అయోధ్య కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రతిస్పందనను సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ వెల్లడించారు. డిల్లీలో లో జరిగిన పత్రిక విలేకరుల సమావేశంలో ఆయన ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన పూర్తిపాఠం-
శ్రీ రామజన్మభూమికి సంబంధించి గౌరవనీయ సర్వోన్నత న్యాయస్థానం ఈ దేశ ప్రజానీకపు మత విశ్వాసాలు, నమ్మకాలను గౌరవిస్తూ ఇచ్చిన తీర్పును రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్వాగతిస్తోంది. దశాబ్దాలపాటు సాగిన న్యాయ ప్రక్రియ తరువాత చివరి తీర్పు ఇప్పుడు వెలువడింది. ఈ సుదీర్ఘ న్యాయ ప్రక్రియలో శ్రీ రామజన్మభూమికి సంబంధించిన అన్ని విషయాలు, అంశాలను పరిశీలించారు. అన్ని పక్షాలు వినిపించిన వాదనల పరిశీలన కూడా జరిగింది. ఈ సుదీర్ఘ విచారణను కొనసాగించి సత్యం, న్యాయాన్ని వెల్లడించిన న్యాయమూర్తులు, వివిధ పక్షాల తరఫున వాదనలు వినిపించిన న్యాయవాదులకు అనేక అభినందనలు. ఈ సుదీర్ఘ ప్రయత్నంలో పాలుపంచుకున్నవారిని, బలిదానం చేసినవారిని ఈ సందర్భంగా కృతజ్ఞతాపూర్వకంగా గుర్తుచేసుకుంటున్నాము. తీర్పును సానుకూలమైన దృష్టితో స్వాగతించి, స్నేహాసుహృద్భావాలను పరిరక్షించడానికి ప్రభుత్వ స్థాయిలో, అలాగే సమాజస్థాయిలో కృషిచేసిన వారందరి ప్రయత్నాలను కూడా మేము స్వాగతిస్తున్నాము. ఎంతో సంయమనంతో తీర్పు కోసం ఎదురుచూసిన భారతీయ ప్రజానీకం కూడా అభినందనీయులు. ఈ తీర్పును జయాపజయాల దృష్టితో ఏమాత్రం చూడకూడదు. సత్యం, న్యాయం కోసం సాగిన మంథనం నుంచి వెలువడిన నిర్ణయాన్ని సంపూర్ణ దేశపు ఏకాత్మత, బంధుభావాన్ని పెంపొందించేదిగానే చూడాలి, అలాగే ఉపయోగించాలి. చట్టబద్దమైన రీతిలో, సంయమనంతో, సాత్వికమైన పద్దతిలో తమ హర్షాతిరేకాలను వ్యక్తం చేయాలని దేశ ప్రజానీకాన్ని కోరుతున్నాము. ఈ తీర్పు నేపధ్యంలో వివాదాన్ని పూర్తిగా అంతంచేస్తూ ప్రభుత్వం తగిన చర్యలు వెంటనే చేపడుతుందని విశ్వసిస్తున్నాము. గతాన్ని మరచి శ్రీ రామజన్మభూమిలో భవ్యమైన మందిర నిర్మాణంలో అంతా కలసిమెలసి తమ కర్తవ్యాన్ని నిర్వహించాలి.
-స్వేచ్చానువాదం-
మూలం :RSSOrg