జనవరి 8, 2017, కేశవ్ మెమోరియల్ కాలేజీ నారాయణగూడ, సంభాగ్ (భాగ్యనగర్, సికింద్రాబాద్) ఉద్యోగి సాంఘిక్ లో ప.పూ. సర్‌సంఘచాలక్ మోహన్ భాగవత్ జీ బౌద్ధిక్ సంక్షిప్తంగా:
సంఘది 91 ఏళ్ల చరిత్ర. సంఘ ప్రారంభపు రోజుల్లో ఎవరూ మనం ఇప్పుడు చూస్తున్న భవ్యదృశ్యాన్ని ఊహించి కూడా ఉండరు. కేవలం డాక్టర్జీ పై నమ్మకం, విశ్వాసంతో పని చేసుకుంటూ పోయారు. ప్రారంభంలో సంఘం అంటే సమాజంలో ఉపేక్ష భావం ఉండేది. ఎవరూ మనను పట్టించుకునేవారుకాదు. కానీ మన కార్యం పెరిగినకొద్దీ అందరితోపాటు వ్యతిరేకుల దృష్టి కూడా మనపై పడింది. నిష్ట, త్యాగాలతో కష్టమైన ఆ కాలఖండాన్ని దాటాం.
ప్రస్తుతం సంఘంపట్ల సమాజంలో పూర్తి అనుకూలమైన దృష్టి ఉంది. రాజకీయ ప్రయోజనాల కోసం కొద్దిమంది పైకి విరోధిస్తున్నట్లు కనిపిస్తున్నా లోపల మాత్రం ఈ కార్యంపట్ల అనుకూల భావాన్నే కలిగి ఉన్నారు. ఈ ఉపేక్ష, వ్యతిరకత దశలతోపాటు ఇప్పుడున్న అనుకూలమైన వాతావరణాన్ని కూడా చూస్తున్న వారు కొద్దిమంది ఉన్నారు. సంఘం ఏం చెపితే అది జరుగుతుందని నేడు ప్రపంచం విశ్వసిస్తోంది. మనం చేపట్టిన హిందూ సంఘటనాకార్యం ఇంకా పూర్తి కాలేదు. ఇంకా ఎంతో చేయాల్సి ఉంది.
అఖండ భారతాన్ని తల్లిగా పూజించి, సనాతన ధర్మజీవనాన్ని గడిపేవారు హిందువులు. ఆ ప్రకారం ఇక్కడ ఉన్నవారంతా హిందువులే. వారి పూర్వజులు కూడా హిందువులే. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి హిందువులు 150 కోట్లమంది ఉన్నారనుకుంటే వారిలో స్వయంసేవకుల సంఖ్య కొన్ని లక్షలకు మించదు.
గ్రామీణ ప్రాంతంలో 1శాతం, నగరాల్లో 3శాతం మంది పూర్ణగణవేష్‌ధారీ, తృతీయవర్ష శిక్షితులు, ప్రతిజ్ఞ చేసిన స్వయంసేవకులు ఉంటే మన లక్ష్యం నెరవేరుతుందని డాక్టర్జీ చెప్పారని అంటూ ఉంటాం. స్వయంసేవక్ అంటే కేవలం గణవేష్ ధరించినవాడు కాదు. ప్రవర్తనలో స్వయంసేవకత్వం ప్రకటితమవ్వాలి. ఆజన్మాంతం ఈ కార్యాన్ని చేసే సంకల్పం కావాలి. కార్యకుశలత కోసం తృతీయవర్ష శిక్షణ పొందాలి. కార్యవిస్తరణకు ఇది చాలా అనుకూలమైన సమయం. మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే ఈ కార్యం ఇంకా ఐదురెట్లు పెరగాలి. కనీసం లక్ష స్థానాల్లో శాఖలు ఉండాలి. అవి బస్తీ, గ్రామంపై ప్రభావాన్ని చూపగలిగినవై ఉండాలి. ఇప్పుడు సమాజం మనవైపు చూస్తోంది. సమరసత, పర్యావరణ పరిరక్షణ ఇలా అన్ని పనులు సంఘమే చేయాలని సమాజం ఆశిస్తోంది. 20 ఏళ్ళ నుంచి ఇదే పరిస్థితి (నాగపూర్ గీతాంజలి టాకీస్ మేనేజర్ టిక్కెట్ డబ్బు తరలించడానికి మనుషులు కావాలని కార్యాలయానికి ఉత్తరం రాశాడు). కానీ సమాజంలో అన్ని పనులు మనమే చేయాలని అనుకోవడం లేదు. ప్రతి ఒక్కరు సమాజ కార్యంలో నిమగ్నమవ్వాలి. అందుకు తగిన శిక్షణ సంఘం ఇస్తుంది.
మన పని మూడు రకాలుగా సాగాలి. 1. విస్తరణ. 2. కార్యకర్తల నిర్మాణం. 3. సమాజకార్యం. విస్తరణ పని విద్యార్థి స్వయంసేవకులతోపాటు అందరూ చేయగలరు. కానీ తరువాత రెండు పనులు, కార్యకర్తల నిర్మాణం, సమాజకార్యం మాత్రం వాళ్ళు చేయలేరు. ఎందుకంటే జీవితంలో స్థిరపడినవారికే సమాజంలో గౌరవం లభిస్తుంది. వారి మాటే నలుగురూ వింటారు. సంఘ ప్రారంభదశలో స్వయంసేవకులంతా విద్యార్థులే. పైగా అప్పుడు సమాజం వైపు నుంచి మనపై ఎలాంటి అపేక్ష లేదు. ఇప్పుడు అన్ని పనులు చేయాల్సి వస్తోంది. ఉద్యోగి స్వయంసేవకులు ఆర్థికంగా స్థిరపడినవారు కాబట్టి సామాజిక గౌరవం, అనుభవం ఉంటాయి. వాళ్ళు సామాజిక కార్యక్రమాలు నిర్వర్తించగలరు. సమాజ పరివర్తన కార్యంలో చురుకుగా పాలుపంచుకోగలిగిన కార్యకర్తల అవసరం ఇప్పుడు చాలా ఉంది.
ఒక ఉద్యోగి శాఖ ఉందంటే దాని నుంచి అన్ని కార్యవిభాగాలు, గతివిధులకు అవసరమైన కార్యకర్తలు లభించాలి. అలాగే ఉద్యోగి కార్యకర్తలు సమాజ సమీకరణ (మాస్ మొబిలైజేషన్) చేయగలగాలి. అందుకు తగినట్లుగా సమాజంలోని అన్ని వర్గాలతో సత్సంబంధాలు కలిగి ఉండాలి. ఇటువంటి పనికి తగినట్లుగా ఉద్యోగి శాఖల్లో శారీరిక్, బౌద్ధిక్ కార్యక్రమాలు ఉండాలి. బస్తీ, గ్రామంలో మార్పు తెచ్చే క్షమత ఆ శాఖలకు కలుగుతోందా లేదా అన్నది పరిశీలించాలి. ప్రౌఢ (40 సంవత్సరాల వయస్సు పైబడినవారు) వ్యక్తులకు సమాజంలో గౌరవం, ఆదరణ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు చెప్పిన మాటను అందరూ అంగీకరించి, అనుసరిస్తారు. ఈనాడు సంఘం ఏది చెపితే అది చేయడానికి సమాజం సిద్ధపడుతోంది. కాబట్టి సామాజిక కార్యంలో ప్రౌఢ స్వయంసేవకులు కీలకపాత్ర పోషించాలి. తమ బస్తీలు, గ్రామాల్లో పరివర్తనకు ప్రయత్నించాలి. ఆ పరివర్తన తమతమ ఇళ్ళ నుండి ప్రారంభం కావాలి. ఆచరించి చూపడం ద్వారా మార్పును తేవాలి. ఈ ఆచరణనే విద్యార్థి స్వయంసేవకులు చూసి నేర్చుకుంటారు.
సమాజం ఇప్పుడు సంఘం చెపుతున్న ఆదర్శాన్ని, కార్యపద్ధతిని నిశితంగా పరిశీలిస్తోంది. స్వయంసేవకులు ఏం చెపుతున్నారు? చెప్పినదే చేస్తున్నారా? అని గమనిస్తోంది.సామాజిక మూల్యాంకన (సోషల్ ఇవాల్యుయేషన్) ప్రారంభమైంది. (నాగపూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పత్రికలవాళ్ళు వ్యక్తినిర్మాణం ద్వారా దేశ నిర్మాణం అనే అంశంపై మాట్లాడమని నన్ను అడిగారు.) కాబట్టి స్వయంసేవకులు ఆచరణ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. వ్యక్తిగత, కౌటుంబిక, వృత్తిపరమైన, సామాజిక ఆచరణ ఆదర్శవంతంగా ఉండేట్లు చూసుకోవాలి. అలా ఉన్నప్పుడు సమాజం మనను అనుసరిస్తుంది. అదే పరివర్తనకు దారితీస్తుంది. కాబట్టి ఉద్యోగి స్వయంసేవకులు పర్యటన, సమీకరణ (మొబిలైజేషన్), గతివిధుల విస్తరణ, ఆదర్శవంతమైన ఆచరణ చేయగలగాలి. అప్పుడే మనం ఆశించిన సామాజిక పరివర్తనను సాధించగలం. ఒకటి మాత్రం నిజం. రాగల 15,20 ఏళ్ళలో మనం కోరుకుంటున్న సమాజ నిర్మాణం చేయగలుగుతాం. అటువంటి సమాజాన్ని మనం చూడగలగుతాం. ఆ విధంగా మనం అదృష్టవంతులం. కనుక అలాంటి సమాజ పరివర్తన కోసం మరింత చురుకుగా పనిచేయాలని, చేస్తామని ఆశిస్తూ ముగిస్తాను.