సెప్టెంబర్ 20 రుషి పంచమి
గాయత్రీ జపం వల్ల ఎప్పటి పాపాలు అప్పుడే పరిహారమవుతాయని శాస్త్రం. రుషి పంచమి వ్రతం కూడా అలాంటిదే. అయితే మొదటిది పురుష సంబంధిత మహామంత్రం కాగా, రెండవది స్త్రీలకు సంబంధించిన వ్రతాంశం. నిత్య జీవితంలో మహిళలు తెలిసో తెలియకో పాల్పడిన అశుచి దోష నివారణకు ఏడాదికి ఒకసారి ‘రుషి పంచమి’ వ్రతం ఆచరిస్తారు.
మానవుడు తీర్చుకోవలసిన వాటిలో దేవ, పితృ, రుషి రుణాలు ప్రధానమైనవని పెద్దలు చెబుతారు. రుషులను అర్చించడం ద్వారా వారి రుణం తీర్చు కున్నట్లవుతుందని అంటారు. సంపూర్ణ జ్ఞానం కలిగి, పరమాత్మను దర్శించి, వేదవేదాంగాల మర్మమెరిగిన వారే మహర్షులు. విశ్వకల్యాణమే పరమావధిగా జీవించిన వారిని సేవించుకోవడ•మే ‘రుషి పంచమి’ పర్వదిన పరమార్థం. దీనివల్ల ద్వారా పూర్వాపచారాలు నశిస్తాయని విశ్వాసం.
అశుచి దోషాలను పరిహరించే దానిని ‘రుషి పంచమి’ పర్వదినం అంటారు. ఏటా భాద్రపద శుద్ధ పంచమి తిథిని ‘రుషి పంచమి’ వ్రతంగా జరుపు కుంటారు. ఆనాడు సప్తరుషులను షోడశోపచారా లతో అర్చిస్తారు. శరీరంలోని నవరంధ్రాల ద్వారా వెలువడే వ్యర్థాలు లేదా మలినాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోగలుగుతాం. అయితే మహిళలకు రుతు కాలానికి మాత్రం అందుకు మూడు రోజులు పడుతుంది. వారికి అశుచి రావడానికి మూడు రోజుల ముందు నుంచే కడుపునొప్పి, తలనొప్పి, ఒళ్లు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతారు. అందుకే వారికి ఆ మూడు రోజుల పాటు ఎలాంటి పనులు కేటాయించకుండా విశ్రాంతి కాలంగా ప్రకటించారు. దీనిని మూర్ఖత్వంగానో, మూఢాచారంగానే కొట్టి వేయకూడదని, ఆచారం వెనుక ఆరోగ్య రహస్యం దాగి ఉందని పెద్దలు చెబుతారు. రుతుక్రమం పేరిట మహిళలకు విశ్రాం తిని ఇవ్వడంలో శాస్త్రీయత దాగి ఉందని అంటారు.
శాస్త్ర ప్రకారం ఈ అశుచి కాలంలో వంట, ఇంటి పనుల నుంచి వారికి విశ్రాంతిని ఇచ్చేవారు. అయితే పెద్ద, ఉమ్మడి కుటుంబాల కాలంలో ఆ విధానం కొనసాగింది. కాలక్రమేణ చిన్న కుటుం బాలు ఏర్పడడం, భార్యాభర్తలు వృత్తి ఉద్యోగాలు చేయవలసిన అనివార్య పరిస్థితులలో రుతుకాలంలో ఇంటిపట్టున విశ్రాంతికి అవకాశం లేకుండా పోతోంది. దీంతో గృహ సంబంధిత పనుల సందర్భంగా అశుచి కలిసే ఆస్కారం ఉంది. అలాంటి వాటి దోష నివారణకే ఈ రుషిపంచమి వ్రతంగా పెద్దలు నిర్దేశించారు.
వ్రతధారులు/నిర్వాహకులు భాద్రపద శుద్ధ పంచమి (వినాయక చవితి మరునాడు) గంగానదీ జలం, పంకం (బురద), తులసి, రావి చెట్ల మట్టి, గోమయం, గోమూత్రం, గంధపు చెక్క, నువ్వులు మిశ్రమంతో శరీరాన్ని శుభ్రపరచుకోవాలి. శిరస్సు మీద 108 ఆకులు ఉంచి స్నానం చేయాలి. నదిలో కానీ, కాలువ, ఏటి ఒడ్డున, గృహంలో… అవకాశాన్ని బట్టి స్నానవిధిని నిర్వర్తించవచ్చు.
‘మమ రుతు సంపర్క జనిత దోష పరిహారార్థం ‘అరుంధతీ సహిత కశ్యపాది రుషి ప్రీత్యర్థం రుషి పూజనం కరిష్యే…’ అని సంకల్పం చెప్పుకుని ముందుగా గణపతి, నవగ్రహాలను పూజిస్తారు. సప్తర్షులను అర్చించి పంచామృతం, బియ్యం, గంధం, కుంకుమ, పూలు, ఆకువక్కలు,యాలకులు, లవంగాలు, ప్రసాదం సమర్పిస్తారు. హారతి ఇస్తారు. ధాన్యం, పాలు,పెరుగు, ఉప్పు, పంచదార రహిత పదార్థాలతో చేసిన వాటిని ఒంటిపూట ఆహారంగా స్వీకరిస్తారు. సప్తర్షుల గురించి చదవడంతో పాటు వామనావతార ఘట్టాన్ని పారాయణం చేస్తారు.
వ్రత నేపథ్యం
పురాణ కథనం ప్రకారం, ఉద్ధాలక మహర్షి భార్య శరీరంపై నిత్యం క్రిమి కీటకాదులు వాలడంతో తీవ్ర దుఃఖాన్ని అనుభవించేది. భార్య దుస్థితికి కారణం తెలుసుకునేందుకు ఆయన ధ్యానంలోకి వెళ్లగా…గత జన్మలో ఆమె బహిష్ఠు సమయంలో అంటు పాటించ కుండా ఇంట తిరగడం, భాండాలను తాకడం వల్ల ఈ జన్మలో ఈ పరిస్థితి ఎదురైందని, ఈ దోష పరిహారానికి రుషిపంచమి వ్రతాన్ని ఆచరించాలని పరమాత్మ మహర్షికి సూచించాడు. అలా వ్రతం నిర్వహించిన ఆమె శుచిమంతురాలై, జీవితాంతం వ్రతాన్ని ఆచరించిందని కథనం.
శాస్త్రోక్తంగా ఈ వ్రతాన్ని ఆచరించలేని వారికి పెద్దలు సూక్ష్మ మార్గాన్ని సూచించారు. తులసి, రావి చెట్ల మట్టి, ఆవుపేడ, ఆవుమూత్రం, గంధం మిశ్రమంతో శరీరాన్ని శుద్ధి చేసుకొని, సద్బ్రాహ్మ ణుడికి నెయ్యి, చక్కెర, అరటిపళ్లతో దక్షిణ సమర్పించాలని పేర్కొన్నారు.
– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్ జర్నలిస్ట్
జాగృతి సౌజన్యంతో…