్ త్రిశ‌తాబ్ది జయంతి ఉత్స‌వాలు మే 2024 నుండి ఏప్రిల్ 2025 వరకు జరుపుకోబోతున్నారు. మతపరమైన స్థలాలను పునర్నిర్మించి, అణగారిన వారి ఆర్థిక స్వావలంబన కోసం తీవ్రంగా కృషి చేసిన గొప్ప అహల్యాబాయి రచనల గురించి సమాజానికి పెద్దగా తెలియదు. ఆమె సేవ‌ల‌ గురించి దేశవ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు ఉద్దేశ్యంతో సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 100% ఓటింగ్‌ జరిగేలా సంఘ స్వ‌యంసేవ‌కులు ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పిస్తారని డాక్టర్ మన్మోహన్ జీ వైద్య తెలిపారు.

అయోధ్యలో రాంలాలా దీక్షతో సంఘ్‌కి విస్తృత ప్రజా సంపర్కం ఏర్పడింది. అక్షింత‌ల పంపిణీ కార్య‌క్ర‌మంలో స్వయంసేవకులు సహా 44 లక్షల 98 వేల 334 మంది రామభక్తులు 5,78,778 గ్రామాలు, 4,727 నగరాల్లోని 19 కోట్ల 38 లక్షల 49 వేల, 71 కుటుంబాలకు చేరుకున్నారు. అన్ని చోట్లా లభించిన ప్రోత్సాహకర స్పందన, సాదర స్వాగతం సమాజంలో ఆర్‌ఎస్‌ఎస్ పట్ల ఉన్న విశ్వాసానికి భరోసానిచ్చిందని డాక్టర్ మన్మోహన్ జీ అన్నారు.

సంఘ శిక్షా వ‌ర్గ‌ల‌లో నూత‌న అంశాలు

సంఘ శిక్షా వర్గలు కూర్పునకు కొత్త అంశాలు జోడించాలని నిర్ణయించారు. ఇంతకుముందు ప్రాథమిక శిక్షా వర్గ 7 రోజులు, ప్రథమ వర్ష 20 రోజులు, ద్వితీయ వర్ష 20 రోజులు, తృతీయ వర్ష 25 రోజులు ఉండేవి. ఇప్పుడు కొత్తగా 3 రోజుల ప్రారంబిక్ వర్గ, 7 రోజుల ప్రాథమిక, 15 రోజుల ప్ర‌థ‌మ వ‌ర్ష, కార్య‌క‌ర్త వికాస వ‌ర్గ – 1, 20 రోజులు, కార్య‌క‌ర్త వికాస వ‌ర్గ- 2,25 రోజులు ఉంటుంది. ఈ శిక్షావ‌ర్గ‌ల‌లో ప్రత్యేకంగా ఆచరణాత్మక శిక్షణ కూడా ఉంటుంది.

2017 నుండి 2023 వరకు ప్రతి సంవత్సరం RSS.org ఈ వెబ్‌సైట్‌లో RSSలో చేరడానికి లక్షకు పైగా అభ్యర్థనలు నిరంతరం వస్తున్నాయి. అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట తర్వాత జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఈ సంఖ్యలు రెట్టింపయింద‌ని మ‌న్మోహ‌న్ జీ వైద్య తెలిపారు. మీడియా స‌మావేశంలో అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ జీ, స‌హ ప్ర‌చార ప్ర‌ముఖులు నరేంద్ర కుమార్ జీ, అలోక్ కుమార్ జీ కూడా పాల్గొన్నారు.