Home News సంఘకార్యంలో పెరుగుతున్న యువత సంఖ్య: ఆరెస్సెస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ అరుణ్ కుమార్

సంఘకార్యంలో పెరుగుతున్న యువత సంఖ్య: ఆరెస్సెస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ అరుణ్ కుమార్

0
SHARE

ఝాన్సీ: సంఘ కార్యం పట్ల యువతరం బాగా ఆసక్తి చూపుతున్నారని, సంఘకార్యంలో భాగస్వాములవుతున్నవారి సంఖ్య వేగంగా పెరుగుతున్నదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ శ్రీ అరుణ్ కుమార్ అన్నారు. మారుతున్న పరిస్థితులు, అవసరాలను దృష్టిలో పెట్టుకుని సంఘ 6 కొత్త గతివిధులను (కార్యవిభాగాలు) ప్రారంభించింది. ఇందులో పర్యావరణ పరిరక్షణ, గ్రామవికాసం, గో సంరక్షణ, సామాజిక సమరసత, కుటుంబ ప్రబోధన్ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సామూహిక శక్తిని జాగృతపరచడం ద్వారా వివిధ సామాజిక లోపాలను దూరం చేయవచ్చును. స్థానిక ఎస్ ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న యోజన వర్గ సందర్భంగా శ్రీ అరుణ్ కుమార్ పత్రికా ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు.

2010 నుండి సంఘ కార్యం నిరంతరంగా విస్తరిస్తూ, అభివృద్ధి చెందుతోందని ఆయన తెలియజేశారు. దీనికి కారణం సంఘకార్యానికి అనుకూలత, అంగీకారం పెరగడమేనని ఆయన వివరించారు. అందువల్లనే 2010లో శాఖల సంఖ్య 40వేలు ఉంటే 2019 నాటికి అవి 60వేలకు పెరిగాయని ఆయన అన్నారు. సంఘాన్ని గురించి తెలుసుకోవాలని, సంఘకార్యంలో పాలుపంచుకోవాలన్న ఆసక్తి ప్రజలలో బాగా పెరిగింది. 2012 జూన్ నుంచి 2019 జూన్ వరకు సంఘ కార్యంలో పాలుపంచుకోవాలని ఆసక్తి చూపుతూ ఆన్ లైన్ లో తమ పేరు నమోదు చేసుకున్నవారి సంఖ్య 6లక్షలకు చేరింది. ఇందులో 2018 సంవత్సరంలో 1.5 లక్షలమంది, 2019 లో ఇప్పటి వరకు జరిగిన ఆరు నెలల కాలంలో 67వేలమంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. 40 సంవత్సరాలకు పైబడిన వయస్సు కలిగిన వారికోసం ప్రత్యేకంగా 6వేలకు పైగా శాఖలు నడుస్తున్నాయి. అలాగే 20-40 ఏళ్ల వయస్సు కలిగినవారి కోసం 16వేల శాఖలు జరుగుతున్నాయి. అలాగే 37 వేల శాఖలకు పాఠశాల, కళాశాల విద్యార్ధులు వస్తున్నారు.

సంఘలో యువతరం సంఖ్య వేగంగా పెరుగుతోందని ఆయన అన్నారు. దేశం మొత్తంలో వెయ్యికి పైగా ప్రశిక్షణ వర్గాలు జరుగుతాయి. వీటిలో 7రోజులపాటు జరిగే ప్రాధమిక శిక్షవర్గాలో ప్రతి సంవత్సరం 1లక్ష 25వేలమంది శిక్షణ పొందుతున్నారు. అందువల్లనే సంఘం అన్నీ వర్గాలకు వ్యాపించి సమాజంలోని లోపాలను దూరం చేయాలని అపేక్షిస్తున్నారు. పర్యావరణ కాలుష్యం పెరిగిపోతున్న నేపధ్యంలో జల సంరక్షణ, చెట్లు నాటడం, ప్లాస్టిక్ వాడకం నిరోధించడం వంటి కార్యక్రమాలను సంఘ్ కొత్తగా చేపట్టింది. అంతేకాదు గ్రామ వికాసం, గోసేవ, గోసంరక్షణ పైన కూడా సంఘ దృష్టి సారించింది. సామాజిక సమరసతను పెంపొందించడం కోసం ధార్మిక, సామాజిక సంస్తలన్నిటితో కలిసి సామాజిక సద్భావాన్ని పెంపొందించడానికి కృషి చేస్తోంది. కుటుంబ వ్యవస్థ మన బలమని, దానిని కాపాడుకునే ప్రయత్నంగా సంఘ్ కుటుంబ ప్రబోధన కార్యక్రమాన్ని కూడా చేపట్టిందని శ్రీ అరుణ్ కుమార్ తెలియజేశారు. సంఘకార్యం పెరుగుతున్న కొద్ది సంఘ్ పట్ల సమాజపు అపేక్ష కూడా పెరిగింది. వివిధ రంగాల్లో సమాజపు ఆపేక్షను నెరవేర్చడం కోసం అవసరమైన కార్యకర్తలను తీర్చిదిద్దాడానికి ప్రశిక్షణ కార్యక్రమాన్ని 5 ఏళ్ల క్రితం సంఘ ప్రారంభించింది. ఎందుకంటే సంఘకార్యానికి మూలం కార్యకర్త.

దేశంలోని వివిధ ప్రాంతాలను సంఘ కార్యం కోసం 300 విభాగ్ లు, 800 జిల్లాలుగా విభజించుకున్నామని ఆయన తెలియజేశారు. 9వేలమంది జిల్లా స్థాయి కార్యకర్తలకు, 1వెయ్యిమంది క్షేత్రస్థాయి కార్యకర్తలకు గత 5 ఏళ్లలో శిక్షణ ఇచ్చామని ఆయన వెల్లడించారు. ప్రస్తుతపు యోజక వర్గలో దేశం మొత్తం నుంచి వచ్చిన 140 మంది కార్యకర్తలు పాల్గొంటున్నారని ఆయన తెలియజేశారు.

పత్రికా సమావేశంలో అఖిల భారతీయ సహ ప్రచార ప్రముఖ్ నరేంద్ర కుమార్ ఠాకూర్, ప్రాంత కార్యవాహ అనీల్ శ్రీవాత్సవ కూడా పాల్గొన్నారు.