విద్యాభారతి విద్యాసంస్థల్లో సంస్కారం నేర్పిస్తారని ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ బండ్లగూడలో జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మనిషి ఒంటరిగా జీవించలేడని, తోడు అవసరమని, జంతువులతో పోల్చుకుంటే మనుషులకు ప్రత్యేక ఆలోచనా శక్తి ఉంటుందన్నారు. మానవజాతి అభివృద్ధి కోసం పర్యావరణానికి కీడు చేయకూడదని సూచించారు. సన్మార్గంలో నడచి స్వలాభం కోసం కాకుండా దేశం కోసం పనిచేయాలని విద్యార్థులకు ఆయన పిలుపునిచ్చారు.
దేశంలోని 130 కోట్ల మందిలో 30 కోట్ల మంది సేవ చేసినా దేశం ఉన్నతంగా ఉంటుందని పేర్కొన్నారు. పిల్లలకు ఇంట్లోనే మన సంస్కృతి, సంప్రదాయాలను బోధించాలని.. వారితో మాతృభాషలోనే మాట్లాడాలని తల్లిదండ్రులకు సూచించారు.
నాణ్యమైన విద్యతో సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. మనిషి ఆలోచనలకు మార్గం చూపించే శిక్షణ కావాలన్నారు. మంచి మనస్సుతో సమర్థవంతంగా చేసే ఏ పనైనా దేశ సేవ కిందకే వస్తుందన్నారు. ఎవరికి ఆసక్తి ఉన్న రంగం వారు ఎంచుకొని ఆ వృత్తిలో రాణించాలని ఆయన కోరారు. స్వార్థం, ఈర్ష్య వంటి వాటిని వీడి దయ, కరుణను అలవర్చుకోవాలని డా. మోహన్ భాగవత్ చెప్పారు.
కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. మన సంస్కృతిని ప్రపంచదేశాలలో చాటాల్సిన అవసరం ఉందన్నారు. సరస్వతి విద్యా పీఠం ఇందుకు ఎంతగానో పాటుపడుతోందని కొనియాడారు.
మరిన్ని వార్తల కోసం సమాచార భారతి ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి
అనంతరం సరస్వతి విద్యా పీఠం ఆధ్వర్యంలో రాబోయే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్న శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బండి సంజయ్, విద్యాభారతి అధ్యక్షుడు రామకృష్ణారావు, దక్షిణ మధ్య క్షేత్ర విద్యా భారతి అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు, సంఘటన కార్యదర్శి సుధాకర్ రెడ్డి, పారిశ్రామికవేత్త ఎంఎస్‌ఆర్‌వీ ప్రసాద్, సేవికా సమితి ప్రధాన కార్యదర్శి అన్నదానం సీత తదితరులు పాల్గొన్నారు.
పూర్వ విద్యార్థి సమ్మేళనం రికార్డులు..
సరస్వతి విద్యాపీఠం రాష్ట్రస్థాయి పూర్వ విద్యార్థి మహా సమ్మేళనం పలు రికార్డులను సాధించింది. ఈ సమ్మేళనానికి తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, అమెరికా, దుబాయ్ నుంచి 15 వేల మంది విద్యార్థులు హాజరైనట్లు రాయల్ సక్సెస్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డు నిర్వాహకులు వెల్లడించారు. భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరవ్వడంతో పలు రికార్డులు సాధించిందని తెలిపారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి పరిషత్ సభ్యులకు రికార్డు పత్రాన్ని అందజేశారు.
Please Like & Follow VSK Telangana on Facebook – Click this link
తెలంగాణ విజయ సంకల్ప శిభిరం సందర్భంగా డా. మోహన్ జీ భాగవత్ ప్రసంగం – Video
సమాచార భారతి యూట్యూబ్ ఛానెల్ subscribe చేసుకునేందుకు క్లిక్ చేయండి