“లక్షలాదిమంది స్వయంసేవక్ లు పాల్గొనే సంఘ శిబిరాలలో పాల్గొనడం అంటే ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. ఇటీవల భాగ్యనగర్ లో జరిగిన విజయదశమి ఉత్సవంలో పాల్గొన్నాను. పూర్తి గణవేష్ లో 10వేల మంది స్వయంసేవకులు ఘోష్ కు తగ్గట్లుగా అడుగులు వేస్తూ చేసిన పథ సంచలనం (రూట్ మార్చ్) అద్భుతమనిపించింది. సంఘ శక్తి ఎంతటిదో తెలిసింది. అయితే ఐటీ మిలన్ ధ్వజ ప్రదాన ఉత్సవంలో 32మంది పాల్గొనడం నాకు మరింత ఆనందాన్ని కలిగించింది. ఎందుకంటే అప్పటివరకూ మిలన్ లో సంఖ్య 4కు మించేది కాదు. సంఘ కార్యక్రమాల సంఖ్యతో పోలిస్తే 32 సంఖ్య చాలా తక్కువే. కానీ దానికోసం ఒక జట్టుగా మేము పనిచేసిన తీరు మాకు ఎప్పటికీ గుర్తుంటుంది. మొదటి నెల జీతం తీసుకోవడంలో చాలా ఆనందం, తృప్తీ వుంటాయి. కానీ ఇందులో మరింత గొప్ప అనుభూతి ఉంటుంది.’’ అని ఆర్.ఎస్.ఎస్ ఐటీ మిలన్ కార్యవాహ్ జానకి చౌదరి అన్నారు.
హైదరాబాద్, సికంద్రాబాద్ లలో జరిగే 50 ఐటీ మిలన్ లలో త్యాగరాజ ఐటీ మిలన్ ఒకటి. ఒక ఐటీ మిలన్ లో సగటు హాజరు 10 కంటే ఎక్కువ, పూర్తి సంఘ గణవేష్ (యూనిఫాం) ఉన్నవారి సంఖ్య 20 దాటినప్పుడు మాత్రమే ఆ మిలన్ కు ధ్వజం ఇవ్వడం జరుగుతుందని కేశవపురం ఖండ్ కార్యవాహ్ శ్రీపాద్ మన్ సబ్దార్ తెలిపారు.
కేవలం 10 ఏళ్ల క్రితమే ప్రారంభమయిన ఐటీ మిలన్ వ్యవస్థ ఇప్పుడు బాగా వికసించిందని త్యాగరాజ ఐటీ మిలన్ కు ధ్వజాన్ని అందజేసిన భాగ్యనగర్ ఐటీ మిలన్ సహ కార్యవాహ్ రామకృష్ణ పోనపల్లి అన్నారు. ఇంత తక్కువ కాలంలో ఇలా విస్తరించగలగడానికి కారణం జానకిజి, శ్రీపాద్ జీ వంటి కార్యకర్తల కృషేనని అన్నారు.
ఆర్ ఎస్ ఎస్ శాఖకి ఐటీ మిలన్ కి తేడా ఏమీఉండదు. శాఖ రోజు జరిగితే, ఐటీ మిలన్ వారానికి ఒకసారి జరుగుతుంది. ప్రస్తుతం ఐటీ మిలన్ లకు మైక్రోసాఫ్ట్ , గూగుల్, యాక్సెంచర్, ఐబిఎం, ఒరాకిల్, కాగ్నిజాంట్, విప్రో, ఇన్ఫోసిస్ మొదలైన భారతీయ, విదేశీ కంపెనీలకు చెందిన వారు హాజరవుతున్నారు. ఐటీ మిలన్ ల వల్ల ప్రధానమైన ఉపయోగం ఏమిటంటే స్థానికులతో పాటు, ఉద్యోగం కోసం ఇతర ప్రాంతాలనుండి వచ్చినవారు కూడా ఇందులో పాల్గొనగలుగుతున్నారు.
ఇలా అన్ని ప్రాంతాలవారు ఒకచోటకి రావడం వల్ల మన దేశం, సంస్కృతి, వారసత్వం గురించి చక్కని అవగాన కలుగుతుంది. ఐటీ మిలన్ అంటే లఘు భారతం. అన్నీ భాషల పాటలు పాడతారు. భాష, సంస్కృతి పేరుతో ప్రాంతీయ విభేదాల రెచ్చగొట్టే ప్రయత్నం బయట కొందరు చేస్తున్నప్పుడు మనకు బాధ కలుగుతుంది. మనమంతా ఒకటే, ఈ దేశమంతా ఒకటే అనే భావమే మిలన్ కు వచ్చేవారిలో ఉంటుంది. మిలన్ లు కూడా వికేంద్రీకృత పద్దతిలోనే పనిచేస్తాయి. స్థానిక అవసరాలకు తగినట్లుగా కార్యక్రమాలు రూపొందించుకునే స్వేచ్చ ప్రతి మిలన్ కేంద్రానికి ఉంటుంది. ఏది చేసిన దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిస్వార్ధ బుద్ధితో చేయాలన్నది అంతటా పాటించే సూత్రం.
బాలగోకులం
ఈ కార్యక్రమం ఐదేళ్ల క్రితం ప్రారంభమైంది. సంప్రదాయం, సంస్కృతితో జోడిస్తూ పిల్లల లోని నైపుణ్యాన్ని వెలికి తీయడమే బాలగోకులం లక్ష్యం. ప్రస్తుతం జంట నగరాలలోని 60 గేటెడ్ కమ్యూనిటీలలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రతి వారం 2000 మంది పిల్లలు బాలగోకులంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం చూసిన అనేకమంది మహిళలు తమ ప్రదేశాలలో వీటిని ప్రారంభించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. నిజానికి ఇలా మహిళలు నిర్వహిస్తున్న కార్యక్రమాలే ఇప్పుడు ఎక్కువయ్యాయి. ఇది ఎంతో సంతోషించదగిన విషయం.
సేవా కార్యక్రమాలు
గచ్చిబోలి చుట్టుపక్కల జరిగే ఐటీ మిలన్ ల లోని స్వయంసేవకులు గోపీచంద్ అకాడమీ దగ్గర ఉన్న సేవా బస్తీలో ఉచిత బోధనా కేంద్రాన్ని నడుపుతున్నారు. ఇది ప్రతి రోజు జరుగుతుంది. ఒదిశ, బెంగాల్, బీహార్, ఛత్తీస్ గఢ్ మొదలైన ప్రాంతాలకు చెందిన వారు ఈ సేవా బస్తీలో ఉంటారు. వారి పిల్లలకు చదువుకునే అవకాశం దాదాపు ఉండదు. ఇలాంటి వారిలో 15మంది పిల్లలను దగ్గరలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్చగలిగారు. అలా వారిని చేర్చుకునేందుకు పాఠశాల యాజమాన్యం కూడా ముందుకు రావడం అభినందనీయం. సిద్దిక్ నగర్ అనే మరొక ప్రాంతంలో మిలన్ స్వయంసేవకులు ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఇక్కడ కూడా వివిధ ప్రాంతాలనుండి పనులు చేసుకునేందుకు వచ్చిన వారు ఎక్కువగా ఉంటారు. వీళ్ళు వివిధ బహుళ జాతి కంపెనీల్లో సెక్యూరిటీ గార్డులుగా, హౌస్ కీపర్స్ గా పనిచేస్తుంటారు.
సీనియర్ వృత్తి నిపుణుల మండలి
వివిధ బహుళజాతి కంపెనీలలో ఉన్నత హోదాలో పనిచేస్తున్న వారిని నెలకి ఒకసారి సమావేశపరచే పని మరికొంతమంది స్వయంసేవకులు చేపట్టారు. ప్రస్తుతం ఇలాంటి మండలులు రెండు నడుస్తున్నాయి. మరికొన్ని ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నారు. సమాజంలోని అన్నీ వర్గాలు, స్థాయిల వారిని పనిలో జోడించాలన్నదే దీనివెనుక ఆలోచన.
సంవిత్ కేంద్ర
జాతీయ అంశాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుని, దానిని సమాజంలో అందరికీ పంచడం కోసం సంవిత్ కేంద్రం ఏర్పడింది. పరిశోధన, అధ్యయనంలో ఆసక్తి ఉన్న స్వయంసేవకులు ఒకచోట కలిసి వివిధ అంశాలపై చర్చించి పరిశోధనాత్మక పత్రా ను తయారుచేస్తారు. గత సంవత్సరం సంవిత్ బృందం దీనదయాల్ ఉపాద్యాయ ప్రవచించిన ఏకాత్మ మానవ వాదం పై రూపొందించిన పత్రం జాతీయ సెమినార్ లో పురస్కారం పొందింది.
సేవిక సమితి మిలన్ లు
సంఘ కార్యకర్తల కుటుంబాలలోని మాతృమూర్తులు ప్రతివారం నడిచే సేవికాసమితి మిలన్ లను ప్రారంభించారు. ప్రస్తుతం గచ్చిబోలి, మియాపూర్ లలో ఇటువంటి మిలన్ లు జరుగుతున్నాయి. వీటిలో గురుపూజ ఉత్సవాలు కూడా జరిగాయి.
ఇలాంటి వివిధ కార్యక్రమాలతో పాటు ఐటీ మిలన్ లు అనేక జన జాగరణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటాయి. మాటమార్పిడులకు వ్యతిరేకంగా, చైనా ఉత్పత్తులవల్ల నష్టాలను తెలుపుతూ, స్వదేశిని ప్రోత్సహిస్తూ వివిధ కార్యక్రమాలు ఇప్పటికే స్వయంసేవకులు నిర్వహించారు. దేశపరమవైభవం (సర్వతోముఖ అభివృద్ది) కోసం ఇలా వందలాది స్వయంసేవకులు తమ సమయాన్ని, శక్తిని వినియోగిస్తున్నారు.
ఇటీవల తమ ఐటీ ఉద్యోగాలు వదిలి వ్యవసాయ రంగాన్ని ఎంచుకున్న స్వయంసేవకులు చాలామంది ఉన్నారు. వీళ్ళంతా గ్రామాభారతి కార్యక్రమాలను చేపడుతున్నారు.
ప్రపంచాన్ని మొత్తాన్ని ఒకేసారి మార్చేయాలనుకోకుండా చిన్నచిన్న అడుగుల ద్వారా పెద్ద లక్ష్యాలు చేరుకోవాలన్నది ఐటీ మిలన్ ల ఉద్దేశ్యం. ఎక్కువ ప్రదేశాలలో మిలన్ లు ప్రారంభమై, వాటన్నిటిలో ధ్వజ ప్రదానం జరిగి, అవి కూడా ఇలాంటి కార్యరమాలు చేపట్టగలగాలి. బిందువు బిందువు కలిస్తేనే సింధువు (సముద్రం) అవుతుందని సహ కార్యవాహ్ రామకృష్ణ ముగించారు.